బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 02:10:57

ఎంతగోస ఎల్లదీసినమో!

ఎంతగోస ఎల్లదీసినమో!

  • పొద్దుగాల పోతే పొద్దుగూకేది.. మూరెడంత తోక పాస్‌బుక్‌ కోసం ఆర్నెళ్లు తిరిగిన
  • 25 ఏండ్ల నాటి రిజిస్ట్రేషన్‌ బాధల్ని నెమరేసుకున్న రైతు ఎల్లయ్య

సిరిసిల్ల, నమస్తే తెలంగాణ: ధరణి వచ్చే ముందుదాకా భూమి రిజిస్ట్రేషన్‌ అంటే పెద్ద సాహసమే. పైసలుంటేనే పనైతది అన్న ఆలోచనతో ప్రజలు ఉండేవారు. నాటి బాధలు వర్ణనాతీతం అంటున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం తాడూరుకు చెందిన రైతు మాసూరి ఎల్లయ్య. రిజిస్ట్రేషన్‌ అంటే నరకంలా కనిపించేదని, ఇప్పుడా సమస్య లేకుండా పోయిందని గత చేదు అనుభవాలను నెమరువేసుకున్నాడు. ‘25 ఏండ్ల కిందట మా ఉరాయన దగ్గర 12 ఎకరాల భూమి కొన్నా. అప్పుడు మా ఊరికి బస్సు లేదు. 5 కిలోమీటర్ల దూరంలోని సిరిసిల్లలో రిజిస్టర్‌ కార్యాలయం ఉండేది. ఇద్దరు సాక్షులు, మధ్యవర్తిని తీసుకొని కచ్చురం మీద పోయినం. ఆరోజు సారు దొరకలేదు. తెల్లారిపోతే సంతకాలు తీసుకున్నరు. కాగితాలు సరిగా లేవని, రేపురా అన్నరు.

తెల్లారి సాక్షులను బతిమిలాడి తీసుకుపోయిన. కచ్చరం ఇరుసు ఇరిగిపోతే వాళ్లను సిరిసిల్ల వాగులో నుంచి నడిపించుకుంటూ ఆఫీసుకు తీసుకుపోయిన. అన్ని కాగితాలు సరిజేసి తీసుకునేసరికి పొద్దుగూకింది. అందరం కలిసి వాగులో నడుచుకుంటూ తాడూరు ఒడ్డుకు వచ్చినం. అక్కడ నాతోటి వచ్చినోళ్లకు తాటి కల్లు తాగించిన. ఆ తర్వాత మూరెడంత తోక పాసుబుక్కు కోసం ఆర్నెళ్లు తిరిగిన’ అని ఎల్లయ్య తెలిపాడు. కేసీఆర్‌ సార్‌ దయవల్ల ఇప్పుడు ఆ బాధలు తీరినాయని, తన ఇద్దరు కొడుకులు బాలయ్య, ముత్తయ్య పేర్ల మీద చెరో నాలుగెకరాలు పట్టా చేశారని వివరించాడు. ‘మొన్న శనివారం మీసేవలో దరఖాస్తు చేసుకున్న. పొద్దుగాలనే కడుపునిండా తిని ఒంటిగంటకు తాసిల్‌ ఆఫీసుకు పోయిన. సంతకాలు, పత్రాలు తీసుకుని పావుగంటలోనే పట్టా చేసిన్రు. గింత జల్దిన పనైతదంటే నమ్మబుద్ధికాలె. అప్పటి రోజులు యాదికొచ్చినయ్‌. ఎంత గోస ఎల్లదీసినమో తలుసుకుంటే కండ్లళ్ల నీళ్లు తిరిగినయ్‌' అని పేర్కొన్నాడు.