బుధవారం 20 జనవరి 2021
Telangana - Nov 27, 2020 , 16:53:34

యాదాద్రిలో అమ్మవారికి ఊంజల్‌ సేవ

యాదాద్రిలో అమ్మవారికి ఊంజల్‌ సేవ

యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్‌ సేవను కోలహలంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా మహిళా భక్తులు పాల్గొనే సేవలో భక్తులు పాల్గొని తరించారు. సకల సంపదల సృష్టికర్త.. తనను కొలిచిన వారికి నేనున్నానంటూ అభయ హస్తమిచ్చి కపాడేలక్ష్మీ అమ్మవారికి విశేష పుష్పాలతో ఆలంకారం జరిపారు. బాలాలయం ముఖమండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు విడుతలుగా 516 రూపాయల టికెట్‌ తీసుకున్న భక్తులకు సువర్ణపుష్పార్చన జరిపించారు.

బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. దీన్నే సువర్ణపుష్పార్చనగా భక్తులు అత్యంత ప్రీతికరంగా నిర్వహిస్తారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణ జరిపారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన జరిపారు. ఉప ప్రధానార్చకులు ఆధ్వర్యంలోని అర్చక బృందం వైభవంగా ఈ పూజలు నిర్వహించారు. మంగళహారతులతో అమ్మవారిని స్తుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాలయం ముఖ మంటపంలోని ఊయలతో శయనింపు చేయించారు. గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటలు కోలాహలంగా కొనసాగాయి.


logo