ఆదివారం 31 మే 2020
Telangana - May 20, 2020 , 01:08:37

రోడ్డెక్కిన ప్రగతి చక్రం

రోడ్డెక్కిన ప్రగతి చక్రం

  • లాక్‌డౌన్‌ సడలింపుతో..
  • తొలిరోజు 3వేల బస్సులు 
  • భౌతికదూరంతో ప్రయాణం
  • మాస్కులుంటేనే అనుమతి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/నెట్‌వర్క్‌: లాక్‌డౌన్‌ అమలులో భాగంగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు దాదాపు రెండు నెలల తర్వాత మంగళవారం రోడ్డెక్కాయి. సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో హైదరాబాద్‌ మినహా మిగతా జిల్లాల్లో ఉదయం ఆరు గంటల నుంచే ప్రయాణం ప్రారంభించాయి. కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ.. పాత చార్జీల ప్రకారమే ప్రయాణికులను గమ్యస్థానం చేర్చాయి. డ్రైవర్లు, కండక్టర్లు వ్యక్తిగత శుభ్రత పాటిస్తూనే ప్రయాణికులను అనునిత్యం అప్రమత్తం చేశారు. చేతులు శుభ్రం చేసుకొని, మాస్కులు ధరించిన వారినే బస్సుల్లోకి అనుమతించారు. సుదీర్ఘ కాలం తర్వాత బస్టాండ్లలో ప్రయాణికుల సందడి కనిపించింది.

l తొలిరోజు మంగళవారం మొత్తం దాదాపు మూడువేల బస్సులు నడిచినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ మేరకు వరంగల్‌ రీజియన్‌లోని తొమ్మిది డిపోల పరిధిలో 496 బస్సులు వివిధ రూట్లలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశాయి. కరీంనగర్‌ రీజియన్‌లోని పది డిపోల్లో 513, నిజామాబాద్‌ రీజియన్‌లో 224, మెదక్‌ రీజియన్‌ పరిధిలో 240 బస్సులు తిరిగాయి. రంగారెడ్డి రీజియన్‌ పరిధిలో 90 బస్సులు, ఉమ్మడి నల్లగొండలో 274, ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని తొమ్మిది డిపోల పరిధిలో 447 బస్సులు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 352 బస్సులు ప్రయాణికులకు సేవలందించాయి. మారుమూల ప్రాంతాలకు రవాణా సౌకర్యం మొదలుకావడంతో ఏజెన్సీ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, హైదరాబాద్‌ సిటీకి సంబంధించిన దాదాపు 4వేల బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. 

రాజధానిలో జన సందడి 

లాక్‌డౌన్‌ కారణంగా నిశ్శబద్దంగా ఉన్న రాజధాని నగరం నిద్ర లేచింది. లాక్‌డౌన్‌ సడలింపులతో హైదరాబాద్‌ మంగళవారం జనసందోహంతో కళకళలాడింది. కంటైన్మెంట్‌ జోన్లు మినహా నగరమంతటా సందడి వాతావరణం కనిపించింది. సరిబేసి సంఖ్య ఆధారంగా దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమ య్యాయి. దాదాపు 50 రోజుల తర్వాత నగరంలో మళ్లీ సాధారణ పరిస్థితులు కనిపించాయి. ఆటోలు, క్యాబ్‌  చక్రాలు  రహదారులపై పరుగులుపెట్టాయి. సెలూన్‌లు తెరుచుకున్నాయి. హైదరాబాద్‌ శివార్ల నుంచి ఆర్టీసీ బస్సులు జిల్లాలకు బయలుదేరాయి. హైదరాబాద్‌లో మాత్రం ఆర్టీసీ బస్సులు నడవలేదు. కానీ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని జూబ్లీ బస్‌స్టేషన్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌ల నుంచి  ఆర్టీసీ బస్సులు జిల్లాలకు రాకపోకలు సాగించాయి.


logo