శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 04, 2020 , 03:43:29

ఖజానా కళకళ

ఖజానా కళకళ

  • గాడిన పడుతున్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ
  • జూన్‌ రాబడి 5,962 కోట్లు 
  • గాడిన పడుతున్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ
  • జూన్‌లో రూ.5,962 కోట్ల వరకు రాబడి
  • గత ఏడాదితో పోల్చితే వెయ్యి కోట్లు అదనం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌తో సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్ర ఆర్థికవ్యవస్థ క్రమంగా గాడిన పడుతున్నది. ఆంక్షల సడలింపుతో పరిశ్రమలు తెరుచుకోవడం, అమ్మకాలు, కొనుగోళ్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు ప్రారంభమవటంతో ఖజానాకు రాబడులు పెరుగుతున్నాయి. గత నెలలో రాష్ట్ర ఖజానాకు వాణిజ్యపన్నులు, ఎక్సైజ్‌, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, మైనింగ్‌శాఖల ద్వారా రూ.5,962 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది జూన్‌లో వచ్చిన ఆదాయం కన్నా ఈ ఏడాది రూ.1060 కోట్లు ఎక్కువ వచ్చింది. ఈ లెక్కన 21 శాతం అధిక ఆదాయం లభించింది. ఐజీఎస్టీలో రాష్ట్రవాటా, బాండ్ల ద్వారా సమీకరించిన నిధులను కలుపుకొంటే గత నెల ఖజానాలో రూ.11వేల కోట్ల వరకు జమయ్యాయి. 

పెరిగిన పన్ను ఆదాయం 

దాదాపు మూడు నెలల లాక్‌డౌన్‌తో ప్రజలు ఇండ్లకే పరిమితవడం, దాదాపు పరిశ్రమలన్నీ మూతపడటం, వ్యాపారాలు మందగించటంతో ఆర్థిక లావాదేవీలు స్తంభించాయి. లాక్‌డైన్‌ ఆంక్షల సడలింపు తర్వాత పరిశ్రమలు తిరిగి తెరుచుకున్నాయి. ఉత్పత్తితోపాటు అమ్మకాలు, కొనుగోళ్లు పెరిగాయి. ఫలితంగా పన్నుల ఆదాయం గణనీయంగా వసూలైంది. జూన్‌లో వాణిజ్య పన్నులరూపంలో రాష్ట్ర ఖజానాకు రూ.3,766 కోట్లు వచ్చాయి. గత ఏడాది జూన్‌తో పోల్చితే రూ.336 కోట్లు అధికంగా రావడం విశేషం. గత ఏడాదితో పోల్చితే రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా రాబడి కాస్తతగ్గినా.. ఎక్సైజ్‌శాఖ (115శాతం), మైనింగ్‌ శాఖ (40శాతం) అధిక రాబడులు సాధించాయి. మే నెల వరకు రూ.30 కోట్లు దాటని రిజిస్ట్రేషన్ల రాబడి జూన్‌లో ఒక్కసారే రూ.460 కోట్ల వరకు చేరుకున్నది. ఈ భరోసాతోనే రాష్ట్ర ప్రభుత్వం గత నెల కాలానికి ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించేందుకు ఉపక్రమించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల ద్వారా గత నెలలో దాదాపు రూ.4,500 కోట్ల వరకు సేకరించింది. రాష్ట్ర పరపతి దృష్ట్యా ఈ నిధులు తక్కువ వడ్డీకే సమకూరాయి. దీనికి ఐజీఎస్టీలో రాష్ట్ర వాటాను కలుపుకొంటే రూ.11వేల కోట్ల వరకు ఆదాయం వచ్చినట్టేనని అధికారులు చెప్తున్నారు. logo