శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 18, 2020 , 01:49:50

ఇంటి ఆవరణలోనే 250 పండ్ల మొక్కలు పెంచాడు..

ఇంటి ఆవరణలోనే 250 పండ్ల మొక్కలు పెంచాడు..

హరితహారం స్ఫూర్తిగా ధూళికట్టకు చెందిన టీ సెర్ఫ్‌ సీసీ గీస ఆనంద్‌ తన ఇంటినే ఉద్యానవనంలా మార్చాడు. ఐదు గుంటల ఆవరణలో 250 రకాల పండ్ల, ఔషధ మొక్కలు నాటి పచ్చని పొదరిల్లుగా తీర్చిదిద్దుకున్నాడు. కొద్దిపాటి జాగలో తన ఇంటి అవసరాల కోసం సేంద్రియ విధానంలో కూరగాయలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.  గీస ఆనంద్‌ ఎలిగేడులో సీసీగా పనిచేస్తున్నాడు. ఆయనకు మొక్కల పెంపకం అంటే చాలా మక్కువ. ఆ ఇష్టంతోనే ధూళికట్టలోని తన ఇంటి ఆవరణలో మూడేళ్ల క్రితం 250 మొక్కలు నాటాడు. మామిడి, నిమ్మ, దానిమ్మ, జామ, అరటి, సపోటా, బొప్పాయి, ఉసిరి, అల్ల నేరేడు, పనస, సీతాఫలంతోపాటు పూలు, ఔషధ మొక్కలను పెంచుతున్నాడు. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే, ఉదయం, సాయంత్రం వేళల్లో వాటిని సంరక్షిస్తున్నాడు. 

ఇప్పటికే ఆ మొక్కలు ఎదిగి, ఫలాలనిస్తుండడంతో సంతోషపడుతున్నాడు. ఇంకా కూరగాయలు కూడా సాగు చేస్తున్నాడు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో టమాట, బీర, వంకాయ, దొండ, బెండ, ఆనిగయపుకాయ, కాకరకాయ, గోంగూర, పాలకూర, చుక్క కూర, చిక్కుడు పండిస్తున్నాడు. వాటిని తన ఇంటి అవసరాలకు వినియోగిస్తూ, ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాడు. 

కేసీఆర్‌ సారే స్ఫూర్తి 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా హరితహారం చేపట్టిండు. ఆ స్ఫూర్తితోనే మా ఇంటి ఆవరణలో ఖాళీ స్థలం లేకుండా మొక్కలు నాటాలని అనుకున్న. మూడేండ్ల కింద మొక్కలు తెచ్చి పెట్టిన. నా భార్యాపిల్లల సహకారంతో వాటిని పెంచుతున్న. ఇటీవల డీఆర్‌డీవో అడిషనల్‌ పీడీ సునీత, మండలస్థాయి అధికారులు మా ఇంటికి వచ్చిన్రు. మొక్కలను చూసి మెచ్చుకున్నరు. చాలా ఆనందంగా ఉంది.

- గీస ఆనంద్‌ logo