ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Sep 01, 2020 , 16:48:30

ఈఎస్ఐ కుంభ‌కోణం కేసు.. 4 కోట్ల ఆస్తులు స్వాధీనం

ఈఎస్ఐ కుంభ‌కోణం కేసు.. 4 కోట్ల ఆస్తులు స్వాధీనం

హైద‌రాబాద్ : రాష్ర్టంలో సంచ‌ల‌నం సృష్టించిన‌ ఈఎస్ఐ కుంభ‌కోణం కేసులో రూ. 4 కోట్ల విలువైన ఆస్తుల‌ను అవినీతి నిరోధ‌క శాఖ‌(ఏసీబీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్ర‌ధాన నిందితులైన ఐఎంఎస్ డైరెక్ట‌ర్ దేవికారాణి, ఫార్మాసిస్ట్ నాగ‌ల‌క్ష్మికి చెందిన రూ. 4 కోట్ల ఆస్తుల‌ను సీజ్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు క‌లిగి ఉన్న‌ట్లు గుర్తించారు. నిందితులిద్ద‌రూ స్థిరాస్తి రంగంలో పెట్టుబ‌డులు పెట్టిన‌ట్లు అధికారులు గుర్తించారు. స్థిరాస్తి వ్యాపారి వ‌ద్ద నుంచి రూ. 4 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. స్థిరాస్తి వ్యాపారిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

ఐఎంఎస్‌లో దేవికారాణి తన మనుషులతో  ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. రేటు కాంట్రాక్ట్‌ (ఆర్‌సీ) ప్రకారం లక్షల విలువైన పర్చేజ్‌ ఆర్డర్‌కు నాన్‌ రేట్‌ కాంట్రాక్ట్‌ (ఎన్‌ఆర్‌సీ)లో కోట్లు చెల్లించి దోచుకున్నారు. తమ డొల్ల సంస్థల్లోనే కొనాల్సిన మందుల్ని గుర్తించేలా పర్చేజ్‌ ఆర్డర్‌లో లావుపాటి  అక్షరాలతో ముద్రించేవారు. అక్రమంగా సంపాదించిన కోట్ల రూపాయలతో దేవికారాణి విలువైన ఆభరణాలు కొన్నారని, విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఏసీబీ తన దర్యాప్తులో గుర్తించింది. దేవికారాణి ఫార్మాసిస్ట్‌ నాగలక్ష్మితో కలిసి రెండు డొల్ల కంపెనీలు ఏర్పాటు చేశారు. నాగలక్ష్మి బంధువైన ఎం.మురళీకృష్ణ పేరుతో మహీధర మెడికల్‌ అండ్‌ సర్జికల్‌ కంపెనీ, అతని భార్య విజయలక్ష్మి పేరుతో జై సాయిరాం డిస్ట్రిబ్యూటర్స్‌ ఏర్పాటు చేశారు. ఈ రెండింటినీ తేజా ఫార్మా కంపెనీ ఎండీ రాజేశ్వర్‌రెడ్డి 2016లో రిజిస్టర్‌ చేయించారు. ఆర్‌సీలో ఉన్న మందుల్ని లోకల్‌ పర్చేజ్‌లో నిబంధనలకు విరుద్ధంగా డైరెక్టర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, ఫార్మాసిస్ట్‌ కలిసి డొల్ల కంపెనీలతో కుమ్మక్కై కొనడంతో ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది.


logo