శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Oct 21, 2020 , 18:51:12

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు తథ్యం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు తథ్యం
హైదరాబాద్‌ : త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు తథ్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. భరత్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం నల్లగొండ, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల న్యాయవాదులతో వారు జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని, టీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని వారు అన్నారు.

టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచేందుకు న్యాయవాదులను పెద్ద ఎత్తున ఓటర్లుగా పేరు నమోదు చేయించాలని వారు బార్ అసోసియేషన్ బాధ్యులను కోరారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల పేర్లను ఓటర్ల జాబితాలోకి సామూహికంగా చేర్పించాలని వారు సూచించారు. కొవిడ్ నేపథ్యంలో సీఎం కేసీఆర్ న్యాయవాదులకు ఆర్థిక పరంగా అండగా నిలిచారని గుర్తు చేశారు. జూమ్ కాన్ఫరెన్స్ లో బార్ కౌన్సిల్ సభ్యులు గండ్ర మోహన్ రావు, వెంకట్ యాదవ్, జయకుమార్, ముఖీద్,రజిత, లలిత, కళ్యాణ్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల న్యాయవాదులు పాల్గొన్నారు.