శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Feb 20, 2020 , 01:41:22

మొక్క మొక్కకూ లెక్క

మొక్క మొక్కకూ లెక్క
  • ఆన్‌లైన్‌ ద్వారా మొక్కల పర్యవేక్షణ
  • నాటిన నాటినుంచి సంరక్షణ
  • అంగన్‌వాడీ కేంద్రాల నుంచి ప్రయోగం
  • ప్రతిసెంటర్‌లో కనీసం రెండుమొక్కల పెంపకం
  • మహిళా దినోత్సవం నాటికి 37,500 కేంద్రాల్లో హరితహారం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నాటే ప్రతిమొక్కనూ ఇకనుంచి ఆన్‌లైన్‌ ద్వారా పర్యవేక్షించేలా మహిళా, శిశు సంక్షేమశాఖ ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా చేపడుతున్నారు. సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా గత సోమవారం నుంచే అందుబాటులోకి తీసుకువచ్చారు.  ప్రస్తుతం అంగన్‌వాడీల్లో హరితహారం నినాదంతో మొక్కలు నాటడం, సంరక్షించడం చేపట్టారు. అయితే క్షేత్రస్థాయిలో నాటుతున్న మొక్కలను సంరక్షించడం లేదనే ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో మహిళా, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక పరిరక్షణ చేపట్టింది. రాష్ట్రంలో మొత్తం 37,500 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి అంగన్‌వాడీ కేంద్రంతోపాటు మినీ అంగన్‌వాడీలు, ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో రెండు మొక్కలను కచ్చితంగా నాటాలని ఆదేశాలు జారీచేశారు. మార్చి 8న మహిళా దినోత్సవం  నాటికి ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో మొక్కలు నాటాలని పేర్కొన్నారు. 


నాటిన మొక్కలన్నీ వెబ్‌సైట్‌లో

అంగన్‌వాడీ కేంద్రాల్లో మొక్కలు నాటినవెంటనే దానిని ఫొటోతీసి..‘అంగన్‌వాడీల్లో హరితహారం’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. దీంతో ఎన్నికేంద్రాల్లో ఎన్ని మొక్కలు నాటారనే లెక్కలు ఉంటాయి. మొక్కను వెబ్‌సైట్‌లో నమోదుచేశాక ప్రతివారం దాని ప్రగతిని వివరించాలి. వారం తర్వాత ఆ మొక్క ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నదో తెలిపేలా మళ్లీ ఫొటోతీసి వెబ్‌సైట్‌లో ఉంచాలి. ఎక్కడెక్కడ నుంచి మొక్కల సంరక్షణ ఫొటోలు రాలేదనే వివరాలు కూడా వెంటవెంటనే తెలుసుకునేలా వెబ్‌సైట్‌ రూపొందించారు. జిల్లా, మండలం, గ్రామం, అంగన్‌వాడీ కేంద్రం నంబర్‌ వేసిమొక్కఫొటోతో ఒకసారి అప్‌లోడ్‌ చేశాక దాని వివరాలు వెబ్‌సైట్‌లో సమగ్రంగా ఉంటాయి. దీన్ని మహిళా, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, సంబంధిత మంత్రి ఎక్కడినుంచైనా తెలుసుకునే వీలుంటుంది. ముందుగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం సోమవారం నుంచే మొదలైంది. ప్రతిమొక్కను సంరక్షించేవిధంగా చర్యలు తీసుకునే నేపథ్యంలోనే ఈ వెబ్‌సైట్‌ను రూపొందించామని మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి దివ్య తెలిపారు. ఎక్కడినుంచైనా.. ఎక్కడి మొక్క సంరక్షణ, పరిస్థితి తెలసుకునూ వీలుంటుందని చెప్పారు. దీంతో మొక్కల సంరక్షణపై అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులు, సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకుంటారని పేర్కొన్నారు.


హరితహారం మొక్కలకు ట్యాంకర్లతో నీళ్లు

హరితహారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నాటిన మొక్కలను బతికించుకునేందుకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పురపాలకశాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. ఇప్పటికే నాటిన మొక్కలతోపాటు సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా సోమవారం నాటినవాటినీ సంరక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు. కనీసం 80శాతం మొక్కలను బతికించుకొని రాష్ట్రంలో పచ్చదనం నింపేందుకు కృషిచేస్తున్నారు. ఇందుకోసం ఉపాధి నిధులను వినియోగిస్తున్నారు. ఉపాధిహామీ కూలీలతో మొక్కలకు కంచె ఏర్పాటుచేయిస్తున్నారు. నీరుపోసే బాధ్యతను కూడా వారికే అప్పగించారు. నీళ్లకోసం గ్రామాల్లో వాటర్‌ట్యాంకర్‌ను ఏర్పాటుచేస్తున్నారు. ప్రభుత్వమే ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి గ్రామాలకు ఇస్తున్నది. ట్యాంకర్‌ను కూడా కచ్చితంగా కొనుగోలు చేయాలని నిబంధన విధించింది. ఇంకా కొనుగోలు చేయని పక్షంలో అద్దె ప్రాతిపదికన ట్యాంకర్లు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 


రోడ్ల వెంట అందుబాటులో నీరు

రాష్ట్రంలోని 18,592 రహదారుల వెంట 66,947 కిలోమీటర్లలో 82 లక్షల మొక్కలు నాటినట్టు పంచాయతీరాజ్‌శాఖ నివేదిక పేర్కొన్నది. మరో 10 వేల ఇతర దారుల వెంట 24వేల కిలోమీటర్ల పరిధిలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా ఆయారోడ్ల రోడ్ల వెంట నాటిన మొక్కలను సంరక్షించేందుకు నీటివసతులను గుర్తిస్తున్నారు. కొన్నిప్రాంతాల్లో పశువుల కోసం గతంలో నిర్మించిన నీటి గుంతలను సంబంధిత అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. వీటిసాయంతో మొక్కలకు నీరు పోయనున్నారు. మొక్కల సంరక్షణకు పంచాయతీరాజ్‌శాఖ కీలకంగా వ్యవహరిస్తున్నది. గ్రామాల్లో ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులకు మొక్కల సంరక్షణపై ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. మొక్కల సంరక్షణలో వచ్చే నాలుగునెలలు కీలకమని పంచాయతీరాజ్‌శాఖ తమ సిబ్బందికి సూచించింది. జూన్‌, జూలై వరకు మొక్కలను రక్షించుకొంటే తర్వాత ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటుచేసేందుకు పంచాయతీరాజ్‌శాఖనుంచి ప్రత్యేకంగా నిధులను కేటాయించారు. వీటికికూడా ఉపాధిహామీ పథకం నుంచి నిధులను చెల్లిస్తున్నారు. ఎండాకాలంలో మాత్రం ఎవెన్యూ ప్లాంటేషన్‌ రక్షణ కోసం రోజువిడిచి రోజు ఉదయం, సాయంత్రం నీరు పట్టించాలని స్పష్టంచేశారు. నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో రోజువారిగా నీళ్లు పోయాల్సి ఉంటుందని సూచించారు.


logo