శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 08, 2020 , 02:10:17

5 లక్షలు కడితేనే శవం ఇస్తాం!

5 లక్షలు కడితేనే శవం ఇస్తాం!

  • కరోనా వైద్యానికి రూ. 12 లక్షల బిల్లు
  • రూ.7 లక్షల చెల్లింపు..చికిత్సలో రోగి మృతి
  • బిల్లు చెల్లించలేమని బంధువుల ఆందోళన

బేగంపేట: సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ దవాఖానలో ఒకరు కొవిడ్‌-19తో చికిత్స పొందూతూ మృతి చెందారు. అప్పటి వరకు చికిత్సకోసం రూ.7 లక్షలను బాధితుడి కు టుంబీకులు చెల్లించారు. రూ. 12 లక్షల బిల్లు అయిందని, మరో ఐదు లక్షలు ఇస్తేగానీ మృతదేహం ఇవ్వలేమని దవాఖాన యాజమాన్యం తెలిపింది. యాదగిరిగుట్టకు చెందిన  ఓ వ్యక్తి (28) అనారోగ్యంతో గత నెల 23న సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ వైద్యశాలలో చేరాడు. అతనికి 24న కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్‌ అని తేలింది. 26న పాజిటివ్‌గా వచ్చింది. చికిత్స పొందుతున్న వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. మృతదేహాన్ని ఇచ్చేందుకు మరో రూ. 5 లక్షలు కావాలనటంతో మృతుడి కుటుంబీకులు ఆందోళన చేశారు. చివరకు రూ. 20 వేలు కట్టించుకోని మృతదేహాన్ని అప్పగించగా.. ఎర్రగడ్డ శ్మశానవాటికలో అంత్యక్రియలు చేశారు.

8 లక్షలు కట్టండి.. రోగిని చూపిస్తాం

సికింద్రాబాద్‌ గ్యాస్‌మండికి చెందిన ఓ వ్యక్తి (55) కరోనా లక్షణాలతో గత నెల 13న సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ ప్రాంతంలోని ఓ కార్పొరేట్‌ దవాఖానలో చేరాడు.కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. ఇన్సూరెన్స్‌తో కలుపుకొని రూ. 5 లక్షల బిల్లు చెల్లించారు. మొత్తం రూ. 13 లక్షల బిల్లు అయ్యిందని, ఇంకా రూ. 8 లక్షలు కట్టాలని దవాఖాన వారు ఒత్తిడి తెస్తున్నట్టు బాధితుడి కుటుంబీకులు తెలిపారు. డబ్బులు కట్టనందున రోగిని చూసేందుకు అనుమతించడం లేదు. కనీసం బతికి ఉన్నాడో..? లేదో..? అనేది కూడా చెప్పడం లేదంటున్నారు. 


logo