బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 01:47:46

38 మందిని బలిగొన్న వానలు

38 మందిని బలిగొన్న వానలు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రెండ్రోజులుగా హైదరాబాద్‌లో కురుస్తున్న కుండపోత వానలు భారీ ప్రాణ, ఆస్తినష్టాన్ని మిగిల్చాయి. ఇండ్లు కూలి, విద్యుత్‌ ప్రమాదాలు, సెల్లార్‌లో నిండిన నీటిలో పడి, నాలాల్లో కొట్టుకుపోయి ఇలా వివిధ కారణాలతో రెండ్రోజుల్లో 30 మంది, పలు జిల్లాల్లో ఒక్క బుధవారమే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్‌లో 15 మంది, రంగారెడ్డి జిల్లాల్లో 27 మంది గల్లంతయ్యారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు భారీ వర్షంతో తలెత్తిన పరిస్థితుల కారణంగా హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 12 మంది, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఆరుగురు, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 12 మంది మృత్యువాతపడ్డారని పోలీస్‌ కమిషనర్లు అంజనీకుమార్‌, సజ్జనార్‌, మహేశ్‌భగవత్‌ తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం ముందుచూపు వల్ల నష్ట తీవ్రతను తగ్గించడంలో అధికారులు విజయం సాధించారు. బుధవారం తెల్లవారు జామునుంచి వివిధ ప్రాంతాల్లో పోలీసులు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్లలో వందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాలనీలు, అపార్టుమెంట్ల సెల్లార్లలోకి వర్షపు నీరుచేరి వేల సంఖ్యలో వాహనాలు దెబ్బతిన్నాయి. మరోవైపు, రంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా గగన్‌పహాడ్‌ వద్ద హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ రహదారి కోతకు గురైంది. సమీపంలో ఉన్న అప్ప చెరువు కట్టతెగి జాతీయ రహదారిపైకి వరదనీరు చేరడంతో రహదారి కొట్టుకుపోయింది. రహదారిపై వెళ్తున్న కార్లు కొట్టుకుపోయి దాదాపు 30 మంది గల్లంతుకాగా, మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మిద్దెకూలి ముగ్గురు మృతిచెందగా, వికారాబాద్‌, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాతపడ్డారు. 

56 మొబైల్‌ రైతుబజార్లు

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌ జంట నగరాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా వారి వద్దకే కూరగాయలు తీసుకెళ్లేందుకు మొబైల్‌ రైతు బజార్లను ఏర్పాట్లుచేస్తున్నట్టు వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. 56 వాహనాలతో 102 ప్రాంతాల్లో కూరగాయలను అందుబాటులోకి తెచ్చామని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టి జంటనగరాల్లో మొబైల్‌ రైతుబజార్లు ఏర్పాటుచేసినట్టు వెల్లడించారు.

విద్యుత్‌శాఖ అప్రమత్తం తప్పిన ముప్పు

భారీ వర్షం జీహెచ్‌ఎంసీతోపాటు సమీప మున్సిపల్‌ కార్పొరేషన్లను సైతం అతలాకుతలంచేసింది. ముఖ్యంగా బీఎన్‌రెడ్డితోపాటు మీర్‌పేట, బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్లలోని పలు కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. మంగళవారం రాత్రంతా భారీ వర్షంతో రెండు కార్పొరేషన్ల పరిధిలోని ప్రతి కాలనీని వరద ముంచెత్తింది. రోడ్లు గోదారిని తలపించాయి. ఈ క్రమంలో విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాదభరితంగా మారాయి. దీంతో విద్యుత్‌శాఖ సరైన రీతిలో స్పందించడంతో అనేక చోట్ల ప్రజలకు ముప్పు తప్పింది. ముఖ్యంగా మీర్‌పేట, బడంగ్‌పేట, అల్మాస్‌గూడ పరిధుల్లోని కాలనీల్లో మంగళవారం రాత్రి నుంచి పూర్తిస్థాయిలో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు ఒరగడం, జలదిగ్బంధనం కావడంతో విద్యుత్‌ సరఫరా ఉన్నట్లయితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండేది. సరఫరాను నిలిపివేసిన అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే సరఫరాను పునరుద్ధరించారు.


logo