మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 02:11:43

రాష్ర్టానికి 3 స్కోచ్‌ అవార్డులు

రాష్ర్టానికి 3 స్కోచ్‌ అవార్డులు

  • టీఎస్‌ఎండీసీకి గోల్డ్‌, ఐటీ శాఖకు సిల్వర్‌
  • రాష్ట్ర పథకాలకు జాతీయస్థాయిలో గుర్తింపు
  • ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ వెల్లడి
  • అభినందనలు తెలిపిన మంత్రి కేటీఆర్‌

తెలంగాణ ప్రభుత్వం మూడు ప్రతిష్ఠాత్మక స్కోచ్‌ అవార్డులను దక్కించుకున్నది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అమలుచేస్తున్న పారదర్శక  విధానాలకుగాను ఈ అవార్డులు దక్కాయి. స్కోచ్‌ సంస్థ 66వ సదస్సు సందర్భంగా ఈ అవార్డులను ప్రకటించింది. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం మూడు ప్రతిష్ఠాత్మక స్కోచ్‌ అవార్డులను దక్కించుకుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అమలుచేస్తున్న పారదర్శక విధానాలకుగాను ఈ అవార్డులు దక్కాయి. స్కోచ్‌ సంస్థ 66వ సదస్సు సందర్భంగా ఈ అవార్డులను ప్రకటించింది. టీఎస్‌ఎండీసీకి ఒకటి, ఐటీ శాఖకు రెండు అవార్డులు దక్కాయి. వీటిలో ఒకటి స్వర్ణం కాగా, రెండు రజతం ఉన్నాయి. డిజిటల్‌ ఇండియా క్యాటగిరీలో టీఎస్‌ఎండీసీకి గోల్డ్‌ అవార్డు దక్కింది. శాండ్‌ సేల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టంలో ఆన్‌లైన్‌లో ఇసుక విక్రయాలు చేపట్టి, పారదర్శక విధానాన్ని అమలుచేస్తున్నందుకు గోల్డ్‌ అవార్డును అందించారు. ఈ క్యాటగిరీలో 1000 దరఖాస్తులు రాగా టీఎస్‌ఎండీసీకి స్వర్ణం దక్కడం విశేషం. 

తెలంగాణ రాష్ట్ర ఇసుక విధానం, క్రయ విక్రయాలపై దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. ఎవరికైనా ఆన్‌లైన్‌లో దొరికే విధంగా ఇసుక విధానాన్ని తీసుకొచ్చారు. ఈ విధానంతో అక్రమాలకు అడ్డుకట్ట పడగా ప్రభుత్వానికి వందల కోట్ల ఆదాయం వస్తున్నది. గతంలో ఇసుకపై సంవత్సరానికి కనీసం రూ.15 కోట్లు కూడా దాటని ఆదాయం, తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రతి సంవత్సరం దాదాపుగా వేయి కోట్ల వరకు వస్తున్నది. వివిధ దశల్లో పరిశీలన, అధికారుల పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ తరువాత టీఎస్‌ఎండీసీని గోల్డ్‌ అవార్డుకు ఎంపిక చేశారని సంస్థ ఎండీ మల్సూర్‌ తెలిపారు.  

ఏఐలో రెండు అవార్డులు

కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) విభాగంలో టీ-చిట్స్‌, క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌లో రాష్ర్టానికి రెండు స్కోచ్‌ అవార్డులు దక్కాయి. చిట్‌ఫండ్‌ నిర్వహణలో పారదర్శకతను నెలకొల్పేందుకు, రిజిస్ట్రేషన్స్‌లో మోసాలను అరికట్టేందుకు బ్లాక్‌ చైన్‌ విధానాన్ని అమలుచేశారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ నిర్వహించిన 23వ ఇ-గవర్నెన్స్‌ జాతీయ అవార్డుల్లో కూడా టీ-చిట్స్‌ అవార్డు దక్కించుకుంది. ఇక మేడారం సమ్మక్క,సారలక్క జాతరలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా పోలీసు బందోబస్తు నిర్వహించారు. ప్రజలు ఒకేచోట ఎక్కువగా గుమిగూడకుండా, తొక్కిసలాట జరుగకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేయడానికి క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌ సోల్యూషన్‌ విధానాన్ని ఐటీశాఖ సహాయంతో పోలీసులు విజయవంతంగా అమలుచేశారు.

స్కోచ్‌ అవార్డులు దక్కించుకున్నందుకుగాను జయేశ్‌రంజన్‌కు, అధికారులు, సిబ్బందికి ట్విట్టర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. మూడు స్కోచ్‌ అవార్డులు రావడంపై ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలకు అవార్డు దక్కడం ద్వారా అవి జాతీయస్థాయిలో గుర్తింపుపొందాయని తెలిపారు. పరిపాలన, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో తన శక్తి సామర్థ్యాలను మరోసారి తెలంగాణ నిరూపించుకున్నదని ఆయన చెప్పారు.


logo