సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 14, 2020 , 03:53:57

రాష్ట్రంలో కొత్తగా253 కేసులు

రాష్ట్రంలో కొత్తగా253 కేసులు

  • గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే 179 కేసులు
  • 8 మంది మృతి, 74 మంది డిశ్చార్జి
  • నిర్లక్ష్యం వద్దంటున్న ప్రజారోగ్యశాఖ
  • ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి వైరస్‌ పాజిటివ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో శనివారం రికార్డుస్థాయిలో 253 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 179 ఉండగా, సంగారెడ్డి జిల్లాలో 24, మేడ్చల్‌ మల్కాజిగిరి 14, రంగారెడ్డి 11, మహబూబ్‌నగర్‌ 4, వరంగల్‌ రూరల్‌, వరంగల్‌ అర్బన్‌, కరీంనగర్‌, నల్లగొండ, ములుగు, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాల్లో రెండు చొప్పున, సిద్దిపేట, ఖమ్మం, మెదక్‌, నిజామాబాద్‌, నాగర్‌కర్నూల్‌, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. కరోనా తీవ్రతకు తోడు ఇతర వ్యాధులతో బాధపడుతున్న 8 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 4,737 కేసులు నమోదుకాగా, ఇందులో 182 మం ది మరణించారు. మాస్కులు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడం వంటి కారణాలతోనే రాష్ట్రలో కేసులు పెరుగుతున్నాయని ప్రజారోగ్యశాఖ ఆందోళన వ్యక్తంచేసింది. పదేండ్ల లోపు పిల్లలు, 60 ఏండ్లు పైబడినవారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, ఆరు ఫీట్ల భౌతికదూరం పాటించాలని విజ్ఞప్తిచేసింది. పని స్థలాల్లో చేతులు శుభ్రం చేసుకొనేందుకు సబ్బు లు, శానిటైజర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, ఉద్యోగులు భౌతికదూరం పాటిస్తూ పనులు చేసుకోవాలని పేర్కొన్నది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే దగ్గరలోని ప్రభుత్వ దవాఖానకు వెళ్లాలని సూచించింది. 

ఒకే కుటుంబంలో 19 మందికి..

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన 19 మందికి వైరస్‌ సోకింది. జహీరాబాద్‌కు చెందిన ఓ మహిళ (55) అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో చేరగా, ఈ నెల 9న కరోనా లక్షణాలతో మృతిచెందింది. అప్పటికే వైద్యులు ఆమె నుంచి శాంపిల్స్‌ సేకరించారు. అంత్యక్రియల అనంతరం నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. దీంతో చనిపోయిన మహిళకు సన్నిహితంగా తిరిగిన కుటుంబసభ్యులు, బంధువులను గుర్తించి ఐసొలేషన్‌ కేంద్రానికి తరలించారు. 25 మంది శాంపిళ్లను సేకరించగా, 19 మందికి శుక్రవారం రాత్రి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

జీహెచ్‌ఎంసీ మేయర్‌కు మళ్లీ నెగెటివ్‌

జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్‌గా వచ్చింది. మేయర్‌ కారు డ్రైవర్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో శుక్రవారం ఆయనకు పరీక్షలు నిర్వహించగా, శనివారం వచ్చిన నివేదికలో వైరస్‌ సోకలేదని తేలింది.

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి దంపతులకు కరోనా

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా పాజిటివ్‌ రావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ దవఖానలో చికిత్స పొందుతున్నా రు. ప్రస్తుతం ఆయన సతీమణి పద్మలతారెడ్డితోపాటు కారు డ్రైవర్‌, గన్‌మెన్‌, వంటమనిషికి కూడా వైరస్‌ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయమై ఎమ్మెల్యే సతీమణి పద్మలతారెడ్డి మీడియా కు పంపిన ఆడియో సందేశంలో పలు విషయాల ను వెల్లడించారు. ఎమ్మెల్యేతోపాటు తమకు కరో నా సోకినప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నామన్నారు. logo