శుక్రవారం 29 మే 2020
Telangana - Feb 27, 2020 , 13:00:44

కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి

కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి

నల్లగొండ : కరీంనగర్‌, భువనగిరిలో కాల్వల్లోకి కారు దూసుకెళ్లిన ఘటనలు మరవకముందే అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఫిబ్రవరి 17న కరీంనగర్‌లో, ఫిబ్రవరి 22న భువనగిరిలో ఈ ఘటనలు సంభవించాయి. తాజాగా నల్లగొండ జిల్లాలోని ఏఎంఆర్‌పీ లింక్‌ కెనాల్‌లోకి మరో కారు దూసుకెళ్లింది.

నల్లగొండ జిల్లాలోని పీఏపల్లి మండలం దుగ్యాల వద్ద విషాదం నెలకొంది. కారు కాల్వలోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులతో పాటు కూతురు ప్రాణాలు కోల్పోయారు. కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. వేగంగా వెళ్తున్న కారు ముందు టైరు పేలడంతో.. రోడ్డు పక్కనే ఉన్న ఏఎంఆర్‌పీ లింక్‌ కెనాల్‌లోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న దంపతులు ఓర్సు రఘు, అలివేలు, కుమార్తె కీర్తి మృతి చెందారు. స్థానికులు, పోలీసులు కలిసి రఘు కుమారుడిని ప్రాణాలతో కాపాడారు. క్రేన్‌ సాయంతో కాల్వలోకి దూసుకెళ్లిన కారును బయటకు తీశారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు, సోదరి చనిపోవడంతో ఆ అబ్బాయి వేదన వర్ణనాతీతమైంది. మృతులను పీఏపల్లి మండలం వడ్డెరిగూడెం వాసులుగా పోలీసులు గుర్తించారు. 


logo