బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 18, 2020 , 00:22:48

కేసీఆర్‌కు తిరుగులేదు

కేసీఆర్‌కు తిరుగులేదు

  • దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌దే విజయం
  • ప్రవాస భారతీయురాలు హీబా జైనా జోస్యం

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు తిరుగులేదని ప్రవాస భారతీయురాలు చిన్నారి హీబా జైనా తెలిపింది. దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ విజయదుందుభి మోగించడం ఖాయమని జోస్యం చెప్పింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ విజయం సాధిస్తారని పేర్కొన్నది. కొవిడ్‌ విజృంభణ సమయంలో ట్రంప్‌ విశేష సేవలందించి అమెరికాను కాపాడారని, విజయవంతంగా స్కూళ్లను నడిపించడం ఆయనకే సాధ్యమైందని హీబా వివరించింది. 

ఈ మేరకు ఆమె వీడియోలు విడుదలచేసింది. గతంలో  ట్రంప్‌ గెలుస్తారని, తెలంగాణలో కేసీఆర్‌ విజయం తథ్యమని జోస్యంచెప్తూ ఆ చిన్నారి ముందే విడుదలచేసిన వీడియోలు అప్పట్లో వైరల్‌ అయ్యాయి. ప్రస్తుతం హీబా జైనా జోస్యంపై ప్రవాస తెలుగు ప్రముఖులు మరోసారి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. హీబా జైనా తల్లి జహారాబేగం ఆంధ్రప్రదేశ్‌  గుంటూరుకు చెందినవారు. అమెరికా మిచిగాన్‌లో స్థిరపడ్డారు. జహారా బేగం స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తూ మహిళా, రైతు సంక్షేమం, దివ్యాంగుల వికాసం కోసం కృషిచేస్తున్నారు. 

హైదరాబాద్‌లో తన కార్యక్రమాలు విస్తరించి ఏటా అంధుల టీ20 మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. ఐదో తరగతి చదువుతున్న హీబా జైనా న్యూస్‌ చానెళ్లు చూస్తూ రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నది.  టీవీలో వచ్చే వార్తల ద్వారా తనకు ట్రంప్‌, కేసీఆర్‌ అంటే ఇష్టం ఏర్పడిందని హీబా చెప్తున్నది. జోస్యం మాత్రం తన ఇష్టాలతో సంబంధం లేకుండా చెప్తానని చిన్నారి స్పష్టంచేసింది. చిరుప్రాయంలోనే ఖురాన్‌, భగవద్గీతలను ఆసక్తిగా చదివే హీబాకు ఆధ్యాత్మికభావం కూడా ఎక్కువే. హీబా చెప్పింది తప్పకుండా జరుగుతుండటం తమకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని తల్లి జహారా బేగం అంటున్నారు.


logo