బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 21, 2020 , 18:58:25

ఇల్లెందు ఏజెన్సీలో పెద్దపులి సంచారం

ఇల్లెందు ఏజెన్సీలో పెద్దపులి సంచారం

భద్రాద్రి కొత్తగూడెం : సుమారు రెండు దశాబ్ధాల తరువాత జిల్లాలోని ఇల్లెందు ఏజెన్సీలో పులి గాండ్రింపులు వినిపిస్తున్నాయి. పక్షం రోజుల క్రితం మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలంలో పెద్దపులి ఆవును సంహరించిన ఘటన వెలుగుచూసింది. వారం రోజుల క్రితం బయ్యారం, గార్ల మండలాల్లో పులి సంచరించినట్లుగా అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. తాజాగా జిల్లాలో పాండవులగుట్ట, గుండాల మండలం బాటన్న నగర్‌ మీదుగా ఆళ్లపల్లి మండలంలోకి ప్రవేశించినట్లుగా అధికారులు పులి పాదముద్రల ద్వారా నిర్ధారించారు. 

శనివారం ఆళ్లపల్లి మండలం మర్కోడు గ్రామపంచాయతీ పెద్దూరు గ్రామ సమీపంలో కొమరం సత్యనారాయణ అనే రైతుకు చెందిన ఎద్దును పెద్దపులి వేటాడి చంపింది. ఈ ఘటనతో అటవీశాఖ అధికారులు శాఖాపరంగా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు ప్రజలు పులిబారిన పడకుండా అప్రమత్తం చేస్తున్నారు. 

మణుగూరు ఏఫ్‌డీవో వేణుబాబు, ఏడూళ్లబయ్యారం రేంజ్‌ అధికారి ఎఫ్‌ఆర్‌వో వెంకటేశ్వర్లు సిబ్బందితో పాటు, ములుగు జిల్లా తాడ్వాయి మండలం అటవీ అధికారులు, గుండాల మండలం అటవీ అధికారులు సంయుక్తంగా ఆయా సరిహద్దు అడవుల్లో పులి ఆనవాలు కోసం అడవులను జల్లెడపడుతున్నారు. ఇప్పటికే నీటి తోగులు, కుంటలు దట్టమైన అటవీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిశీలిస్తున్నారు.