బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 20, 2020 , 01:54:59

హైకోర్టులో ఉద్యోగాలంటూ 3 కోట్లు ముంచిన కేటుగాళ్లు

హైకోర్టులో ఉద్యోగాలంటూ 3 కోట్లు ముంచిన కేటుగాళ్లు

  • 160 మందిని మోసగించిన నలుగురి అరెస్టు 
  • నిందితుల్లో ఒకరు ప్రభుత్వ టీచర్‌

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నకిలీ నోటిఫికేషన్‌ను రూపొందించి రూ.3 కోట్లకుపైగా వసూలుచేసిన ఇద్దరు నిందితులను సీసీఎస్‌ పోలీసులు అరెస్టుచేశారు. గురువారం సీసీఎస్‌ జాయింట్‌ సీపీ అవినాశ్‌ మహంతి మీడియాకు వివరాలు వెల్లడించారు. సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జనగామ జిల్లా తమ్మడపల్లికి చెందిన తిరునగరి విష్ణుమూర్తి, ప్రైమ రీ హెల్త్‌ సెంటర్‌ (యూపీహెచ్‌సీ) వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న హైదరాబాద్‌ డబీర్‌పురాకు చెందిన కొట్‌మీర్‌కర్‌ మహావీర్‌ అర్బర్‌, వరంగల్‌ జిల్లా హన్మకొండలో దూర విద్యకేంద్రం నిర్వహించే వ్యాపారి తాళ్లపల్లి సంజయ్‌కుమార్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన వీవ 1ప్లస్‌ ఫ్రూట్‌ జ్యూస్‌ డిస్ట్రిబ్యూటర్‌ చిన్నగాల దశరథ్‌ ముఠాగా ఏర్పడ్డారు. హైకోర్టులో జూనియర్‌ అసిస్టెంట్‌, అటెండర్స్‌, డ్రైవర్‌, మినిస్టీరియల్‌ స్టాఫ్‌ నియామకాలకు నోటిఫికేషన్‌ వచ్చిందంటూ నకిలీ నోటిఫికేషన్‌ను తయారుచేశారు. ఇం దులో హైకోర్టు రిజిస్టార్‌ జనరల్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఆ నోటిఫికేషన్‌ కోర్టు నుంచి వచ్చినట్టు అమాయకులను నమ్మించారు. వీరి మాటలు నమ్మిన సు మారు 160 మంది ఉద్యోగాల కోసం లక్షల్లో డబ్బు లు ముట్టజెప్పారు. డబ్బులు చెల్లించినవారికి గాం ధీ దవాఖానలో వైద్య పరీక్షలు చేసుకోవాలని సూ చించారు. నకిలీలేఖలను తయారు ఉద్యోగాలకు ఎంపికయ్యారంటూ బాధితులకు అందజేశారు. తీరా అక్కడికి వెళ్లగా అదంతా మోసమని తేలడంతో బాధితులు సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారం క్రితం సంజయ్‌కుమార్‌, దశరథ్‌ను అరెస్ట్‌చేశారు. వీరు ఇచ్చిన సమాచారంతో ప్రధాన సూత్రధారులైన ప్రభుత్వ టీచర్‌ విష్ణుమూర్తి, మహావీర్‌ను కూడా గురువారం అరెస్ట్‌చేసి కోర్టులో హాజరుపరిచారు.