e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home టాప్ స్టోరీస్ పిల్లల కోసం 5 వేల పడకలు

పిల్లల కోసం 5 వేల పడకలు

పిల్లల కోసం 5 వేల పడకలు
  • కరోనా మూడోదశ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు
  • హైకోర్టుకు నివేదించినరాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌, జూన్‌ 9 (నమస్తే తెలంగాణ)ః రాష్ట్రంలో మూడోదశ కరోనా వ్యాప్తిలో పిల్లలపై ప్రభావం ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం అయిదు వేల పడకలను పిల్లల కోసం ఏర్పాటు చేశామని తెలిపింది. హైదరాబాద్‌ నిలోఫర్‌లో ఇప్పటికే ఉన్న వెయ్యి పడకలకు అదనంగా మరో వెయ్యి పడకలు సిద్ధంచేశామని పేర్కొన్నది. ఇందుకు అవసరమైన వైద్య సిబ్బంది, శిక్షణ, ఇతర చర్యలు తీసుకుంటున్నట్టు వివరించింది. ఈ మేరకు ప్రజారోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్‌ జీ శ్రీనివాసరావు హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. కరోనాపై దాఖలైన వేర్వేరు ప్రజాహిత వ్యాజ్యాలపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు గత నెల 29 నుంచి రోజుకు సగటున లక్ష వరకూ చేస్తున్నామని, ప్రభుత్వాసుపత్రుల్లోని 25,366 పడకలను ఆక్సిజెన్‌ బెడ్లుగా మార్పు చేస్తున్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే 10,366 పడకలను ఆక్సిజన్‌ బెడ్లుగా మార్చామని, మిగిలినవాటిని కూడా మారుస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 132 ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వెల్లడించారు. కరోనా వైద్యసేవల పేరుతో ఆస్పత్రులు దోపిడీకి పాల్పడితే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌
లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠినచర్యలు తీసుకుంటున్నారని డీజీపీ మహేందర్‌రెడ్డి మరో అఫిడవిట్‌ దాఖలుచేశారు. ఏప్రిల్‌ 1నుంచి ఈ నె ల 7 వరకు 8.79 లక్షల కేసులను నమోదుచేశామని తెలిపారు. భౌతికదూరం పాటించకుండా గుంపులుగా కూడినవాళ్లపై 48,643 కేసులు నమోదుచేశామని వెల్లడించారు. కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై 3.43 లక్షల కేసులు నమోదు చేశామని, కరోనా ఇంజక్షన్లు, మందులు బ్లాక్‌ మార్కెటింగ్‌కు పాల్పడేవాళ్లపై 160 కేసుల ను నమోదుచేశామని, మాస్క్‌ పెట్టుకోని వారిపై 4.56 లక్షల కేసులు నమోదు చేశామని తెలిపారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదిస్తూ, హైకో ర్టు ఆదేశాలను అమలుచేస్తున్నామని, లాక్‌డౌన్‌, కర్ఫ్యూ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయని చెప్పారు. ఫలితంగానే కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. గురువారంనుంచి లాక్‌ డౌన్‌ సడలింపు అమల్లోకి వస్తుందని తెలిపారు. వాదనల తర్వాత హైకోర్టు.. వైద్య, ఆరోగ్య శాఖలో ఆరువేలకుపైగా ఔట్‌సోర్సింగ్‌ పోస్టులను ఎప్పటిలోగా భర్తీచేసేదీ చెప్పాలని ప్ర భుత్వాన్ని కోరింది. ప్రైవేట్‌ దవాఖానల్లో కరోనా వైద్య బిల్లులకు గరిష్ఠ ధరలను నిర్ణయిస్తూ రెండువారాల్లోగా జీవో జారీ చేయాలని స్పష్టంచేసింది. కరోనా కష్టకాలంలో పేదలకు రేషన్‌ పంపిణీ చర్యల గురించి వివరించాలని చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.

కేంద్రంపై హైకోర్టు ఆగ్రహం
కరోనా చికిత్సలకు వాడే లైఫ్‌ సేవింగ్‌ డ్రగ్స్‌ను అత్యవసర మందుల లిస్ట్‌లో చేర్చాలన్న తమ ఆదేశాల్ని ఎందుకు అమలు చేయలేదని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. ప్రజల ప్రాణాలు పోతుంటే పట్టదా? ప్రజల జీవితాలతో చెలగాటం ఆడతారా? అత్యవసర మందుల లిస్ట్‌లో చేర్చేదీ లేనిదీ చెప్పకుండా కాలయాపన చేస్తే ఎలా? మందుల ధరల్ని తగ్గించేలా చర్యలు చేపట్టాలన్న ఉత్తర్వులనూ అమలు చేయలేదు. ఏమనుకుంటున్నారు? ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడతారా? అని కేంద్ర సర్కార్‌ను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్పీపీఏ) డిప్యూటీ డైరెక్టర్‌ సాదాసీదా వివరాలతో నివేదిక అందజేశారని ఆక్షేపించింది. పూర్తి వివరాలతో తదుపరి విచారణ నాటికి నివేదిక సమర్పించాలని తేల్చి చెప్పింది. ప్రజల ఆరోగ్యంలో ఆటలాడితే ఎలాగని ఎన్పీపీఏ డైరెక్టర్‌ను నిలదీసింది. ప్రజల జీవితాలతో చెలగాటమాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వ్యాఖ్యానించింది. విచారణకు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజా ఆరోగ్య విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ జీ శ్రీనివాసరావు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు.

రూ.65 లక్షలు బాధితులకు ఇప్పించాం-రిజ్వీ
ప్రైవేట్‌, కార్పొరేట్‌ దవాఖానల్లో కరోనా, బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు చేసే చికిత్సలకు గరిష్ఠంగా ధరలు నిర్ణయించేందుకు 4 వారాల సమయం కావాలని కోరుతూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటే రోజుకు పది లక్షల మందికి వ్యాక్సినేషన్‌ చేయగలమని తెలిపారు. మూడు మాసాల్లో అందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలనే యోచనలో ఉన్నామని తెలిపారు. 135 దవాఖానలపై వచ్చిన ఫిర్యాదులను విచారించి రూ.65 లక్షలు బాధిత రోగులకు ఇప్పించామని పేర్కొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పిల్లల కోసం 5 వేల పడకలు

ట్రెండింగ్‌

Advertisement