గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 02:35:11

వ్యవసాయానికి ప్రాధాన్యం

వ్యవసాయానికి ప్రాధాన్యం
  • 25,811 కోట్లు కేటాయింపు
  • రైతుబంధుకు అదనంగా రెండువేల కోట్లు
  • వెయ్యికోట్లతో మార్కెట్‌ ఫండ్‌
  • బడ్జెట్‌ ప్రసంగంలో హరీశ్‌రావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వ్యవసాయానికి ప్రాధాన్యం.. అన్నదాతకే అగ్రస్థానం దక్కింది. 2020-21 వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వం వ్యవసాయం, అనుబంధరంగాలకు అధిక ప్రాధాన్య మిచ్చింది. బడ్జెట్‌లో రూ. 25,811.78 కోట్లు కేటాయించింది. రైతుబంధు పథకానికి రూ. 14వేల కోట్లు కేటాయింగా, గతేడాదితో పోల్చితే ఇది రూ.2వేల కోట్లు అధికం. సాగునీటి ప్రాజెక్టులు పూర్తికావడం, పంటల సాగువిస్తీర్ణం పెరుగడంతోపాటు ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు కొత్త పాస్‌పుస్తకాల మంజూరు వల్ల రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య వచ్చే ఏడాది పెరుగనున్నదని గుర్తించిన ప్రభు త్వం.. అందుకనుగుణంగా ఈ పథకానికి ఈసారి కేటాయింపులు పెంచింది. రైతుబీమా పథకానికి ప్రభుత్వం రూ. 1,141 కోట్లు కేటాయించింది. 18 నుంచి 60 ఏండ్ల మధ్య వయసు ఉండి.. గుంట భూమి ఉన్నా ఒక్కో రైతుకు బీమా ప్రీమియం కోసం రూ. 2,271.50 చొప్పున ఎల్‌ఐసీకి జమచేయనున్నారు. 


మృతిచెందిన రైతు కుటుంబానికి  పదిరోజుల్లోనే రైతుబీమా కింద రూ.5 లక్షల పరిహారం అందుతుంది. ఆర్థికమాంద్యం ఉన్నప్పటికీ రైతురుణమాఫీ అమలుచేసి తీరుతామని స్పష్టంచేసిన ప్రభు త్వం.. లక్షలోపు రుణాలను నాలుగు విడుతలుగా మాఫీచేయనున్నట్టు పేర్కొన్నది. 2014లో రూ.16,124 కోట్ల రుణాలను మాఫీచేసిన ప్రభుత్వం.. ప్రస్తుతం బడ్జెట్‌లో రూ. 6,225 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.25 వేల లోపు రుణాలు ఒకే విడుతలో మాఫీచేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఈ నెలలోనే రూ.1,198 కోట్లు విడుదల చేయనున్నట్టు హరీశ్‌రావు తెలిపారు. 


పంటల కొనుగోలుకు అత్యవసర ఫండ్‌

వరి, పత్తి, మక్కజొన్న, కందులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకం గా మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌ స్కీంను ప్రవేశపెట్టింది. కేంద్రప్రభుత్వం పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయడంలో పరిమితి వి ధి స్తుండటంతో రైతులు దళారులను ఆశ్రయించాల్సి వస్తున్నది. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించింది. ఈ స్కీం ద్వారా రైతులు పండించిన పంట ఉత్పత్తులకు ధరల స్థిరీకరణ కల్పిస్తారు. మైక్రో ఇరిగేషన్‌ ప్రోత్సాహానికి రూ.600 కోట్లు, రైతులకు రాయితీపై నాణ్యమైన విత్తనాల సరఫరాకు రూ.142 కోట్లు కేటాయించారు. వ్యవసాయ వర్సిటీకి రూ.25 కోట్లు కేటాయించారు.


logo
>>>>>>