గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 17:09:40

300 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలి

300 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలి

భద్రాద్రి కొత్తగూడెం : కరోనా సడలింపు నేపథ్యంలో తిరిగి అన్ని పరిశ్రమల నుంచి బొగ్గుకు డిమాండ్‌ పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న ఐదు నెలల కాలంలో 300 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, అదే మొత్తంలో బొగ్గు రవాణా సాధించాలని సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ సింగరేణి భవన్‌ నుంచి ఏరియా జీఎంలు, డైరెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణాలపై ఆయన సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బొగ్గుకు డిమాండ్‌ పెరుగుతున్నది. తగిన కరోనా జాగ్రత్తలు తీసుకొంటూ ప్రతి గనికి కేటాయించిన ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలన్నారు. నవంబర్‌ నెల నుంచి రోజుకి ఒక లక్షా 85 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, అంతే మొత్తంలో బొగ్గు రవాణా జరపాలన్నారు. అలాగే ఓపెన్‌ కాస్ట్‌ గనుల నుంచి రోజుకి 13.5 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓవర్‌ బర్డెన్‌ ను తొలగించాలని ఆయన ఆదేశించారు. ఏరియాల వారీగా అక్టోబర్‌ నెలలో సాధించిన లక్ష్యాలను సమీక్షించారు. అలాగే ప్రతి ఏరియాలో ఇకముందు సాధించాల్సి ఉన్న లక్ష్యాలపై సృష్టమైన ఆదేశాలు జారీచేశారు. 


కె.టి.కె. ఓ.సి-3 (భూపాలపల్లి) నుంచి, అడ్రియా లాంగ్‌ వాల్‌ కొత్త ప్యానెల్‌ నుంచి డిసెంబర్‌ నెలకల్లా బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావాలని, రామగుండం-1 ఏరియాలోని జి.డి.కె.-5 ఓ.సి. గని నుండి ఈ ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి జరగాలని ఆదేశించారు. సత్తుపల్లి ఓ.సి. గనులు, మణుగూరు ఓ.సి. గనుల్లో ఓ.బీ. తొలగింపు మరింత వేగవంతం చేయాలని సృష్టం చేశారు. అలాగే కోవిడ్‌ వ్యాప్తి నివారణ చర్యలపై కూడా సమీక్షించారు. యాజమాన్యం తీసుకున్న ముందస్తు జాగ్రత్తలు, వైద్య సేవల ఫలితంగా కోవిడ్‌ ఉధృతి సింగరేణి ప్రాంతంలో తగ్గటం పట్ల సంతృప్తి ప్రకటించారు.

కార్యక్రమంలో డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) ఎస్‌.చంద్రశేఖర్‌, అడ్వయిజర్‌ (మైనింగ్‌) డి.ఎన్‌.ప్రసాద్‌, అడ్వయిజర్‌ (ఫారెస్ట్రీ) కె.సురేంద్రపాండే, ఈడీ (కోల్‌ మూమెంట్‌)  జె.ఆల్విన్‌, జి.ఎం. (సి.డి.ఎన్‌.)  కె.రవిశంకర్‌, జనరల్‌ మేనేజర్‌ (సి.పి.పి.)  కె.నాగభూషణ్‌ రెడ్డి, జి.ఎం. (సి.హెచ్‌.పి.లు)  స్వామినాయుడు, పాల్గొనన్నారు. కార్పొరేట్‌ నుంచి డైరెక్టర్‌ ఫైనాన్స్‌ ఎన్‌.బలరామ్, డైరెక్టర్‌ (ఇ&ఎం)  డి.సత్యనారాయణ రావు, అన్ని ఏరియాల నుంచి ఏరియాల జనరల్‌ మేనేజర్లు పాల్గొన్నారు.