గురువారం 21 జనవరి 2021
Telangana - Dec 26, 2020 , 03:19:39

ఆత్మీయత కరువై బతుకు బరువై

ఆత్మీయత కరువై బతుకు బరువై

 • ఆత్మహత్యలకు అనేక కారణాలు
 • కుటుంబకలహాలు, క్షణికావేశంతోనే అధికం
 • ప్రాణాలు తీసుకొనే ముందు ప్రవర్తనలో మార్పు  
 • సకాలంలో గుర్తిస్తే ప్రాణాలు కాపాడొచ్చు

డిసెంబర్‌ 11.. హైదరాబాద్‌కు చెందిన ఓంకార్‌(15) పబ్‌జీ గేమ్‌కు బానిసయ్యాడు. గేమ్‌ ఆడేందుకు స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వాలని తండ్రితో మారాం చేశాడు. ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ తండ్రి అంగీకరించలేదు. వ్యాపార పనుల్లో తనకు సాయం చేయాలన్నాడు. కలత చెందిన ఓంకార్‌ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని ప్రాణాలు వదిలాడు.

హైదరాబాద్‌కు చెందిన ప్రణీతకు రెండేండ్ల క్రితం పైండ్లెంది. మలక్‌పేటలో నివాసం ఉంటున్నారు. చిన్న పాటి కారణాలతో దంపతులు గొడవపడేవారు. వీరి గొడవలు నెలకు రెండు సార్లైనా పోలీస్‌స్టేషన్‌ చేరేవి. ఓ బలహీన క్షణంలో ఇటీవలే ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది.   

గచ్చిబౌలికి చెందిన వెంకటరావు(27)కు మంచి ఉద్యోగం.. సరిపడా జీతం జీవితం సాఫీగా సాగిపోతున్నది. ఓ రాత్రి ‘నా జీవితంలో కఠిన నిర్ణయం తీసుకుంటున్నా’ అని వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టాడు. తాను ఉంటున్న హాస్టల్‌ రూంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

హైదరాబాద్‌ సిటీ బ్యూరో/నమస్తే తెలంగాణ, బొల్లారం: క్షణికావేశం.. ఒంటరితనం.. భరోసా ఇవ్వలేని బంధుత్వాలు కారణాలేవైతేనేం.. బలవన్మరణాలు ఆగడం లేదు. ఆత్మీయతను పంచే వారు కరువవటం, భరోసా ఇవ్వాల్సిన వారు దూరమవటమే ఆత్మహత్యలకు బీజం వేస్తున్నది.  హైదరాబాద్‌లోని ఓ పత్రికలో ఫొటోజర్నలిస్టుగా పనిచేస్తున్న రాజేశ్‌ది కలుపుగోలుగా ఉండే మనస్తత్వం. సెలవుపై సొంతూరు వెళ్లాడు. ఇంట్లో జరిగిన చిన్నపాటి గొడవతో క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు. పబ్జీ గేమ్‌కు బానిసైన ఓంకార్‌ సెల్‌ఫోన్‌ కోసం ఏకంగా ప్రాణమే తీసుకున్నాడు.

స్నేహితులు లేరు.. ఆనాటి ఆటల్లేవ్‌.. తెలిసిందల్లా ఒక్కటే! సెల్‌ఫోన్‌, ఆన్‌లైన్‌ గేమ్స్‌ సరదాగా మొదలైన పబ్జీ ప్రాణాలమీదకు తెచ్చింది. పరిపక్వత చెందని వయస్సులో ఉన్న ఆ పిల్లాడు తండ్రితో మారాం చేసి ఏకంగా ప్రాణమే తీసుకున్నాడు. మంచి స్నేహితులున్నా.. ఉమ్మడి కుటుంబంలో ఉన్నా ఈ పరిస్థితి వచ్చేది కాదేమో..! ఉరుకులు పరుగుల జీవితం.. రాజధానిలో కాపురం ప్రారంభించిన ప్రణీతదీ అదే పరిస్థితి. పంతాలు.. పట్టింపులకు పోయి.. చిన్నపాటి గొడవలతో విసిగి వేసారి ప్రాణాలు తీసుకున్నది. ఒంటరి తనం వెంకటరావును బలితీసుకున్నది. ఇంజినీరుగా పనిచేస్తూ మంచి జీతాన్ని పొందుతూ ఉన్న అమ్మ, నాన్నలను కోల్పోవటం.. కష్టమొస్తే ఓదార్చటం, సంతోషమైనా శభాష్‌ అనే వాళ్లు లేకపోవడమే ఆయనను కుంగదీసింది.

సాంత్వన లభించి ఉంటే..

చిన్న కుటుంబాలు వృద్ధి చెందుతున్న క్రమంలో కాపురాలన్నీ కలహాలమయమవుతున్నాయి. ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ ఉంటే నాన్న మందలిస్తే.. నానమ్మ ఊరడించేది.. తాతయ్య అక్కున చేర్చుకునేవాడు. పెద్దమ్మ ధైర్యం చెప్పేది.. చిన్నపాటి కోరికైతే పెద్దనాన్న తీర్చేవాడు. ఆర్థిక సమస్య అయినా.. ఆపద వచ్చిన ఉమ్మడిగా చర్చించి నిర్ణయం తీసుకునేవారు. దాంతో సులభంగా పరిష్కారమయ్యేది. 

ఇవి గమనించండి 

 • సాధారణంగా ఆత్మహత్యలు చేసుకునేవారు ఈ లక్షణాలను కలిగి ఉంటారు.
 • తమలో తామే ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు.. ఎవరైనా మాట్లాడాలని చూస్తే మాట కలపరు 
 • తమ ఆస్తులను, ఇష్టమైన వస్తువులను ఇతరులకు అందిస్తారు. 
 • ఒంటరిగా గడపటం, ఆకాశం వంక చూస్తూ  పిచ్చివాళ్లలా ప్రవర్తిస్తారు. 
 • చీకటిని ఎక్కువగా ఇష్టపడుతారు.. ఆత్మహత్యల వీడియోలు ఎక్కువగా చూస్తారు.
 • అతిగా అవేశ పడటం.. ఏడ్వటం వంటి ధోరణులుంటాయి. 
 • దైనందిన వ్యవహారాల్లో నిర్లక్ష్యం 
 • భావ సంబంధ సూచనలు చేయడం (ఉదా: ‘రేపు నేను ఉండను, నేను ఇక మీకు భారం కాను’ అంటుండటం)

మహారాష్ట్రలో ఎక్కువ బలవన్మరణాలు

మహారాష్ట్ర, తమిళనాడు, వెస్ట్‌బెంగాల్‌ తదితర రాష్ర్టాలు ఆత్మహత్యల్లో ముందుండటం గమనార్హం. నేషనల్‌ క్రైం రికార్డు బ్యూరో లెక్కల ప్రకారం 2018తో పోల్చితే 2019లో 3.9శాతం ఆత్మహత్యలు పెరిగాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచంలో ఏటా 8 లక్షల మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రాణాలు తీసుకుంటున్న వాళ్లలో ఎక్కువగా 15 నుంచి 29 ఏండ్ల మధ్య వయస్సు వారే ఉంటుండటం గమనార్హం. ఆత్మహత్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో), ఎన్‌సీఆర్‌బీ(నేషనల్‌ క్రైం రికార్డు బ్యూరో) లెక్కలు విస్మయం కలిగిస్తున్నాయి. ప్రపంచంలో ప్రతి 40 సెకన్లకు ఒక వ్యక్తి ప్రాణాలు తీసుకుంటుంటే, దేశంలో ప్రతి గంటకూ ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  

ఒత్తిడే ప్రధాన శత్రువు

డిప్రెషన్‌తోనే చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. మీ చుట్టూ ఉండే వారిని గమనిస్తూ ఉండాలి. తెలిసినవాళ్లు వారి సమస్యలను చెబుతున్నప్పుడూ శ్రద్ధగా వినాలి. వారి కష్టాలు చాలా చిన్నవి లాగా వారిని మోటివేట్‌ చేయాలి. ఎలా బయటకి రావాలో వారికి చెప్పాలి. ఆ సమయంలో మనం అశ్రద్ధ చేస్తే వాళ్లు భయానక నిర్ణయాల వైపునకు వెళ్లే అవకాశం ఉంటుంది.

- డాక్టర్‌ జీసీ కవిత, 

ఇంటర్నేషనల్‌ మోటివేషనల్‌ స్పీకర్‌, సైకాలజిస్టు

గుర్తిద్దాం.. ప్రాణాలు నిలబెడుదాం

ఒత్తిడి, అశాంతి, భయం, అభద్రత, నిరాశ, తదితర మానసిక కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఆత్మహత్య చేసుకునే సమయానికి వ్యక్తి పరిస్థితిని పరిశీలిస్తే మెదడులో సెరాటోనిన్‌ అనే రసాయనిక ద్రవం పూర్తిగా తగ్గిపోతుంది. ఐకోటిక్స్‌ లక్షణాలతో ఆత్మహత్య చేసుకోవాలనే స్థితిలోకి వెళ్లిపోతారు. చిన్న కారణమే పెద్ద సమస్యగా కనిపిస్తుంది. 

- మోతుకూరి రామచంద్ర, సైకాలజిస్టు 

దయ చేసి ఆత్మహత్య చేసుకోవద్దు 

చావు అనేది ఏ కుటుంబానికైనా తీరని వ్యధను మిగులుస్తుంది. నా కజిన్‌ వెంకట్‌రావు ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్నేండ్ల క్రితం అతడి తల్లిదండ్రులు చనిపోయారు. ఆ బాధ అతడిని వెంటాడేది. ఎవ్వరితోనూ పెద్దగా తన సమస్యలను చెప్పుకునేవాడు కాదు. అతడు ఆత్మహత్య చేసుకోవడం మమ్మల్ని బాధకు గురిచేసింది. దయచేసి ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోవద్దు. చావు అనే ఆలోచనే చేయొద్దు.

- దీపక్‌, ఉద్యోగి  logo