శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 24, 2020 , 01:18:22

గ్రామంలోనే ధాన్యం కొనుగోళ్లు

గ్రామంలోనే ధాన్యం కొనుగోళ్లు

  • ధాన్యం కోసం రూ.25 వేల కోట్ల బ్యాంకు గ్యారంటీ
  • రూ.1,760 చొప్పున యాసంగి మక్కజొన్న కొనుగోళ్లు 
  • వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: రాష్ర్టంలో లాక్‌డౌన్‌ వల్ల  రైతులకు ఇబ్బంది లేకుండా గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాలని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్‌ ప్రభావం ధాన్యం కోనుగోళ్లపై పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం ఆయన బీఆర్కేభవన్‌లో పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.  సమావేశంలో  పౌరసరఫరాల కార్పొరేషన్‌ చైర్మన్‌ శ్రీనివాసరెడ్డి, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ గంగారెడ్డి, పౌరసరఫరాలశాఖ, సహకారశాఖల కమిషనర్లు సత్యనారాయణరెడ్డి, వీరబ్రహ్మయ్య, మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు. 

అనంతరం నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్ల కోసం రూ.25 వేల కోట్లకు బ్యాంక్‌ గ్యారంటీ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ఆర్థికశాఖను ఆదేశించినట్టు తెలిపారు. యాసంగిలో పండిన మక్కలను రూ.1,760కు కొనుగోలు చేయనున్నట్టు.. పౌల్ట్రీ సంక్షోభం నేపథ్యంలో రైతులు నష్టపోకుండా మార్క్‌ఫెడ్‌ ద్వారా వెంటనే కొనుగోలు చేయాలని సీఎం ఆదేశాలిచ్చినట్టు చెప్పారు. గ్రామాల నుంచి రైతులు పట్టణ మార్కెట్ల వరకూ రాకుండా.. ఆయా గ్రామాల్లోనే ధాన్యం అమ్మకాలు జరిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామలవారీగా ధాన్యం దిగుబడిని అంచనావేసి కొనుగోళ్లకు టోకెన్‌ ద్వారా ఏర్పాట్లు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వర్షాలు వస్తే తడువకుండా టార్పాలిన్లు సరఫరా చేయాలని సూచించారు. కొత్తగా 60 వేల టార్ఫాలిన్లను త్వరగా కొనుగోలు చేయాలని ఆదేశించారు. వీటన్నింటినీ ఏప్రిల్‌ 15 వరకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. 


logo