శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 03, 2020 , 07:01:59

రాష్ట్రంలో మూడు‌నె‌లల్లో 40 శాతం అధిక వ‌ర్ష‌పాతం

రాష్ట్రంలో మూడు‌నె‌లల్లో 40 శాతం అధిక వ‌ర్ష‌పాతం

హైద‌రా‌బాద్‌: రాష్ట్ర‌వ్యా‌ప్తంగా వర్షా‌కా‌లంలో విస్తారంగా వానలు కురు‌స్తు‌న్నాయి. వాతా‌వ‌ర‌ణ‌శాఖ అంచ‌నా‌లకు మించి వర్ష‌పా‌తాలు నమో‌ద‌వు‌తు‌న్నాయి. కుంటలు, జలా‌శ‌యాలు జల‌కళ సంత‌రిం‌చు‌కు‌న్నాయి. చాలా‌చోట్ల చెరు‌వులు అలు‌గు‌పో‌స్తు‌న్నాయి. వానా‌కాలం ప్రారంభ‌మైన‌ జూన్‌ ఒకటి నుంచి బుధ‌వారం వరకు దేశ‌వ్యా‌ప్తంగా 25 శాతం అధిక వర్ష‌పాతం నమో‌దైతే, రాష్ట్రంలో 40 శాతం ఎక్కువ‌ వర్ష‌పాతం రికా‌ర్డ‌యిం‌దని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది. 

రాష్ట్ర‌వ్యా‌ప్తంగా సాధా‌రణ వర్ష‌పాతం 608.9 మిల్లీ‌మీ‌టర్లు కాగా.. 850.8 మిల్లీ‌మీ‌టర్లు కురి‌సింది. ఈ ఏడాది వర్షా‌కాలం మరో నెల‌రో‌జులు ఉండ‌గానే అత్య‌ధిక వర్షాలు నమో‌ద‌వు‌తు‌న్నట్లు వాతావ‌ర‌ణ కేంద్రం పేర్కొ‌న్నది. ఆగస్టు నెలకు సంబంధించి దేశ‌వ్యా‌ప్తంగా 27 శాతం అధిక వర్ష‌పాతం నమో‌దైం‌దని ఐ‌ఎండీ తెలి‌పింది. 1973 ఆగ‌స్టులో 27.8 శాతం అధిక వర్షం పడగా, 44 ఏండ్ల తర్వాత మళ్లీ ఈ ఆగ‌స్టులో ఆ స్థాయిలో వర్ష‌పాతం నమో‌దైంద‌ని పేర్కొ‌న్నది. ఇక‌ రాష్ట్రంలో ఆగస్టు నెలలో 26 శాతం అధిక వర్ష‌పాతం నమో‌ద‌య్యింది. వరు‌సగా అల్ప‌పీ‌డ‌నాలు ఏర్ప‌డటం, రుతు‌ప‌వ‌నాలు చురు‌కుగా ఉండ‌టంతో ఆగ‌స్టులో అత్య‌ధిక వర్ష‌పా‌తాలు నమో‌దై‌నట్లు అధి‌కా‌రులు తెలి‌పారు.

వరం‌గల్‌ అర్బ‌న్‌లో 139 శాతం అధికం

రాష్ట్రంలో ఈ ఏడాది వానా‌కా‌లంలో బుధ‌వారం వరకు వరం‌గల్‌ అర్బన్‌ జిల్లాలో 139 శాతం అధిక వర్ష‌పాతం నమో‌దైంది. సాధా‌రణ వర్ష‌పాతం 538.6 మిల్లీ‌మీ‌ట‌ర్ల‌కు‌గాను 1288.7 మిల్లీమీటర్లు కురి‌సి‌నట్టు హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది. మహ‌బూ‌బా‌బాద్‌ జిల్లాలో 659.8 మిల్లీ‌మీ‌ట‌ర్ల‌కు‌గాను 1390.1 మిల్లీమీటర్ల వర్షం కురి‌సిం ది. వన‌పర్తిలో సాధా‌రణ వర్ష‌పాతం 425.7 మిల్లీమీటర్లు కాగా, 870.2 మిల్లీ మీటర్ల వర్షం అంటే 104 శాతం అధిక వర్ష‌పాతం నమో‌దైం‌ది. నిర్మల్‌లో సాధా‌రణంకంటే 15 శాతం, నిజా‌మా‌బా‌ద్‌లో 3 శాతం లోటు వర్ష‌పాతం నమో‌దైం‌దని వెల్ల‌డిం‌చింది.


logo