బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 07, 2020 , 03:41:43

రాచ‘కుండ’! డిండికి అనుసంధానంగామరో ఎత్తిపోతల పథకం

రాచ‘కుండ’! డిండికి అనుసంధానంగామరో ఎత్తిపోతల పథకం

  • తుదిదశకు చేరిన డీపీఆర్‌  
  • ఉమ్మడి నల్లగొండ, పాలమూరు, 
  • రంగారెడ్డి జిల్లాలకు ప్రయోజనం
  • 279 చెరువులకు పునరుజ్జీవం
  • 27,162 ఎకరాలకు సాగునీరు
  • ఫ్లోరోసిస్‌, కరువుకు ఇక చెల్లుచీటి

కరువుకు మారుపేరైన రాచకొండ చుట్టుపక్కల ప్రాంతాలు సస్యశ్యామలం కానున్నాయి. సాగు నీటికోసం అగచాట్లు పడుతున్న అక్కడి రైతాంగం వెతలు తీరనున్నాయి. ఏడాది పొడవునా పంటలకు పుష్కలంగా సాగు నీరందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిండి ఎత్తిపోతల పథకానికి అనుసంధానంగా రాచకొండ ఎత్తిపోతల ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ సంకల్పించగా.. ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ తుదిదశకు చేరుకున్నది. ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన వెంటనే టెండర్ల ప్రక్రియ మొదలు కానున్నది. ఇదే జరిగితే అటు ఫ్లోరోసిస్‌.. ఇటు కరువుతో తల్లడిల్లిన ఈ ప్రాంత రైతులు, ప్రజలకు గొప్ప ఊరట లభించనున్నది.

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కృష్ణా, గోదావరి నీళ్లను అవసరాలకు అనుగుణంగా వినియోగించుకుంటూ వస్తున్న తెలంగాణ ప్రభుత్వం చివరి ఆయకట్టుకు సైతం సాగు నీరందించడంపై దృష్టిసారించింది. బీడు భూములను తడిపేందుకు కొత్త ప్రతిపాదనలను ముందుకు తెస్తున్నది.  ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో విస్తరించిన రాచకొండ పరిధిలో ప్ర స్తుతం ఉన్న చెరువులు, కుంటలతో భవిష్యత్తు అవసరాలను తీర్చడం సాధ్యంకాదని భావించిన సర్కార్‌.. రాచకొండ ఎత్తిపోతల పథకానికి కార్యరూపం ఇచ్చేందుకు నిర్ణయించింది. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు 2018 మార్చి 20న జీవో జారీ చేసింది. సర్వేతోపాటు డీపీఆర్‌ రూపకల్పన కోసం రూ.1.72 కోట్లను కేటాయించగా.. ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా సర్వే చేపట్టింది. ప్రస్తుతం డీపీఆర్‌ తుదిదశకు చేరుకున్నది.  

డిండి టు రాచకొండ 

శివన్నగూడెం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి అప్రోచ్‌ ఛానల్‌ ద్వారా రాచకొండ ప్రాంతానికి సాగు నీరందించేందుకు ప్రభుత్వం సంకల్పించిం ది. 1,157 క్యూసెక్కుల నీటిని మూడు లిఫ్టుల ద్వారా 378 మీటర్ల ఎత్తుకు తరలించేందుకు రాచకొండ ఎత్తిపోతలకు రూపకల్పన చేశారు. ఇందు లో భాగంగా మర్రిగూడ మండలం ఖుదాబక్ష్‌పల్లి వద్ద పంపింగ్‌స్టేషన్‌ ఏర్పాటుచేసి 40 మెగావాట్ల సామర్థ్యం గల రెండు మోటర్ల ద్వారా 2.5 డయామీటర్ల వ్యాసార్థం గల రెండు పైపులతో నీటిని ఎత్తిపోయనున్నారు. 381 ఎఫ్‌ఆర్‌ఎల్‌ నుంచి 8.3 కిలోమీటర్ల పొడవునా పారే నీటిని 592 ఎఫ్‌ఆర్‌ఎల్‌ వద్ద 1.5 టీఎంసీల సామర్థ్యంతో వాయిళ్లపల్లి వద్ద  నిర్మించే రిజర్వాయర్‌లోకి మళ్లిస్తారు. ఇక్కడ మరో లిఫ్టును ఏర్పాటు చేసి 22 మెగావాట్ల సామర్థ్యంతో పనిచేసే రెండు మోటర్ల ద్వారా నీటిని పంపింగ్‌ చేసి ఆరుట్ల వద్ద ఏర్పాటు చేసిన డెలివరి సిస్టర్న్‌లోకి మళ్లిస్తారు. 2 డయామీటర్ల వ్యాసార్థం గల రెండు పైపుల ద్వారా 1.075 కిలోమీటర్‌ మేర పారే నీటిని 684 ఎఫ్‌ఆర్‌ఎల్‌కు ఎత్తిపోస్తారు. ఈ ప్రాంతంలో చెరువులు, కుంటలను నింపగా మిగిలిన 776.93 క్యూసెక్కుల నీటిని 70 మీటర్ల ఎత్తులో ఉన్న ముచ్చర్లకు లిఫ్ట్‌ చేస్తారు. చివరగా మిగిలిన 286 క్యూసెక్కుల నీటిని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని చెరువులను నింపేందుకు వినియోగించనున్నారు. మొత్తం 27,162 ఎకరాలకు ఏడాదిపాటు సాగు నీటిని అందించేలా ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు.   

279 చెరువులకు జీవం

రాచకొండ ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని 279 చెరువులకు పునరుజ్జీవం రానున్నది. భువనగిరి నియోజకవర్గం పరిధిలో 8 చెరువులు, మును గోడులో 9, ఇబ్రహీంపట్నం పరిధిలో 123, జడ్చర్లలో 6, కల్వకుర్తిలో 9, మహేశ్వరంలో 90, మేడ్చల్‌ పరిధిలో 4, రాజేంద్రనగర్‌లో 5, షాద్‌నగర్‌లో 24 చెరువులతోపాటు చేవెళ్లలో ఒక చెరువును రాచకొండ ఎత్తిపోతల నీటితో నింపనున్నా రు. దీనివల్ల ఆయా చెరువుల కింద ఉన్న బావు లు, బోర్లలో భూగర్భ జలాలు గణనీయంగా పెరగనున్నాయి.logo