బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 15:29:54

35 వేల పండ్ల మొక్క‌ల‌తో 46 మంకీ ఫుడ్ కోర్టులు

35 వేల పండ్ల మొక్క‌ల‌తో 46 మంకీ ఫుడ్ కోర్టులు

న‌ల్ల‌గొండ : నివాస ప్రాంతాల్లో కోతుల‌తో ప‌డే బాధ‌లు అన్నిఇన్ని కావు. ఇంట్లో పండ్ల చెట్లు ఉంటే ప‌క్వానికి రాక‌ముందే ఖ‌తం చేస్తాయి. గ‌మ‌నించ‌లేదా ఇంట్లోకి ప్ర‌వేశించి నానా బీభ‌త్సం సృష్టిస్తాయి. కొన్నిసార్లు చిన్నారులు, పెద్ద‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డుతుంటాయి. కోతుల గుంపు ఉంది అంటే అక్క‌డినుంచి వెళ్లేందుకు ఎవ‌రూ స‌హ‌సం చేయ‌రు. ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్ర‌జ‌ల బాధ‌కు కాస్త ఉప‌శ‌మ‌నంగా కోతుల కోస‌మే ప్ర‌త్యేకంగా పండ్ల మొక్క‌ల‌ను నాటే కార్య‌క్రమానికి న‌ల్ల‌గొండ జిల్లా యంత్రాంగం శ్రీ‌కారం చుట్టింది. 87.7 ఎక‌రాల్లో 35 వేల అడ‌వి పండ్ల మొక్క‌ల‌తో 46 మంకీ ఫుడ్ కోర్టుల ఏర్పాటును ప్రారంభించింది. తెలంగాణ‌కు హ‌రిత‌హారం ఆరు ద‌శ‌ల్లో భాగంగా 46 గ్రామాల్లో అందుబాటులో ఉన్న ఓపెన్ ల్యాండ్‌, అట‌వీ ప్రాంతాల్లో ఈ మొక్క‌ల పెంప‌కాన్ని చేప‌ట్టింది. మారేడు, చింత‌, ప‌న‌స‌, జువ్వీ, సీమ‌చింత‌, వెల‌గ‌, మేడి, సీతాఫ‌లం వంటి పండ్ల మొక్క‌ల‌ను నాటారు. 

ఈ 46 మంకీ ఫుడ్ కోర్టుల్లో క‌న‌గ‌ల్ మండ‌లంలో ఆరు, దేవ‌ర‌కొండ‌, తిప్ప‌ర్తి, పీఏ ప‌ల్లి, దామ‌ర‌చెర్ల‌, చందంపేట‌, తిరుమ‌ల‌గిరి(సాగ‌ర్‌), నార్కెట్‌ప‌ల్లి, మునుగోడు, చిట్యాల మండ‌లాల్లో ఒక్కొటి అదేవిధంగా న‌ల్ల‌గొండ‌, అడ‌విదేవుల‌ప‌ల్లి, నాంప‌ల్లి, త్రిపురారం, గుర్రంపోడు, గుండ్ల‌ప‌ల్లి, అనుముల‌, మిర్యాల‌గూడ‌, మ‌ర్రిగూడ‌, శాలిగౌరారం మండ‌లాల్లో రెండేసి చొప్పున‌.. నిడ‌మ‌నూరు మండ‌లంలో మూడు, చింత‌ప‌ల్లి మండ‌లంలో ఐదు మంకీ ఫుడ్ కోర్టుల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు డీఆర్‌డీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ నర్సింహారావు తెలిపారు. 


logo