గురువారం 09 జూలై 2020
Telangana - Jun 19, 2020 , 02:51:48

ఒక్కరోజే 352 మందికి

ఒక్కరోజే 352 మందికి

  • జీహెచ్‌ఎంసీలోనే 302 కరోనా కేసులు 
  • ముగ్గురి మృతి, 230 మంది డిశ్చార్జి.. 
  • ఆరు వేలు దాటిన కరోనా కేసులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. ఎప్పుడూ లేనివిధంగా గురువారం ఒక్కరోజే 352 మందికి వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇందులో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 302 కేసులుండగా, రంగారెడ్డి జిల్లాలో 17, మేడ్చల్‌ మల్కాజిగిరి 10, మంచిర్యాల 4, వరంగల్‌ అర్బన్‌, జనగామ జిల్లాల్లో 3 చొప్పున, జయశంకర్‌ భూపాలపల్లి, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో 2 చొప్పున, ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ రూరల్‌ జిల్లాల్లో 1 చొప్పున నమోదయ్యాయి. వైరస్‌ ప్రభావం అధికంగా ఉండటంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 6,027 కేసులు నమోదు కాగా, 195 మంది మరణించారు. 3,301 మంది చికిత్స అనంతరం కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 2,531 మంది చికిత్స పొందుతున్నట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది.

వైరస్‌ను జయించిన 88 ఏండ్ల వృద్ధుడు

కరోనా సోకిన ఓ వయోవృద్ధుడు పూర్తిగా కోలుకొని గురువారం దవాఖాన నుంచి ఇంటికి చేరారు. సికింద్రాబాద్‌ సీతాఫల్‌మండి చౌరస్తా సమీపంలో నివాసముండే 88 ఏండ్ల వయోవృద్ధుడికి గత నెల 30న పరీక్షల్లో వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడిని గాంధీ దవాఖానకు తరలించారు. 19 రోజులపాటు చికిత్స పొందిన ఆయన గురువారం పరీక్షల్లో నెగెటివ్‌గా రావడంతో డిశ్చార్జిచేశారు. మరికొన్ని రోజులు హోంక్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు సూచించారు. 

చెప్పిన ఫీజుకే కరోనా చికిత్స వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల


కార్పొరేట్‌, ప్రైవేట్‌ దవాఖానలు ప్రభుత్వ నిబంధనల మేరకే కరోనా చికిత్సకు ఫీజు వసూలుచేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టంచేశారు. ప్రజావైద్యం విషయంలో రాజీ పడేదిలేదని, ఎం తమంది బాధితులు వచ్చినా చికిత్స అందించేందుకు ప్రభుత్వ దవాఖానలు సిద్ధంగా ఉన్నాయన్నారు. గురువారం తెలంగాణ సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన అసోసియేషన్‌ ప్రతినిధులు మంత్రి ఈటల రాజేందర్‌ను కలిశారు. ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదలచేయాలని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ప్రజలకు వైద్యం అందించడానికి అసోసియేషన్‌ ప్రతినిధులు సహకరించాలని సూచించారు. 

ప్రజలకు భరోసా కల్పించాలని కోరారు. కరోనా పేరుతో బాధితులను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని చెప్పారు. పాజిటివ్‌ ఉన్నా కూడా లక్షణాలు ఉన్నవారిని మాత్రమే దవాఖానలో ఉంచి చికిత్స అందించాలని తెలిపారు. లక్షణాలు లేనివారిని హోంఐసొలేషన్‌లో ఉంచాలని పేర్కొన్నారు. ప్రజల విజ్ఞప్తి మేరకు ప్రైవేట్‌ దవాఖానల్లో కరోనా చికిత్సకు అనుమతించామని గుర్తుచేశారు. ప్రైవేట్‌ దవాఖానలు కూడా బాధితులకు చికిత్స అందించడం కర్తవ్యంగా భావించాల ని చెప్పారు. ఐసీయూలో ఉన్నవారికి ప్రభు త్వం నిర్ణయించిన ఫీజు ప్రకారమే చికిత్స అందించాలని, పీపీఈ కిట్లు, మందులకు అయ్యే ఖర్చు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తీసుకోవాలని సూచించారు.  

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు 


గురువారం
మొత్తం
పాజిటివ్‌ కేసులు
352
6,027 
డిశ్చార్జి అయినవారు
230
3,301
మరణాలు
3195
చికిత్స పొందుతున్నది
-2,531


logo