శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 07, 2020 , 01:43:26

ఒక్కరోజే 400 రిజిస్ట్రేషన్లు

ఒక్కరోజే 400 రిజిస్ట్రేషన్లు

  • రాష్ట్రవ్యాప్తంగా పుంజుకున్న ప్రక్రియ 
  • కార్యాలయాల్లో కఠిన నిబంధనలు
  • ఐదుగురికే అనుమతి.. మాస్క్‌ తప్పనిసరి  
  • గత నెలలో రూ.23.21 కోట్ల రాబడి

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు పుంజుకున్నాయి. లాక్‌డౌన్‌లో నెలరోజులుగా రిజిస్ట్రేషన్లు పరిమితంగానే జరుగుతుండగా, తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా 141 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు పూర్తిస్థాయిలో తెరుచుకున్నా యి. కార్యాలయాలు మళ్లీ కళకళలాడుతున్నాయి. బుధవారం ఒక్కరోజే దాదాపు 400 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి హైదరాబాద్‌, రంగారెడ్డితోపాటు ప్రధాన జిల్లాల్లో నామమాత్రపు సిబ్బందితో అత్యవసరమైన రిజిస్ట్రేషన్లు జరిగాయి. గత నెలలో 4,818 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ రుసుం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.23.21 కోట్ల రాబడి వచ్చింది. సాధారణ పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ల రుసుం ద్వారా రాష్ట్ర ఖజానాకు నెలకు రూ.500 నుంచి 600 కోట్ల రాబడి వస్తుం ది. ఈ నెల ఆరంభం నుంచి రిజిస్ట్రేషన్లు స్వల్పంగా పెరిగాయని, నాలుగు రోజుల్లో 1,277 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌ అయినట్టు తెలిపారు. 

ప్రతి ఒక్కరూ శానిటైజర్‌ వాడాలి

లాక్‌డౌన్‌లో రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ అత్యంత పకడ్బందీగా స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లను నిర్వహిస్తున్నది. కరోనా వ్యాప్తి చెందకుండా కఠిన నిబంధనలు అమలుచేస్తున్నది. ఆస్తి కొనుగోలుదారులు, అమ్మకందారులు ముందుగా ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకొని రిజిస్ట్రేషన్‌ రుసుం చెల్లించాలి. లేదా బ్యాంకుల ద్వారా ఈ-స్టాంపుల ద్వారా చెల్లించవచ్చు. దాని ఆధారంగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లాలి. ఒక స్తిరాస్థి రిజిస్ట్రేషన్‌కు కేవలం ఐదుగురిని మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌కు రిజిస్ట్రేషన్‌కు మధ్య కొంత సమయం తీసుకుంటున్నారు. ఒక ఆస్తిని కొనుగోలు చేసేవారు, అమ్మేవారు ఎక్కువ సంఖ్యలో ఉండవచ్చు. అయినప్పటికీ స్లాట్‌ ప్రకారం ఒకసారి కేవలం ఐదుగురిని సబ్‌రిజిస్ట్రార్‌ వద్దకు అనుమతించి.. తర్వాత మరో ఐదుగురిని పంపిస్తారు. కార్యాలయంలోకి ప్రవేశించే సమయంలో, రిజిస్ట్రేషన్‌ సంతకాలు, ఫొటోగ్రఫీ సందర్భంగా శానిటైజర్‌ను తప్పనిసరి. మాస్కులు లేనిదే లోపలికి అనుమతించరు. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇదే పద్ధతి కొనసాగుతుందని ఉన్నతాధికారులు చెప్తున్నారు.

నేటినుంచి వాహనాలకు..

లాక్‌డౌన్‌తో రాష్ట్రంలో 43 రోజులుగా నిలిచిపోయిన వాహనాల రిజిస్ట్రేషన్లు గురవారం నుంచి ప్రారంభం కానున్నాయి. స్లాట్‌ బుక్‌ చేసుకోవడానికి అధికారులు ఏర్పాట్లుచేశారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ గడువు ముగిసినా ఎలాంటి షరతులు లేకుండానే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తిచేయనున్నారు. ఈ మేరకు వాహన యజమానులకు ఫోన్‌ సందేశాలు పంపారు. గురువారం నుంచి స్లాట్‌ బుక్‌చేసుకొనేవారు కొవిడ్‌ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని రవాణాశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిప్యూటీ కమిషనర్‌ పాపారావు తెలిపారు. ప్రతిఒక్కరూ నిర్ణీత దూరం విధిగా పాటించాలని వారికి కేటాయించిన సమయంలోనే రిజిస్ట్రేషన్‌ కేంద్రాలకు రావాలని సూచించారు. నిర్ణీయ సమయంలో రాకపోతే స్లాట్‌ రద్దవుతుందని స్పష్టంచేశారు. రిజిస్ట్రేషన్‌ కోసం వాహన యజమాని మాత్రమే రావాలని తెలిపారు. వాహనదారులకు ఎలాంటి అనారోగ్య లక్షణాలు ఉన్నా లోనికి అనుమతించరు. చేతులు శానిటైజ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల సిబ్బందికి కూడా అన్నిరకాల రక్షణచర్యలు చేపట్టారు. ప్రస్తుతం స్లాట్ల సంఖ్యను సగానికే పరిమితం చేశారు. వారంపాటు ఈ పద్ధతి పాటించి ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు.


logo