హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): జీవితంలో మనసుకు కలిగిన ఓ బాధ ఆయనను రక్తదానం వైపు నడిపించింది. ప్రాణాపాయంలో ఉన్న ఎంతోమందికి భరోసా కల్పించింది. రక్తదానం, ప్లేట్లెట్ల దానంతోపాటు ప్లాస్మా దానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు డాక్టర్ సంపత్‌కుమార్. 20 ఏండ్లుగా అత్యధిక సార్లు రక్తం, ప్లేట్లేట్లు దానంచేసి గౌరవ డాక్టరేట్ పొందారు. ‘కరోనాకు ప్లాస్మానే మందు. కరోనా నుంచి కోలుకున్న ఎవరైనా 28 రోజుల తరువాత ప్లాస్మా దానం చేయెచ్చు. నేను కరోనా నుంచి కోలుకున్నాక ఇప్పటివరకు 22 సార్లు ప్లాస్మా దానం చేసి 44 మంది ప్రాణాలు కాపాడాను’ అని సంపత్‌కుమార్ చెప్తున్నారు. ఒక యూనిట్ ప్లాస్మా ఇద్దరిని కాపాడుతుందని, కరోనా వచ్చి కోలుకున్న ఆరోగ్యకరమైన వ్యక్తి వారానికి ఒకసారి ప్లాస్మా దానం చేయొచ్చని తెలిపారు. అత్యధికసార్లు ప్లాస్మా దానంచేసిన ఆయన శనివారం నమస్తే తెలంగాణకు ఇచ్చిన ఓ ఇంటర్వూలో మాట్లాడారు.
ప్లాస్మా దానం చేస్తే సైడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటాయా?
ప్లాస్మా దానంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. నేను కరోనా నుంచి కోలుకొన్నాక ఐపీఎస్ సజ్జనార్ ప్లాస్మాదాతలు రిజిస్టర్ అవ్వాలని ఒక సైట్‌ను ఏర్పాటుచేశారు. అందులో రిజిస్టర్ అయి కమిషనరేట్ తరఫున ఎప్పుడు అవసరమైతే అప్పుడు ప్లాస్మా దానంచేస్తున్నాను.
21 సంవత్సరాలకే రక్తం, ప్లేట్లెట్లు దానంచేయాలనే ఆలోచన ఎలా వచ్చింది?
నాకు 21 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు గాంధీ దవాఖానలో ఒకరు యూనిట్ రక్తం అందక చనిపోయారు. ఆ వార్త తెలుసుకొన్నాక.. ఆ రోజు సాయంత్రమే ఒక వ్యక్తికి రక్తదానం చేశా. అప్పటినుంచి చేస్తూనే ఉన్నా. నా స్నేహితులు, తెలిసినవారితో రక్తదానం చేయిస్తూ 20 ఏండ్లలో 20 వేల మంది రక్త అవసరాలు తీర్చగలిగాను. సోషల్ మీడియాలో రక్త, ప్లాస్మా, ప్లేట్లెట్లు దానంచేయాలని ప్రమోట్ చేస్తుంటాను. ప్రతి ఏడాది 4 సార్లు చొప్పున ఇప్పటివరకు 84 సార్లు రక్తదానం, 133 సార్లు ప్లేట్లెట్లు, 22 సార్లు ప్లాస్మాదానం చేశాను.
రక్తం, ప్లాస్మా దానంచేస్తే మీకేం వస్తుంది. ఇంట్లో కుటుంబసభ్యులు అడ్డుచెప్పరా.?
రక్తం, ప్లాస్మా, ప్లేట్లెట్లు దానంచేసిన ప్రతిసారి దండాలు పెడుతారు. సన్మానాలు చేస్తారు. బతకడానికి నాకు ఒక బ్యూటీ పార్లర్ ఉన్నది. అదే నా ఆదాయమార్గం. మా ఆవిడ సాఫ్ట్వేర్ ఉద్యోగి. తనకు రక్తదానం గురించి తెలుసు, అవగాహన ఉన్నది. ఎదుటివారికి సాయం చేస్తుంటారని సంతోషపడుతుంది. ఇంట్లో వారంతా సహకరిస్తారు.
కొవిడ్ నుంచి కోలుకుని ప్లాస్మా దానం చేయాలనుకునేవారికి మీరిచ్చే సందేశం ఏమిటి?
మనం ఒకరికి ప్లాస్మా దానం చేస్తున్నామంటే వారి కుటుంబాన్ని ఆదుకొంటున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మంచి అలవాట్లు ఉన్నవారిలో వందకు 10శాతం మందే కరోనా బారినపడ్డారు. అందుకే వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం తప్పనిసరి.