శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 11, 2020 , 21:44:49

జియాగూడలో ఒకే రోజు 25 కరోనా కేసులు నమోదు..

జియాగూడలో ఒకే రోజు 25 కరోనా కేసులు నమోదు..

  • భయాందోళన చెందుతున్న ప్రజలు
  • కట్టుదిట్టం చేయాలని స్థానికుల విజ్ఞప్తి 

జియాగూడ : నగరంలోని జియాగూడ డివిజన్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో కరోనా వైరస్‌ కేసులు కలకలం రేపుతున్నాయి. సోమవారం ఒక్కరోజే జియగూడ డివిజన్‌ పరిధిలో 25 మందికి కరోనా సోకినట్లు కుల్సుంపురా పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొన్నారు. ఈ డివిజన్ లో కరోనా బారిన పడి దవాఖానలో చికిత్స పొందుతున్న వారి కుటుంబ సభ్యుల నుంచి రక్త నామునాలను సేకరించి వైద్యపరీక్షలు నిర్వహించగా పెద్ద మొత్తంలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

డివిజన్‌ పరిధిలోని దుర్గానగర్‌ ప్రాంతంలో ఇటీవలే ఓ వ్యక్తికి కరోనా సోకింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి కుటుంబంలోని ఐదుగురికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందరికీ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. జియగూడలోని వెంకటేశ్వరనగర్‌లో కూడా గత కోన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్‌తో ఓ మహిళ మృతి చెందింది. దీంతో ఆమె కూతరు(18), తోటి కోడలికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అదే ప్రాంతంలోని విశ్రాంత ఉద్యోగి (75) కరోనా పాజిటివ్‌తో ప్రాణాలు కోల్పోయాడు. రిటైర్డ్ ఉద్యోగి కూతురు(32), కోడలు (36), పక్కింట్లో ఉన్న మరో యువకుడికి(25)కి కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయ్యింది. 

సబ్జీమండి ప్రాంతంలోని మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. అతని కుమారుని (20)కి కూడా కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఇందిరానగర్‌లోని ఓ మహిళ (51)కు కూడా కరోనా పాజిటివ్‌ నిర్థారణ కావడంతో.. ఆమె కుమారుని(40)కి కరోనా పరీక్షలు నిర్వహించగా అతనికి పాజిటివ్ నిర్ధారణ అయింది. 

శ్రీ సాయినగర్‌లోని రిటైర్డ్‌ ఉద్యోగి కరోనాతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో ఐదుగురు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయింది. దుర్గానగర్‌ ప్రాంతంలోని బియ్యం దుకాణం వ్యాపారికి ఇదివరకే పాజిటివ్‌ నమోదు కాగా వారి ఇంట్లో ఇద్దరు కుమారులు(10), (12), భార్య (32), తల్లి(60)కి వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరందరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 

జియగూడ డివిజన్‌ పరిధిలో ఇప్పటి వరకు మొత్తం 68 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందారు. మరో తొమ్మిది మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు అధికారులు తెలిపారు. కుల్సుంపురా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జియాగూడ డివిజన్‌ పరిధిలోని అన్ని ప్రాంతాలలో దుకాణాలను మూసి వేసి జన సంచారం లేకుండా చర్యలు చేపట్టారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి కరోనాకు కట్టడి  చేయాల్సిన అవసరం ఉందని ప్రజలలో పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. 

కరోనా విస్తరణకు అడ్డు కట్ట వేసేందుకు గాను పోలీసులు ఇప్పటికే తొమ్మిది ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్‌లుగా ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఐతే సోమవారం చోటు చేసుకున్న కేసులతో మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. డివిజన్‌ పరిధిలోని అన్ని ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్‌లుగా మార్చి ఇంటింటా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు కరోనా పరీక్షలు నిర్వహించి వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కరీంనగర్‌, సూర్యాపేట తరహాలో కరోనా కట్టడికి ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. logo