గురువారం 04 జూన్ 2020
Telangana - May 01, 2020 , 02:00:23

బహు పరాక్‌!..పాజిటివ్‌ కేసుల పెరుగుదలపై సీఎం ఆరా

బహు పరాక్‌!..పాజిటివ్‌ కేసుల పెరుగుదలపై సీఎం ఆరా

  • పాజిటివ్‌ కేసుల పెరుగుదలపై సీఎం ఆరా
  • జీహెచ్‌ఎంసీలో వ్యాప్తిపై చర్యలకు ఆదేశం 
  • సీఎం ఆదేశాలతో మంత్రి ఈటల సమీక్ష
  • కంటైన్మెంట్లు జోన్లుగా మలక్‌పేటగంజ్‌, పహాడీషరీఫ్‌
  • రాష్ర్టానికి కేంద్రం ప్రశంసలు
  • కరోనాపై విమర్శలకు తావులేదు
  • మంత్రి ఈటల రాజేందర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వారం రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ, కొత్తగా గురువారం 22  నమోదుకావడంతో వైద్యారోగ్యశాఖతోపాటు, ఇతర ప్రభుత్వశాఖలను సీఎం కేసీఆర్‌ అప్రమత్తం చేశారు. ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి కరోనా కట్టడిపై చర్చించాలని, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కరోనా వ్యాప్తికి కారణాలు గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి ఈటల రాజేందర్‌ను ఆదేశించారు. దీంతో గురువారం బీఆర్కే భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ ఏ శాంతికుమారి, మున్సిపల్‌, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శులతో మంత్రి ఈటల రాజేందర్‌ అత్యవసరంగా భేటీఅయ్యారు. 

సీఎం కేసీఆర్‌ సూచన మేరకు కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు. గురువారం 22 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,038కు చేరిందని, ముగ్గురు మృతిచెందారని చెప్పారు. కొత్తగా నమోదైన కేసుల్లో మలక్‌పేట్‌ గంజ్‌లో పనిచేస్తున్న పహాడీషరీఫ్‌, జల్‌పల్లికి చెందిన ఇద్దరి వల్ల మార్కెట్‌లో ముగ్గురు దుకాణాల యజమానులకు, వారి ద్వారా కుటుంబసభ్యులకు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిందని తెలిపారు. వీరి కుటుంబాలన్నింటినీ దవాఖానలో ఐసొలేషన్‌లో ఉంచామని, గంజ్‌, పహాడీషరీఫ్‌ ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. 

కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో కేంద్రం మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో పాటిస్తున్నారని కేంద్రబృందమే నివేదిక పంపిన తర్వాత రాజకీయ విమర్శలకు తావులేదని మంత్రి ఈటల పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చికిత్స, రోగులకు అందిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తంచేస్తూ.. ఢిల్లీ వేదికగా కేంద్రం ప్రశంసించడం సంతోషం కలిగించిందని చెప్పారు. ఇక్కడకు వచ్చిన కేంద్ర బృందం.. కొవిడ్‌ దవాఖానలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్రానికి నివేదిక పంపిందని తెలిపారు. హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ సలీలశ్రీవాత్సవ ప్రశంసించారని పేర్కొన్నారు.

ముగ్గురు మృత్యువాత

ఆరురోజులుగా తక్కువ కేసులు నమోదవగా గురువారం జీహెచ్‌ఎంసీలోనే 22 నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,038కి చేరింది. డిశ్చార్జి అయినవారి సంఖ్య 442కు చేరింది. గురువారం ముగ్గు రు మృతిచెందడంతో, మరణాల సంఖ్య 28కి చేరింది. 568 మంది చికిత్స పొందుతున్నారు. మృతిచెందినవారిలో హైదరాబాద్‌లోని రామంతాపూర్‌కు చెందిన వ్యక్తి(48) ఉన్నారు. కరోనాతో గాంధీలో చేరిన 12 గంటల్లోనే ఆయన మృతిచెందారు. షుగర్‌, బీపీ, న్యుమోనియాతో బాధపడుతూ చనిపోయినట్టు వైద్యులు పేర్కొన్నారు. 74 ఏండ్ల వనస్థలిపురంవాసి గుండె, కిడ్నీ, న్యూమోనియాతో గాంధీలో చేరిన 24 గంటల్లోనే చనిపోయారు. జియాగూడలోని దుర్గానగర్‌కు చెందిన 44ఏండ్ల మహిళ బుధవారం గాంధీకి వెంటిలేటర్‌పై వచ్చిన ఆరు గంటల్లోనే మృతిచెందారు. ఆమె కూడా బీపీ, షుగర్‌, న్యుమోనియాతో బాధపడుతున్నట్టు నిర్ధారించారు. 

వైద్యులకు వైద్యుడి ప్రశంసలు

కరోనా బారినపడి ఓ వైద్యుడు గురువారం డిశ్చార్జి అయ్యారు. ఆ వైద్యుడు (50) 20 రోజుల కింద ట కరోనా లక్షణాలతో గాంధీలో చేరారు. చికిత్స అందించి పూర్తిగా నయం చేసిన వైద్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

కరోనాను జయించిన బాలుడు 

ఐదేండ్ల బాలుడు కరోనాను జయించాడు. జగిత్యాల మండ లం వంజరిపల్లెకి చెందిన బాలుడికి పుట్టుకతోనే మాటలు రాకపోవడంతో నాలుగునెలల కిందట గుంటూరులో శస్త్ర చికిత్సచేయించారు. అక్కడే స్పీచ్‌థెరపీ ఇప్పించారు. లాక్‌డౌన్‌ ప్రకటించడంతో గ్రామానికి తీసుకొనిరాగా, కరోనా లక్షణాలు గమనించడంతో గాంధీ కి తరలించారు. చికిత్స ఇవ్వగా బుధవారం నెగెటివ్‌ వచ్చింది. గురువారం ఇంటికి వెళ్లాడు.


logo