మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 03:13:06

డిపాజిటర్లకు 20 వేలలోపు చెల్లించండి

డిపాజిటర్లకు 20 వేలలోపు చెల్లించండి

  • అగ్రిగోల్డ్‌ కేసులో ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తికి తెలంగాణ హైకోర్టు అనుమతి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అగ్రిగోల్డ్‌ బాధిత డిపాజిట్‌దారులకు రూ.20 వేలలోపు చెల్లింపులు చేసుకోవచ్చని తెలంగాణ హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. రూ.20 వేలలోపు బాధిత డిపాజిట్‌దారులకు చెల్లింపులు చేసేందుకు బడ్జెట్‌ కేటాయించామని, ఈ మేరకు అనుమతి ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. అగ్రిగోల్డ్‌ బాధిత డిపాజిట్‌దారులకు చెల్లింపులు చేయాలని, ఆత్మహత్యలు చేసుకున్న ఏజెంట్ల కుటుంబాలకు పరిహారం ఇ వ్వాలని కోరుతూ అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ 2015లో దాఖలు చేసిన పిటిషన్‌, ఇతర అనుబంధ పిటిషన్లపై జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావు, జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కలెక్టర్‌, ఎస్పీ నేతృత్వంలో స్థానిక ఇన్‌స్పెక్టర్‌, గ్రామ వలంటీర్‌ ద్వారా బాధితులను గుర్తించాలని ధర్మాసనం ఏపీ ప్రభుత్వానికి స్పష్టంచేసింది. మొత్తం ప్రక్రియను డిసెంబర్‌నాటికి, గరిష్ఠంగా మార్చి 31 వరకు చెల్లింపులు పూర్తిచేయాలని ఆదేశాలిచ్చింది. బ్యాంకర్లు వేలం వేసిన ఆస్తులను బిడ్డర్లకు అప్పగించాలని బ్యాంకుల తరఫు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. తమ అప్పుల రికవరీ కి అగ్రిగోల్డ్‌ ఆస్తులను బ్యాంకులు తక్కువ ధరకు వేలం వేశాయని, ఆస్తులను అప్పగించరాదని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. బ్యాంకుల్లోని సొమ్ము కూడా ప్రజల సొమ్మేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేసులను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని ఏపీ తరఫు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తిచేశారు. కేసులో తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటక రాష్ర్టాలకు చెందిన బాధితులు ఉన్నందున ఇక్కడే విచారణ జరుపాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కో రారు. కేసులు బదిలీ చేసే అధికారం హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు ఉంటుందని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ కేసుల్లో అన్ని మధ్యంతర దరఖాస్తులపై ప్రాధాన్యతా క్రమంలో విచారణ చేపడుతామని తెలిపింది. విచారణను రెండువారాలపాటు వాయిదా వేసింది.