మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 11, 2020 , 02:09:39

కాలువంతా ప్రాణహితమే

కాలువంతా ప్రాణహితమే

ఎగువన గోదావరి ఎడారిగా మారినా ఎస్సారెస్పీ ఆయకట్టులో సిరుల పంట పండుతున్నది. సర్కారు తుమ్మలతో ఆనవాళ్లు కోల్పోయిన కాకతీయ కాల్వల్లో ప్రాణహిత పరవళ్లు తొక్కుతున్నది. టెయిల్‌, హెడ్‌ అనే తేడాలేకుండా ప్రాజెక్టు మొదటి తూమునుంచి చివరి ఎకరా వరకు ప్రాణధారలు పారుతున్నాయి. వరదనీటికోసం దశాబ్దాలపాటు ఎదురుచూపులకు అలవాటుపడిన ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు దశను కాళేశ్వరం మార్చివేస్తున్నది. ప్రాజెక్టు చరిత్రలోనే కనీవినీ ఎరుగని రికార్డులు నమోదుచేస్తూ ఆయకట్టు రైతుల్లో వెలుగులు నింపుతున్నది. మీ పాదాల చెంతకు కాళేశ్వరం జలాలను తెచ్చి కష్టాలను దూరంచేస్తానన్న సీఎం కేసీఆర్‌ మాటలను నిజంచేసి చూపుతున్నది.

 • 146 రోజులుగా ఆ కొస నుంచి ఈ కొస దాకా పారుతున్న కాకతీయ కాల్వ
 • చరిత్రలో తొలిసారి ఎస్సారెస్పీ పూర్తి ఆయకట్టుకు నీరు
 • గోదావరి నీటితో నిండిన 2,138 చెరువులు
 • పద్నాలుగు జిల్లాలో పండుతున్న సిరుల పంటలు
 • 6 రికార్డులు
 • 1. గత 35 ఏండ్లలో ఎల్‌ఎండీ దిగువన కాకతీయ కాల్వలో తొలిసారి 6,100 క్యూసెక్కుల నీరు
 • 2.దిగువ మానేరు ప్రారంభమైన 1985 తర్వాత మొదటిసారి దిగువకు 52 టీఎంసీల విడుదల
 • 3. అక్టోబర్‌ 13 నుంచి సుమారు 146 రోజులపాటు కాకతీయ కాల్వకు నిరవధికంగా నీటి సరఫరా
 • 4. ఎస్సారెస్పీ స్టేజ్‌-2 పరిధిలోని 767 చెరువులు నిండటం ఎస్సారెస్పీ చరిత్రలోనే తొలిసారి
 • 5. స్టేజ్‌-2లోని ఆయకట్టుకు 24 టీఎంసీల నీరు పారడం ఇదే మొదటిసారి
 • 6. ఎస్సారెస

హైదరాబాద్‌/కరీంనగర్‌, నల్లగొండ ప్రధాన ప్రతినిధులు, నమస్తే తెలంగాణ: ఎగువన ఎండుతున్న గోదారితో ఎస్సారెస్పీ నిండి చివరి ఆయకట్టుకు నీరొస్తుందా!! అనే యాభైఏండ్ల ఎదురుచూపుకు తెరపడింది.. సర్కారు తుమ్మతో ఆనవాళ్లు కోల్పోయిన కాకతీయ కాలువల్లో కాళేశ్వరం ద్వారా ప్రాణహిత పరవళ్లు తొక్కుతున్నది. టెయిల్‌, హెడ్‌ అనే తేడా లేకుండా ప్రాజెక్టు మొదటి తూమునుంచి చివరి ఎకరా వరకు ప్రాణధారలు పారుతున్నాయి. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు కాళేశ్వరం అభయం ఇస్తున్నది. ఎస్సారెస్పీ చరిత్రలోనే తొలిసారిగా స్టేజి-2 చివరి ఆయకట్టుకు కూడా నీరందిస్తున్నది. 1970 జూలై 24న శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ప్రారంభమైంది. ప్రాజెక్టు స్టేజి-1 కింద పూర్వ నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల పరిధిలో 9,68,640 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఇందులో 0 నుంచి 146 కిలోమీటర్‌ వరకు (ఎల్‌ఎండీ ఎగువన) 4,62,920 ఎకరాలు, 146 నుంచి 284 కిలోమీటర్‌ (0దిగువన) 5,05,720 ఎకరాలు ఉన్నది. స్టేజి- 2 కింద 284 నుంచి 346 కిలోమీటర్‌ వరకు 3,97,949 ఎకరాలు, 767 చెరువుల కింద 59,622 ఎకరాలు కలిపి మొత్తం 4,57,571 ఎకరాలు ఆయకట్టు ఉన్నది. స్టేజి 1,2 కలిపి మొత్తం 14.26 లక్షలకుపైగా ఆయకట్టు ఉండగా.. ప్రాజెక్టుచరిత్రలో యాసంగిలో ఏనాడూ నా లుగైదు లక్షల ఎకరాలకు మంచి సాగయింది లేదు. కానీ, ప్రస్తుతం పరిస్థితి మారింది. కాకతీయ కాలువలో ప్రవహిస్తున్న ప్రాణహిత జలాల ద్వారా 346 కిలోమీటర్ల పరిధిలో ప్రతిఎకరాకూ నీరందుతున్నది. కాళేశ్వరం జలాలను ఎస్సారార్‌ నుంచి ఎల్‌ఎండీకిపంపి అక్కడినుంచి కాకతీయకెనాల్‌ ద్వారా పూర్తిఆయకట్టుకు అందిస్తున్నారు. 


దూరదృష్టితో కాలువకు మరమ్మతులు

ఒకవైపు కాళేశ్వరం పనులను పరుగులు పెట్టిస్తూనే.. శ్రీరాంసాగర్‌ స్టేజి-2 వరకు ప్రాణహిత నీటిని తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ముం దునుంచే చర్యలుచేపట్టింది. వాస్తవానికి కాకతీయకాలువ గరిష్ఠ ప్రవాహం 8,500 క్యూసెక్కులు. కానీ సమైక్యరాష్ట్రంలో 4వేల క్యూసెక్కులకు మించి ఎప్పుడూ నీటిని వదలిపెట్టలేదు. కాలువ మరమ్మతు, ఇతర విషయాలపై నాటి ప్రభుత్వాలు దృష్టిసారించకపోవడంతో కట్టలు ఎక్కడికక్కడే తెగిపోయి నీటి సరఫరాకు ఇబ్బంది కలిగేది. దీంతో కొన్నిసీజన్లలో నీళ్లు ఉన్నా.. విడిచిపెట్టలేని పరిస్థితి ఉండటంతో స్టేజి-1 వరకే ఎస్సారెస్పీ నీళ్లు పరిమితమయ్యేవి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూరదృష్టితో కాకతీయకాలువలో గరిష్ఠ ప్రవాహం మేరకు నీటిని విడుదలచేసేందుకు ఆదేశాలు జారీచేసి..  ఒక కమిటీ కూడా వేశారు. ఇరవైరోజులపాటు కాలువలను సందర్శించిన కమిటీ చేపట్టాల్సిన ఆధునికీకరణ పనులపై నివేదిక ఇచ్చింది. ఆ మేర కు ప్రభుత్వం రూ.వేయికోట్లతో ఆధునీకరణ పనులు చేపట్టింది. ఎల్‌ఎండీ ఎగువన 146 కి.మీ. వరకు రూ.వంద కోట్లతో.. ఎల్‌ఎండీ దిగువన స్టేజీ-2లో రూ.774 కోట్లతో కాలువ ఆధునీకరణ పను లు చేపట్టారు. ప్రస్తుతం కాకతీయకాలువలో రికార్డు స్థా యిలో 6,100 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతున్నది. 


నిండుగా చెరువులు

ఎస్సారెస్పీ స్టేజి-1 కింద 0-284 కి.మీ. వరకు మొ త్తం 1,645 చెరువులు ఉం డగా 1371 చెరువులు పూ ర్తిగా.. మిగిలిన 271 చెరువులు సగానికి నిండాయి. అలాగే స్టేజి-2 కింద 284 నుంచి 346 కి.మీ. పరిధిలో 767 చెరువులు ఉండగా అన్ని చెరువులను నిండాయి. 346 కిలోమీటర్‌ తర్వాత 69, 70, 71 డీబీఎంల ద్వారా సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లోని 14 మండలాల్లో కొన్నివందల చెరువులు పూర్తిగా నిండాయి.


42 టీఎంసీలు కాళేశ్వరజలాలే

2019-20లో ఎస్సారెస్పీలోకి ఆలస్యంగా వరదవచ్చింది. కాకతీయ కాల్వ ద్వారా ఎల్‌ఎండీకి ఎనిమిది టీఎంసీలు మాత్రమే వచ్చా యి. పరివాహకప్రాంతంలో కురిసిన వర్షాల ద్వారా11.058 టీఎంసీలు రాగా, అంతకుముందు 3.496 టీఎంసీల నిల్వ ఉన్నది. కానీ, ఎల్‌ఎండీ ద్వారా దిగువ ఆయకట్టుతోపాటు చెరువులు నింపడానికి వాడిన నీటి పరిమాణం 52.106 టీఎంసీలు. దీంతోపాటు, ఇప్పటికీ ఎల్‌ఎండీలో 10.509 టీఎంసీల నీటినిల్వ ఉన్నది. అంటే మొత్తం 65 టీఎంసీల్లో ఏకంగా 41.593 టీఎంసీలను కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎత్తిపోసి..  శ్రీరాజరాజేశ్వర జలాశయం ద్వారా ఎల్‌ఎండీకి తరలించినవే. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతోనే సాధ్యమైంది.


ఇకపై రెండు పంటలు

కాళేశ్వరం ప్రాజెక్టు గతేడాది జూన్‌ 21న సీఎం కేసీఆర్‌ చేతులమీదుగా ప్రారంభమైంది. భారీ మోటర్లు, కొత్తగా నిర్మించిన శ్రీరాజరాజేశ్వర జలాశయంలో పూర్తిస్థాయి నీటినిల్వ నింపడంలో సాంకేతిక ప్రొటోకాల్‌ అమలుచేయాల్సి ఉన్నందున ఆలస్యం కావడం.. అంతకుముందు ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీల్లో నీటినిల్వలు లేకపోవడం.. తదితర కారణాలతో 2019-20 వానాకాలం సాగునీటిని అందించడం సాధ్యం కాలేదు. ఇప్పుడు అన్నిరకాలుగా కాళేశ్వరం సిద్ధం కావడంతో శ్రీరాంసాగర్‌ను ఎల్‌ఎండీ ఎగువ వరకే పరిమితంచేసి.. దిగువన ఆయకట్టుకు అభయం ఇచ్చినట్టయింది. గతేడాది అక్టోబర్‌ 13 నుంచి ఇప్పటిదాకా యాసంగి సాగుకు నీరందుతూనే ఉన్నది. వచ్చే ఏడాది శ్రీరాంసాగర్‌ పరిధి ఆయకట్టులో రెండు పంటలకూ పుష్కలమైన నీరు అందనున్నది. ఇప్పటికే ఎల్లంపల్లి, ఎల్‌ఎండీల్లో పదిటీఎంసీలకు పైగా నీటినిల్వలు ఉండగా.. శ్రీరాజరాజేశ్వర జలాశయంలో 25 టీఎంసీలు, ఎస్సారెస్పీలో 46 టీఎంసీల వరకు ఉన్నాయి. దీంతో రానున్న వానాకాలం సాగుకు నిర్ణీత సమయంలోనే నీరందించే వీలున్నది.


టెయిల్‌ టు హెడ్‌

2018లో నీటి కొరత ఉన్న సమయంలో శ్రీరాంసాగర్‌ మొదటిదశ ఆయకట్టుకు నీరందించేందుకు పాటించిన టెయిల్‌ను హెడ్‌ పద్ధతినే ఇప్పుడు రెండోదశ ఆయకట్టు పరిధిలోని చెరువులను నింపేందుకు అమలుచేస్తున్నారు.


ఆయకట్టు జిల్లాలు

స్టేజీ-1 కింద నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, వరంగల్‌ రూరల్‌, వరంగల్‌ అర్బన్‌, మహబూబాబాద్‌, ఖమ్మం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలు.. స్టేజి-2 కింద వరంగల్‌రూరల్‌, జనగాం, మహబూబాబాద్‌, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో ఆయకట్టు విస్తరించి ఉన్నది.


చివరి చెరువు కింద యాసంగి జోరు 


సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలంలోని రావిచెరువు ఎస్సారెస్పీ ఫేజ్‌-2 పరిధిలో 71 డీబీఎం మీద ఉన్న చివరి చెరువు. గతంలో ఒక్కసారికూడా గోదావరి నీటితో ఇది నిండలేదు. భక్తళాపురం వద్ద అండర్‌ టన్నెల్‌ పనులను పూర్తిచేయించడంతోపాటు, కాళేశ్వరం ద్వారా ఎస్సారెస్పీ ఫేజ్‌-2 కాల్వల్లో నీళ్లు పారించి సూర్యాపేట జిల్లాలోని వేలచెరువులు నింపారు. చివరిచెరువు అయిన మాచారం గ్రామంలోని రావిచెరువు సైతం జనవరిలో నిండి అలుగుపోసింది. 140ఎకరాల శిఖం కలిగిన ఈ చెరువు కింద ప్రత్యక్షంగా 200 ఎకరాలు, పరోక్షంగా మరో వెయ్యిఎకరాల భూమి సాగవుతున్నది. ఈ చెరువు కింద బోర్లతో మొన్నటివరకు ఒకట్రెండు ఎకరాలు పండించుకున్న రైతులు.. ఈ యాసంగిలో తమకున్న మొత్తం భూమిని సాగుచేస్తున్నరు. 200 కిలోమీటర్ల దూరం నుంచి గోదావరి నీళ్లు మా ఊరికొస్తయని ఎన్నడూ అనుకోలేదని.. శెర్వు నిండి యాసంగి గూడ పంటలు పండుతయని కలల గూడ ఊహించలేదని మాచారం రైతులు సంబురపడుతున్నరు.


బాధలు పోయినయ్‌

నా వయస్సు 65 ఏండ్లు. చిన్నతనంలో వాననీళ్లతో మా ఊర్లోని రావి చెరువు నిండి రెండుపంటలు పండినయి. తర్వాత చెరువు నిండింది లేదు.. రెండు పంటలు పండింది లేదు. ఈసారి మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎస్సారెస్పీ ఫేజ్‌-2 కాల్వల ద్వారా గోదారి జలాలతో రావిచెరువును నింపడంతోపాటు, అలుగు దుంకినయి. చెరువు కింద ఉన్న 20 గుంటల్లో 8 గుంటలు అచ్చుగట్టి యాసంగి నాటువేసిన. వానాకాలం నాటికి మిగిలిన పన్నెండు గుంటలు కూడా సాగదోలి నాటుపెడతా. ఇన్నేండ్ల సంది వొడ్లు కొనుక్కుని బియ్యం పట్టిచ్చుకునేవాడిని. ఈసారి నుంచి తిండికి నాలుగ్గింజలు నా భూమిలోనే పండుతయి.

- శిత్రం పుల్లయ్య, మాచారం, పెన్‌పహాడ్‌ మండలం, సూర్యాపేట జిల్లా


నీటికోసం జైలుకెళ్లిన హిమ్మత్‌నగర్‌ రైతులు


కాకతీయ కెనాల్‌ నుంచి వచ్చే డీబీఎం-6 ఉపకాలువ చివరి ఆయకట్టు గ్రామం కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌. ఈ గ్రామంలో 1,852 ఎకరాల ఆయకట్టు ఉండగా.. గతంలో మూడునాలుగొందల ఎకరాలకు మించి నీళ్లు పారలేదు. 2007లో పంటలు ఎండుతుంటే.. హిమ్మత్‌నగర్‌తోపాటు, పక్కనే ఉన్న నర్సింహులపల్లె, అచ్చంపల్లి, శ్రీరాములపల్లి గ్రామాల రైతులు ముప్పైమంది ప్రధాన కాలువ తూమును పైకెత్తేందుకు వెళ్లారు. అక్కడ అధికారులు అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది. 22 మంది రైతులపై అధికారులు కేసులు పెట్టడంతో మూడురోజులు జైలులో ఉండాల్సి వచ్చింది. నేడు కాకతీయ కాలువ నిండుగా పారడంతో హిమ్మత్‌సాగర్‌ రూపురేఖలు మారిపోయాయి. ప్రస్తుతం 900 ఎకరాల్లో మక్క, 600 ఎకరాల్లో వరి సాగుచేస్తున్నారు. మిగిలిన భూమిలో వివిధ పంటలు సాగుచేయడంతో ఎటుచూసినా పచ్చదనమే కనిపిస్తున్నది. గ్రామంలోని చింతలచెరువు, లకోటకుంట కూడా కాళేశ్వరం జలాలతో నిండిపోయాయి.


ఆగం చేసిండ్రు

ఎండిపోతున్న పొలాలను చూసి తట్టుకోలేక.. తూములను ఎత్తుదామని ప్రధానకాలువ వద్దకు వెళ్లాం. నీళ్లు ఇవ్వకపోగా అధికారులతో గొడవపడ్డారని నాతోపాటు 22 మంది రైతులపై ఆప్పట్లో కేసులు పెట్టి జైలుకు పంపించారు. ఇప్పటికీ మాకు గుర్తుకొస్తే బాధ అనిపిస్తుంది. కానీ, ఇప్పుడు ఢోకాలేదు. గ్రామాలు పచ్చబడటమేకాదు, నీళ్లు సమృద్ధిగా రావడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాల మధ్య కూడా గొడవలు లేకుండాపోయాయి. ఎవరి పొలాల్లో వాళ్లం పనిచేసుకుంటున్నాం. ఇన్ని నీళ్లు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. 

-రామస్వామి, రైతు, హిమ్మత్‌నగర్‌


ఊరు చుట్టూ నీళ్ల సందడి