సోమవారం 23 నవంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 02:16:21

మండలానికి 3 ఆగ్రోస్‌ కేంద్రాలు

మండలానికి 3 ఆగ్రోస్‌ కేంద్రాలు

  •  అన్నదాతలతోపాటు యువతకు మేలు
  • రైతులకు తక్కువ ధరకే మేలైన విత్తనాలు, ఎరువులు
  • నిరుద్యోగ యువతకు ఉపాధి లభించేలా ప్రణాళిక
  • ఇప్పటికే 732 కేంద్రాల ఏర్పాటు, త్వరలోనే మరిన్ని

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నిరుద్యోగ యువతకు ఉపాధి, రైతుకు నాణ్యమైన విత్తనా లు, ఎరువులు.. ఒకేసారి రెండు రకాల ప్రయోజనం చేకూరేలా తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ ఆగ్రోస్‌) నూతన విధానానికి శ్రీకారం చుట్టిం ది. రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తూ, వ్యవసాయ సంబంధిత సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నది. ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందు లు, వ్యవసాయ పరికరాలు, యంత్రాలను సా ధారణ ధరలకే అందిస్తున్నది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యం, కృత్రిమ కొరతకు చెక్‌ పెట్టాలన్న సంకల్పంతో మండలానికి మూడు చొప్పున ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. అర్హత కలిగిన నిరుద్యోగ యువతకు ఆగ్రోస్‌ కేంద్రాలను అప్పగిస్తున్నది. ఇప్పటికే 591 మండలాల్లో 732 కేంద్రాలను ప్రారంభించింది.

ఏడు రకాల సేవలు

ఎరువులు, విత్తనాలు, రసాయనాలు ఇలా ఆగ్రోస్‌ రైతు సేవాకేంద్రాల ద్వారా ఏడు రకాల సేవల్ని అందనున్నాయి. ఇందుకోసం ప్రముఖ కంపెనీలతో ఆగ్రోస్‌ ఒప్పందాలు కుదుర్చుకున్నది. ఒప్పందాల ప్రకారం ఎరువులు, విత్తనాలను టీఎస్‌ ఆగ్రోస్‌ నేరుగా కంపెనీల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని ఎంఆర్‌పీకే సేవాకేంద్రాల ద్వారా రైతులకు విక్రయిస్తారు. ఎరువులకు సంబంధించి ఐపీఎల్‌, ఇఫ్కో, క్రిబ్కో సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నది. క్రిమిసంహారక మందుల సరఫరాకు యూపీఎల్‌, ఇండోఫిల్‌ అండ్‌ క్రిస్టల్‌ క్రాప్‌కేర్‌తో, విత్తనాల సరఫరాకు నూజివీడు, కావేరీ, మహికో, పయనీర్‌తో పాటు ముల్కనూరు సొసైటీతో ఒప్పందాలు కుదుర్చుకున్నది. సస్యరక్షణ పరికరాలు, టార్ఫాలిన్లు, బ్యాటరీ స్ప్రేయర్లు, తైవాన్‌ స్ప్రే యర్లు, పవర్‌ స్ప్రేయర్లను ఆగ్రోస్‌ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్నది. వీటితో పాటే రోటావేటర్లు, పవర్‌ వీడర్స్‌, నాగళ్లు, పవర్‌ టిల్లర్స్‌, ఇతర వ్యవసాయ యంత్రాలను కూడా అమ్మనున్నది. 

దరఖాస్తు చేసుకోవాల్సింది వీరే..

అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌, సాధారణ ఇంజినీరింగ్‌, ఉద్యాన, వ్యవసాయ డిగ్రీ, డిప్లొమా, డిగ్రీ, డీఈఎస్‌ఐ డిప్లొమా కోర్సులు చేసినవారు ఆగ్రోస్‌ రైతు సేవాకేంద్రాలకు అర్హులు. ఆసక్తి, అర్హతగలవారు మండల వ్యవసాయ అధికారి ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సరైన వ్యక్తికి సేవాకేంద్రాన్ని కేటాయిస్తారు. రైతు సేవాకేంద్రం పొందినవారు తొలుత కొంతమొత్తాన్ని డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.

నిరుద్యోగ యువత, రైతుకు ఎంతో మేలు

ఇటు రైతుకు, అటు నిరుద్యోగ యువతకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆగ్రోస్‌ రైతు సేవాకేంద్రాలను ఏర్పాటుచేశాం. అనుకున్నదాని కన్నా మంచి ఫలితం వస్తున్నది. రైతుల నుంచి కూడా ఆదరణ లభిస్తున్నది. దశలవారీగా వీలైనన్ని కేంద్రాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.

కే రాములు, డైరెక్టర్‌, టీఎస్‌ ఆగ్రోస్‌