శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 01, 2020 , 17:13:13

రఘునందన్‌జీ మీ నాన్నకు పింఛన్ కేంద్రం ఇస్తుందా? : మంత్రి హరీశ్ రావు

రఘునందన్‌జీ మీ నాన్నకు పింఛన్ కేంద్రం ఇస్తుందా? : మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ దూసుకెళ్తున్నది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతతో కలిసి మంత్రి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రతిపక్షాల బూటక ప్రచారాన్ని తిప్పి కొడుతూ ప్రచారంలో ముందుకెళ్తున్నారు. ఈ మేరకు మిరుదొడ్డి మండల కేంద్రంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు మంత్రి హరీష్ రావు హాజరై మాట్లాడారు. దుబ్బాక బీజేపీ అభ్యర్థి తండ్రి మాదవనేని భగవంతరావుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పింఛన్ రూ. 2,016 ప్రతి నెల వస్తుందని తెలిపారు.

రఘునందన్ రావు తల్లిదండ్రులకు నెల నెలా రేషన్ ద్వారా చెరి ఆరు కిలోల బియ్యం మొత్తంగా 12 కిలోల బియ్యం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుకు ఇచ్చే  రైతుబంధు పెట్టు బడి సహాయం కింద  తన తండ్రికి రెండు ఎకరాల పదిహేను గుంటలకు గాను ఇప్పటి వరకు  54 వేల రూపాయలు అందుకున్నారని వివరాలను వెల్లడించారు. అలాగే తన తల్లి భారతమ్మకు మూడు ఎకరాల ముప్పై గుంటలకు గాను 86 వేల 250 రూపాయలు రైతుబంధు సహాయం అందుటుకున్నారని వివరించారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు నాలుగు ఎకరాల ముప్పై గుంటలకు గాను లక్షా 11 వేల 550 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందన్నారు.


తన తల్లి తండ్రులకు ఆసరాగా లేని రఘునందన్ రావు దుబ్బాక ప్రజలకు ఏం చేస్తాడు అని ప్రజలు అడుగుతున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, రైతుబంధు, ఆసరా పింఛన్, రేషన్ బియ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఎలా రైతుబంధు తీసుకుంటున్నాడు? ఎలా ఆసరా పింఛన్  తీసుకుంటున్నాడు? ఎలా రేషన్ బియ్యం తీసుకుంటున్నాడో సమాధానం చెప్పాలని సూటిగా ప్రశ్నించారు.  రఘునందన్ జీ మీ నాయినకు రైతుబంధు డబ్బులు కేంద్రం ఇస్తుందా? కేసీఆర్ ఇస్తుండా అని ప్రశ్నించారు. మొత్తం బీజేపీ ఇస్తుందని డబ్బా కొట్టుకుంటున్న రఘునందన్ రావు నీ తండ్రి తీసుకునే 2,016 రూపాయల పెన్షన్‌లో కేంద్రం వాటా ఎంతనో చెప్పు అని నిలదీశారు.

మీ పొలంలో పెట్టుబడి కోసం ఇస్తున్న రైతుబంధు డబ్బుల్లో బీజేపీ పాలు ఏమన్నా ఉన్నదా? నెల నెలా నీ ఇంటికి చేరుతున్న రూపాయికి కిలో రేషన్ బియ్యం ఢిల్లీ నుంచి వస్తున్నాయా? మిషన్ భగీరథ నీళ్లు తాగుకుంట, 24 గంటల కరెంటును సూసుకుంట ఝటా మాటలు ఎందుకని నిలదీశారు. అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్న బీజేపీకి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు.