మంగళవారం 26 జనవరి 2021
Telangana - Jan 13, 2021 , 01:56:08

జీహెచ్‌ఎంసీలో..జీరో వాటర్‌బిల్‌

జీహెచ్‌ఎంసీలో..జీరో వాటర్‌బిల్‌

  • డిసెంబర్‌ బిల్లులో 20వేల లీటర్లు మినహాయింపు
  • 9 లక్షల మంది గృహ వినియోగదారులకు లబ్ధి
  • కొత్త పాలకవర్గం కొలువుదీరక ముందే ఎన్నికల వాగ్దానం నెరవేర్చిన టీఆర్‌ఎస్‌

 హైదరాబాద్‌లో రెండ్రోజుల ముందే సంక్రాంతి

  • భారం మోపలేదు.. బాధ్యత మరువలేదు
  • ఇచ్చిన హామీలు అమలుచేసి చూపిస్తున్నాం 
  • ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో నల్లాకనెక్షన్‌ ఉన్న ప్రతిఇంటికీ ఇరవైవేల లీటర్ల నీటిని ఉచితంగా అందజేస్తామని జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ 51 రోజుల్లోనే అమలయింది. జీహెచ్‌ఎంసీ పాలకవర్గం ఇంకా కొలువుదీరక ముందే ఎన్నికల హామీని నెరవేర్చి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకున్నది. 

జలమండలి అధికారులు 20 వేల లీటర్ల ఉచిత నీటి సరఫరాను మినహాయించి డిసెంబర్‌ నల్లా బిల్లులను జనరేట్‌ చేశారు. దీంతో దాదాపు 9 లక్షల మంది గృహ వినియోగదారులకు లబ్ధి చేకూరింది. 20 వేల లీటర్లు దాటిన నీటి వినియోగంపై పాత చార్జీలనే వసూలు చేయనున్నారు. జీరో వాట ర్‌ బిల్లులను ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు మంగళవారం జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం రహమత్‌నగర్‌లో ఇంటింటికీ తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంటింటికీ ఉచితంగా నీటిని సరఫరా చేస్తామని జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని 51 రోజుల్లోనే అమలుచేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కొనియాడారు. 

డిసెంబర్‌ నల్లా బిల్లులో 20వేల లీటర్ల ఉచిత నీటి సరఫరాను మినహాయించి జలమండలి అధికారులు డిసెంబర్‌ నెల బిల్లులు ఇచ్చారని, జీహెచ్‌ఎంసీ పరిధిలో దాదాపు 9 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. ఆరున్నరేండ్లలో ప్రజలపై భారం మోపకుండా అటు సంక్షేమం, ఇటు అభివృద్ధిని జోడెద్దుల్లా పరుగులు పెట్టిస్తున్నామని కేటీఆర్‌ చెప్పారు. కరెంటు, నీటి బిల్లులు, రిజిస్ట్రేషన్‌ చార్జీలు, ఇంటి పన్నులు ఇలా ఏ ఒక్కటీ పెంచకుండా కార్యదక్షతతో పనిచేస్తున్నామన్నారు. గతంలో ఖైరతాబాద్‌ జలమండలి కార్యాలయం వద్ద నిత్యం వందలమంది మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టేవారని.. స్వరాష్ట్రం లో అటువంటి పరిస్థితిని పూర్తిగా రూపుమాపామని చెప్పారు. 


రాజధానిలో 9 లక్షల కుటుంబాలకు ఉచితంగా నీటిని అందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌ మహిళలకు రెండ్రోజుల ముందే సంక్రాంతి వచ్చిందని హర్షం వ్యక్తంచేశారు. ప్రజల ప్రోత్సాహం, ఆదరణ ఇలాగే ఉంటే భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడుతామని చెప్పారు. దేశం లో పెద్ద నగరాల్లో ఒకటైన చెన్నైకి వందల కిలోమీటర్ల దూరం నుంచి రైళ్లద్వారా ట్యాంకర్లతో నీటిని తరలిస్తున్నారని.. కానీ, హైదరాబాద్‌కు 240 కిలోమీటర్ల దూ రంలోని గోదావరి, 170 కిలోమీటర్ల దూరంలోని కృష్ణా నదుల నుంచి పైప్‌లైన్లతో నిత్యం నీటి సరఫరా జరుగుతున్నదన్నారు. 2048 దాకా రాజధాని ప్రజల కు తాగునీటి గోస లేకుండా చేస్తున్న ముందుచూపు, దార్శనికత ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్‌ అని చెప్పారు. 

త్వరలోనే డబుల్‌ ఇండ్ల పంపిణీ

హైదరాబాద్‌లో రూ.9,714 కోట్లతో దాదాపు లక్ష డబుల్‌బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయిందని, ఒక్కపైసా ఖర్చు లేకుండా వాటిని త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పేదలకు మేలుచేసే విషయంలో ఎక్కడా తగ్గకుండా రూ. 400-500 కోట్ల భారం ప్రభుత్వమే భరిస్తున్నదని చెప్పారు. కేసీఆర్‌ కిట్లు, కల్యాణలక్ష్మీ , షాదీముబారక్‌, రైతు బంధు, రైతుబీమా తదితర అనేక పథకాలను విజయవంతంగా అమలుచేస్తున్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ అభ్యర్థన మేరకు బోరబండలో మరో 4 ఎంఎల్‌డీ రిజర్వాయర్‌ కోసం రూ.8 కోట్లు వెంటనే మంజూరు చేసి త్వరలో శంకుస్థాపన చేసేలా చర్యలు తీసుకుంటామని కేటీఆర్‌ హామీఇచ్చారు. నాయీబ్రాహ్మణ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మల్లారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, ఎమ్మెల్యేలు వివేక్‌, ముఠాగోపాల్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌, జలమండలి ఎండీ దానకిశోర్‌, ఈడీ డాక్టర్‌ ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


logo