ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 11, 2020 , 02:12:29

తెరపైకి మెదక్‌ మాజీ కలెక్టర్‌ ధర్మారెడ్డి పేరు

తెరపైకి మెదక్‌ మాజీ కలెక్టర్‌ ధర్మారెడ్డి పేరు

  • రూ.1.12 కోట్ల లంచం కేసులో కొత్త ట్విస్టు
  • ఉద్యోగ విరమణకు ఒక్కరోజు ముందు ఎన్వోసీ ఫైల్‌పై సంతకాలు!
  • మెదక్‌ అదనపు కలెక్టర్‌ ఇంట్లో 24 గంటలపాటు సోదాలు
  • సేల్‌ అగ్రిమెంట్‌ పత్రాలు, ఖాళీ చెక్కులు స్వాధీనం
  • మరింత లోతుగా ఏసీబీ విచారణ

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ/మెదక్‌: 112 ఎకరాల భూమికి ఎన్వోసీ ఇచ్చేందుకు అదనపు కలెక్టర్‌ రూ.1.12 కోట్లకు లాలూచీ పడిన వ్యవహారంలో మెదక్‌లో పనిచేసి రిటైర్‌ అయిన కలెక్టర్‌ ధర్మారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. గత జూలై 31న కలెక్టర్‌గా ధర్మారెడ్డి ఉద్యోగ విరమణ పొందారు. రిటైర్‌మెంట్‌కు ఒక రోజు ముందే ఈ 112 ఎకరాల భూమి ఎన్వోసీ ఫైల్‌పై ధర్మారెడ్డి సంతకం చేసినట్లు తెలుస్తున్నది. ‘కలెక్టర్‌ ధర్మారెడ్డితో మాట్లాడి మీ పని చేయిస్తా’నని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ భూ యజమాని లింగమూర్తి నుంచి ఎకరాకు లక్ష చొప్పున రూ.1.12 కోట్ల డీల్‌ కుదుర్చుకున్నట్లు తెలుస్తున్నది. ఈ వ్యవహారంలో ధర్మారెడ్డి పాత్రపై లోతుగా విచారిస్తున్నామని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఇదే వ్యవహారంలో వీఆర్వోలు, వీఆర్‌ఏల పాత్ర ఏ మేరకు ఉన్నదనే అంశంలోనూ విచారణ చేస్తున్నామని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణరావు గురువారం చెప్పారు. ఈ కేసులో బుధవారం అదనపు కలెక్టర్‌ను పట్టుకొన్న ఏసీబీ అధికారులు 24 గంటలపాటు తనిఖీలు చేసి విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అదనపు కలెక్టర్‌తోపాటు నర్సాపూర్‌ ఆర్డీవో అరుణారెడ్డి, తాసిల్దార్‌ అబ్దుల్‌సత్తార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ వసీం హైమద్‌, నగేశ్‌ బినామీ జీవన్‌గౌడ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో నగేశ్‌ను ఏసీబీ అధికారులు మెదక్‌ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. 

దర్జాగా ఆయనే డీల్‌ చేశారు..

అవినీతి, అక్రమాల వ్యవహారాలను ఉన్నతాధికారులు స్వయంగా డీల్‌ చేయరు. తమ కిందిస్థాయి సిబ్బంది తో కథ నడిస్తుంటారు. ఇక్కడ మాత్రం రూ.1.12 కోట్ల అవినీతి వ్యవహారాన్ని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ స్వయం గా డీల్‌ చేయడం అధికార యంత్రాంగంలో చర్చనీయాంశంగా మారింది. అదనపు కలెక్టర్‌ స్థాయి అధికారి ఇంత బరితెగించి లంచాన్ని డీల్‌ చేయడం, నేరుగా తన బినామీ పేరున భూమిని సేల్‌ అగ్రిమెంట్‌ చేయించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. వీడియో, ఆడియో టేపుల్లో అదనపు కలెక్టర్‌ నగేశ్‌ స్వయంగా డబ్బుల గురించి మాట్లాడటం మీడియాలో చూస్తూ జనం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ స్థాయిలో అధికారులు అవినీతికి పాల్పడితే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చిప్పల్‌తుర్తిలోని 112 ఎకరాల భూమికి సంబంధించి లింగమూర్తి నుంచి రెండు విడతలుగా రూ.19.50 లక్షలు, రూ. 20.50 లక్షలు మొత్తం రూ.40 లక్షలు అదనపు కలెక్టర్‌ నగేశ్‌ తీసుకున్నారు. మిగతా రూ.72 లక్షల కోసం ఏకంగా 5 ఎకరాల భూమిని తన బినామీ జీవన్‌గౌడ్‌ పేరుపై సేల్‌ అగ్రిమెంట్‌ చేయించుకున్నాడంటే ఆయన బరితెగింపు అర్థమవుతున్నది. భూమి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు బాధితుడి నుంచి ష్యూరిటీ కోసం మరో 8 బ్లాంకు చెక్కులు నగేశ్‌ తీసుకోవడం గమనా ర్హం. తనకు చెప్పకుండా జూనియర్‌ అసిస్టెంట్‌ వసీం అహ్మద్‌కు రూ.5 లక్షలు ఎందుకిచ్చారంటూ లింగమూర్తిని నగేశ్‌ హెచ్చరించడం కొసమెరుపు.  

ఐదుగురి రిమాండ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:  ఏసీబీ అరెస్టు చేసిన  మెదక్‌ అదనపు కలెక్టర్‌ నగేశ్‌ సహా ఐదుగురు నిందితులకు ఏసీబీ కోర్టు ఈ నెల 24 వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. అదనపు కలెక్టర్‌ నగేశ్‌,  నర్సాపూర్‌ ఆర్డీవో అరుణారెడ్డి, తాసిల్దార్‌ అబ్దుల్‌ సత్తార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ వసీం హైమద్‌, నగేశ్‌ బినామీ జీవన్‌గౌడ్‌ను  ఏసీబీ అధికారులు గురువారం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చగా ఈ నెల 24 వరకు రిమాండ్‌ విధించింది. గురువారం రాత్రి ఐదుగురు నిందితులను ఏసీబీ అధికారులు చంచల్‌గూడ జైలుకు పంపారు.

బట్టలు ఉతకలేదని కేసు పెట్టించింది

మెదక్‌ అదనపు కలెక్టర్‌ భార్యపై దుమ్మెత్తిపోసిన చాకలి లక్ష్మి

ఏసీబీకి చిక్కిన మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌ విషయంలో అనేక కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. మెదక్‌ మండలం మాచవరం గ్రామస్థులు అదనపు కలెక్టర్‌ నగేశ్‌ భార్యపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బట్టలు ఉతికేందుకు ఒక్కొక్కరికి రూ.100 మాత్రమే ఇస్తానని చెబితే అందుకు ఒప్పుకోనందుకు ఆమె తమతో పంచాయితీ పెట్టుకున్నట్టు బాధితురాలు చాకలి లక్ష్మి ఆరోపించింది. ఈ విషయంలో తమ కుటుంబ సభ్యులు నలుగురిపై ఐపీసీ 107 సెక్షన్‌ కింద పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టించగా బెయిల్‌పై వచ్చామని తెలిపింది. 


logo