బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 11, 2020 , 01:51:11

తలసిరిలో మనం ఘనం

తలసిరిలో మనం ఘనం
  • 26 జిల్లాల్లో జాతీయ సగటు కంటే అధికం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: స్వరాష్ట్రంలో తెలంగాణ సంపద అనూహ్యంగా పెరుగుతున్నది. ఆర్థికమాంద్యంలోనూ ఆ జోరు కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)తోపాటు తలసరి ఆదాయం కూడా పెరిగింది. రాష్ట్రంలోని 26 జిల్లాల తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే అధికంగా ఉండటం గమనార్హం. తెలంగాణలో జిల్లాల పునర్విభజన తర్వాత 10 జిల్లాలు 33 జిల్లాలకు పెరిగాయి. దీంతో జిల్లాలో అధికారుల పర్యవేక్షణ పెరిగింది. సీఎం కేసీఆర్‌ తీసుకొన్న విధాన నిర్ణయాలు, పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నేరుగా ప్రజలకు చేరుతున్నాయి. 


ముఖ్యంగా రాష్ట్రంలో సాగునీటి లభ్యతను గణనీయంగా పెరిగి బీళ్లన్నీ సాగులోకి రావడం, రైతుబంధు పథకం అమలుతో రైతులు రెట్టించిన ఉత్సాహంతో సేద్యం చేస్తున్నారు. దీంతో వ్యవసాయరంగం మరింత ఊపందుకొన్నది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన టీఎస్‌ఐపాస్‌ చట్టం పారిశ్రామికరంగానికి గొప్ప టానిక్‌లా పనిచేస్తుండటంతో హైదరాబాద్‌కు పరిశ్రమలు భారీగా తరలి వస్తున్నాయి. ప్రత్యేకించి సాఫ్ట్‌వేర్‌ రంగానికి హైదరాబాద్‌ కేరాఫ్‌ అడ్రస్‌లా మారడంతోపాటు మెడికల్‌ హబ్‌గా రూపుదిద్దుకొన్నది. ఇదేవిధంగా తెలంగాణలో పలు ఇతర రంగాలు ప్రగతిపథంలో పరుగులు తీస్తుండటంతో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదయ్యింది.


రంగారెడ్డి జిల్లా టాప్‌

2018-19లో జాతీయ తలసరి ఆదాయం రూ.1,26,521గా ఉండగా.. తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2,04,488గా నమోదైంది. జిల్లాలవారీగా పరిశీలిస్తే రంగారెడ్డి జిల్లా రూ.5,78,978 తలసరి ఆదాయంతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా.. మంచిర్యాల జిల్లా రూ.1,27,703 తలసరి ఆదాయంతో 26వ స్థానంలో నిలిచింది. కేవలం వరంగల్‌ అర్బన్‌, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, జగిత్యాల, నారాయణపేట జిల్లాలు మాత్రమే జాతీయ సగటు కంటే స్వల్పంగా వెనుకబడి ఉన్నాయి. 


తెలంగాణ ఆర్థిక ప్రగతి అద్భుతం 

ఒకప్పుడు తెలంగాణ తలసరి ఆదాయం బీహార్‌ కంటే తక్కువ. ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. తెలంగాణ దేశంలోనే సంపన్న రాష్టంగా మారింది. ప్రజల తలసరి ఆదాయం భారీగా పెరిగింది. ఈ మాటలు అన్నది ఎవరోకాదు. ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడు మోహన్‌గురుస్వామి స్వయంగా అన్న మాటలివి. రాష్ట్ర విభజన తర్వాత, ప్రజల జీవనప్రమాణాలు గణనీయంగా పెరిగాయని ఆయన పేర్కొన్నారు. గతంలో అత్యంత పేద ప్రాంతాలుగా ఉన్న కరీంనగర్‌ లాంటి జిల్లాల్లో ఇప్పుడు తలసరి ఆదాయం బాగా పెరిగిందని, తెలంగాణ తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే దాదాపు 25 శాతం అధికంగా ఉండటం విశేషమని ఆయన ట్వీట్‌ చేశారు. ఈ అద్భుత ప్రగతికి తెలంగాణ  మురిసిపోయి సీఎం కేసీఆర్‌కు కిరీటం తొడిగినా ఆశ్చర్యం లేదని మోహన్‌గురుస్వామి పేర్కొన్నారు.

- మోహన్‌ గురుస్వామి,ప్రముఖ ఆర్థికవేత్త 


జిల్లాలవారీగా తలసరి ఆదాయం (రూపాయల్లో)logo
>>>>>>