మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Sep 29, 2020 , 02:40:48

ప్రాజెక్టుల పారుగంత... 52 లక్షల ఎకరాలు

ప్రాజెక్టుల పారుగంత...  52 లక్షల ఎకరాలు

  • నాలుగేండ్ల క్రితంతో పోలిస్తే రెట్టింపు 
  • ఆరేండ్లలోనే కొత్తగా 44 లక్షల ఎకరాలకు
  • జీవం పోసిన రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం
  • సాకారం దిశగా కోటి ఎకరాల మాగాణం

ధనయజ్ఞంగా అపఖ్యాతికెక్కిన జలయజ్ఞంలో.. పదేండ్లలో పదిలక్షల ఎకరాలకు సాగునీరు నోచుకోని తెలంగాణ.. ఆరేండ్లలోనే చరిత్రను తిరగరాస్తున్నది! ప్రాజెక్టుల పేరుతో స్థిరీకరణైతేనేమి.. కొత్త ఆయకట్టు అయితేనేమి.. కనాకష్టంగా ఆరున్నర లక్షల ఎకరాలకే పరిమితమైన ప్రాంతంలో తాజా వానకాలం సీజన్‌లో ఏకంగా 52 లక్షల ఎకరాల పంటపొలాలు ప్రాజెక్టుల నీటితో తడిసిముద్దవుతున్నాయి! పుష్కలంగా కురిసిన వర్షాలు.. వాటితో వచ్చిన వరదలు.. ఆ నీటిని ఒడిసిపట్టే పటిష్ఠమైన వ్యవస్థలు.. వాటినుంచి నీటిని పొలాలకు పారించే బలమైన సంకల్పాలు.. వెరసి.. కోటి ఎకరాల మాగాణం స్వప్నాన్ని సాకారం చేసుకునే దిశగా తెలంగాణ వేగంగా అడుగులు వేస్తున్నది. ఈసారి వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, నదులు ఉప్పొంగిన నేపథ్యంలో యాసంగి పంటలకూ సాగునీటికి ఢోకా లేదనే భరోసాతో రైతన్న దిలాసాగా ఉన్నాడు. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఆరేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ఆ ఫలాలు ఇప్పుడు రైతులకు అందుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పరిధిలో 2004 నుంచి 2014 వరకు పదేండ్లకాలంలో అన్నిరకాల ప్రాజెక్టుల కింద కొత్త ఆయకట్టుతోపాటు స్థిరీకరణ అనేది కేవలం 6.64 లక్షల ఎకరాల్లోనే సాధ్యమైంది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం మిషన్‌ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ మొదలు భారీ ప్రాజెక్టుల వరకు ప్రణాళికాబద్ధంగా నిధులు వెచ్చించడంతో ఏటేటా ప్రాజెక్టుల కింద ఆయకట్టు విస్తీర్ణం కూడా పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా వానకాలం సీజన్‌లో జలాశయాల కింద రికార్డుస్థాయిలో 52 లక్షల ఎకరాల్లో సాగునీరు అందడమనేది చెప్పుకోదగిన విషయం. శ్రీరాంసాగర్‌ పరిధిలో పూర్తిస్థాయి ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందుతున్నది. దేవాదుల కింద వందల చెరువులు నిండుకుండలా మారాయి. ఉమ్మడి పాలమూరులోనే జూరాల, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, భీమా, ఆర్డీఎస్‌ కింద 8 లక్షల ఎకరాలకుపైగా సాగునీరు అందుతున్నది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల ద్వారా వేల చెరువులకు జీవంపోశారు.

అనూహ్య ఫలితాలు

రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల ప్రాజెక్టులను పూర్తిచేస్తుండటంతో వాటి కింద సాగు విస్తీర్ణం కూడా అనూహ్యంగా పెరుగుతున్నది. 2016-17 వానకాలం సీజన్‌లో 25.05 లక్షల ఎకరాలకు మాత్రమే ప్రాజెక్టుల కింద సాగునీరు అందింది. ఆపై క్రమంగా విస్తీర్ణం పెరుగుతూ.. ఇప్పుడు తాజా వర్షాకాలంలో అందుకు రెట్టింపుస్థాయిలో సాగునీరు అందుతున్నది. గతంలో వానకాలం, యాసంగి విస్తీర్ణాన్ని పరిశీలించినా గత ఏడాది ప్రాజెక్టుల కింద సాగైన ఆయకట్టు గరిష్ఠంగా 66.88 లక్షల ఎకరాలకు చేరుకున్నది. తాజా సంవత్సరంలో వానకాలంలో 52 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, యాసంగి సాగుతో మొత్తం 1.25 కోట్లకుపైగా ఎకరాలకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


logo