శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 08, 2020 , 01:58:41

ఆపన్నులకు అమ్మలా..

ఆపన్నులకు అమ్మలా..

  •  పేదల ఆకలి తీరుస్తున్న కల్వకుంట్ల కవిత 
  •  నిజామాబాద్‌ దవాఖానలో మూడేండ్లు పూర్తిచేసుకున్న భోజన కేంద్రం

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పేద, మధ్యతరగతి ప్రజల ఆకలి తీర్చేందుకు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌ జిల్లా దవాఖానలో ప్రారంభించిన ఉచిత అన్నదాన కేంద్రం నేటితో నాలుగో వసంతంలోకి అడుగుపెడుతున్నది. 2017లో నిజామాబాద్‌ ఎంపీగా కవిత జిల్లా దవాఖానను సందర్శించారు. ఆ సమయంలో రోగులు, వారి సహాయకులు అన్నం కోసం పడుతున్న బాధలు చూసిన కవిత 2017 నవంబర్‌ 8న దవాఖాన ఆవరణలో  ఉచిత అన్నదాన కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. దీంతోపాటు 2018 ఏప్రిల్‌ 26న బోధన్‌, 2018 జూలై 5న ఆర్మూర్‌ ప్రభుత్వ దవాఖానల్లోనూ ఉచిత అన్నదాన కేంద్రాలను ప్రారంభించారు. ఆయా కేంద్రాల్లో ఉండే వలంటీర్లు స్వయంగా గర్భిణులు, నడవలేని స్థితిలో ఉన్న రోగుల వద్దకెళ్లి వడ్డిస్తుండటం విశేషం. దీంతోపాటు పేద విద్యార్థుల ఆకలి తీర్చేందుకు జిల్లా గ్రంథాలయంలోనూ 2018 జూలై 15న మరో కేంద్రాన్ని ఏర్పా టు చేశారు. ఇలా అన్ని కేంద్రాల్లో కలిపి నిత్యం 1,500 మందికి ఉచిత భోజనం అందిస్తున్నారు. ఇప్పటివరకు ఆయా కేంద్రాల్లో ఏడు లక్షల మందికి ఆకలి తీర్చారు. లాక్‌డౌన్‌ సమయంలోనూ నిజామాబాద్‌, జగిత్యాల, మెట్‌పల్లిలో మరో మూడు  కేంద్రాలను ఏర్పాటు చేసి వలస కూలీలకు అమ్మలా మారి ఆకలి తీర్చారు.