మంగళవారం 02 జూన్ 2020
Telangana - Apr 11, 2020 , 01:33:13

అన్నదాత ఈ టైలరమ్మ

అన్నదాత ఈ  టైలరమ్మ

  • రోజుకు 40 మంది పేదలకు అన్నదానం  
  • పారిశుద్ధ్య కార్మికులు, వైద్యసిబ్బందికి 350 మాస్కుల పంపిణీ

అయిజ: ఉమాదేవి..! నిన్నటిదాకా ఆమె ఒక సాధారణ టైలర్‌. నేడు సాక్షాత్తు అన్నపూర్ణమ్మ!! కరోనా కష్టకాలంలో ఆకలితో అలమటిస్తున్న పేదలకు కడుపునిండా అన్నం పెడుతున్న దొడ్డమనసు ఆమెది. ఒకరా.. ఇద్దరా రోజుకి నలభై మందికి వండివార్చుతున్న దేవత. ఆమెది జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణం. టైలరింగ్‌ ఆమె వృత్తి. ఆమె భర్త విరూపాక్షరెడ్డి రైతు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన కూలీలు పస్తులుండటం ఉమాదేవిని కదిలించింది. తమ షాపు పక్కనే ఉన్న హోటల్లో పనిచేసే ఓ కుటుంబం భోజనంలేక అవస్థ పడుతుండటాన్ని చూసి చలించిపోయారు. లాక్‌డౌన్‌ ముగిసేవరకు తానే భోజనం పెడుతానంటూ వారిని అక్కున చేర్చుకొన్నారు. ఇలా ఉపాధిలేక అవస్థలు పడుతున్న దాదాపు నలభై మందికి ప్రతిరోజూ అన్నం వండిపెడుతున్నారు.  వారంతా ఆమెను అన్నపూర్ణమ్మగా కొనియాడుతున్నారు. కరోనాపై సాగుతున్న యుద్ధంలో ముందువరుసలో నిల్చొని పనిచేస్తున్న ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, వైద్యసిబ్బందితోపాటు పారిశుద్ధ్య సిబ్బంది కోసం దాదాపు 350 మాస్కులను తన సొంత ఖర్చులతో కుట్టి, ఉచితంగా పంపిణీచేసిన ఆదర్శమూర్తి ఉమాదేవి. తన వద్ద టైలరింగ్‌ నేర్చుకొంటున్న మహిళలు కూడా ఆమెకు చేదోడుగా నిలుస్తుండటం మరో విశేషం. 

ఉపాధిలేకపోతే ఆ బాధేంటో తెలిసినవాళ్లం

మేం 28 ఏండ్ల క్రితం అయిజకు వచ్చాం. టైలరింగ్‌ యూనిట్‌ నెలకొల్పి, ఇప్పటివరకు 400 మందికిపైగా మహిళలకు ఉచితంగా శిక్షణ ఇచ్చాను. మా దగ్గర టైలరింగ్‌ నేర్చుకొన్నవారికి ఉపాధి కల్పిస్తున్నాం. ఉపాధిలేకపోతే పడే బాధలను కళ్లారా చూసినవాళ్లం. అందుకే ఈ కష్టకాలంలో ఉపాధి కోల్పోయిన కూలీలకు, అనాథలకు అన్నంపెట్టి, ఆకలి తీర్చాలని సంకల్పించాను. మా యూనిట్‌లో పనిచేస్తున్న మహిళలతో కలిసి, ఇంటివద్దే శుచిగా, శుభ్రంగా వంటచేస్తున్నాం. కొందరికి మా ఇంటివద్దే భోజనం పెడుతున్నాం. మరికొందరికి వారివద్దకే అన్నం తీసుకెళ్తున్నాం. ఎంత ఖర్చయినా సరే లాక్‌డౌన్‌ కొనసాగినంతకాలం అన్నదానం చేయాలనుకుంటున్నాం. ఇందుకు నా భార్త ప్రోత్సాహం ఉన్నది. కష్టాల్లో ఉన్న నిరుపేదలను ఆదుకోవాలని పెద్దలు చెప్పేవారు. వారి ఆశయాలను నెరవేర్చే లక్ష్యంతో ఈ పనిచేస్తున్నాం. 

- ఉమాదేవి, అమ్మ భగవాన్‌ టైలరింగ్‌ యూనిట్‌, అయిజ

14 దినాలుగా బువ్వ పెడుతున్నరు 

ఏదో మాయదారి రోగం వచ్చిందంట.. పట్నంలో అన్ని బందు బెట్టిండ్రు. గతంలో ఓ హోటల్‌లో నాకు బువ్వ బెట్టేటోళ్లు. హోటల్‌ మూసేయడంతో కష్టమైంది. టైలరమ్మ దినాం రెండుపూటలకు సరిపడే బువ్వను ఇంటికే పంపుతది. అది తిని కాలం గడుపుతున్న. 

-కాకె నర్సమ్మ, అభాగ్యురాలు, అయిజ

ఎంతో సంతృప్తిగా ఉన్నది

కరోనా వల్ల మాలాంటివాళ్లు ఎంతోమంది ఉపాధికోల్పోయారు. అనాథలకు అన్నదానం చేద్దామని ఉమాదేవి చెప్పారు. ఆమెకు మా యూనిట్‌ సభ్యులం సహకరిస్తున్నాం. కూరగాయలు తరగడం, వంట చేయడం, పార్సిల్‌ కట్టడంలాంటి పనులు చేస్తున్నాం. ఎంతో ఆత్మ సంతృప్తి కలుగుతున్నది.

-సాహితి, టైలర్‌, అయిజ


logo