శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 17, 2020 , 01:31:36

ఆయుష్షు పెరిగింది!

ఆయుష్షు పెరిగింది!

  • దేశంలో 11.2 ఏండ్లు పెరిగిన సగటు ఆయుర్దాయం
  • 1990లో 59.6 ఏండ్లు, 2019లో 70.8 ఏండ్లు
  • ఆయుర్దాయం పెరిగినా.. ఆరోగ్యంగా ఉంటలేరు
  • అసాంక్రామిక వ్యాధుల వల్ల మరణాలు రెట్టింపు
  • లాన్సెట్‌ అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ: భారతీయులకు శుభవార్త. దేశంలో సగటు ఆయుర్దా యం 11.2 ఏండ్లు పెరిగింది. 1990లో 59.6 ఏండ్లుగా ఉన్న జీవితకాలం.. 2019 నాటికి 70.8 ఏండ్లకు పెరిగినట్లు ఒక అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. ఈ వివరాలు ప్రఖ్యాత మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌లో ప్రచురితమయ్యాయి. అయితే ఆయుర్దాయం పెరిగినప్పటికీ ‘ఆరోగ్యకర జీవితకాలం’ మాత్రం ఆశాజనకంగా లేదని అధ్యయనం పేర్కొన్నది. ప్రజలు ఎక్కువ కాలం అనారోగ్యంతో జీవిస్తున్నారని వివరించింది. ఆయుర్దాయంలోనూ రాష్ర్టాల మధ్య అసమానతలు ఉన్నట్లు  వెల్లడించింది. కేరళలో 77.3 ఏండ్లుగా ఉన్న జీవితకాలం.. యూపీలో 66.9 ఏండ్లుగా మాత్రమే ఉన్నదని తెలిపింది. రక్తపోటు, పొగాకు వినియోగం, కాలుష్యం వంటి నివారించదగ్గ ముప్పులను అరికట్టడంలో వైఫల్యం కారణంగా కరోనా వంటి మహమ్మారుల ముప్పు అధికమవుతున్నదని వివరించింది.  

అధ్యయనంలోని ముఖ్యాంశాలు

n వ్యాక్సినేషన్‌, మెరుగైన వైద్య సదుపాయాల కారణంగా భారత్‌తోసహా దాదాపు అన్ని దేశాల్లోనూ సాంక్రామిక వ్యాధులు తగ్గుముఖం పట్టాయి. అయితే దీర్ఘకాలిక వ్యాధులు పెరిగాయి. 

n భారత్‌లో మాతాశిశుమరణాలు గతంలో అధికంగా ఉండేవి. ఇప్పుడు పరిస్థితి మెరుగుపడింది. ప్రాణాంతక వ్యాధులలో గతంలో ఐదో స్థానంలో ఉన్న గుండె సంబంధిత వ్యాధులు ఇప్పుడు మొదటి స్థానానికి చేరాయి. మరోవైపు, క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయి. 

n దేశంలో 1990లో 29 శాతంగా ఉన్న అసాంక్రామిక వ్యాధులు (నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌- డయాబెటిస్‌, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్లు, అల్జీమర్స్‌ వంటివి) ప్రస్తుతం 58 శాతానికి పెరిగాయి. వీటి వల్ల సంభవిస్తున్న ముందస్తు మరణాలు దాదాపు రెట్టింపయ్యాయి. 

n దక్షిణాదిలో దాదాపు 10-20 శాతం మరణాలకు హైబీపీనే కారణం. 

n స్థూలకాయం, డయాబెటిస్‌ వంటి ఆరోగ్య సమస్యల వల్ల కొవిడ్‌ తీవ్రత, మరణాల శాతం పెరుగుతున్నదని ఈ అధ్యయనంలో వెల్లడయ్యింది.

n అనారోగ్య సమస్యలు, మరణాలకు 30 ఏండ్ల కిందట అంటువ్యాధులు, మాతాశిశు మరణాలు, పోషకాహార లోపంతో కూడిన వ్యాధులు కారణమైతే.. ప్రస్తు తం అసాంక్రామిక వ్యాధులు అధికంగా కారణమవుతున్నాయి. 

n ఈ ముప్పుల్లో చాలావరకు నివారించదగినవేనని పరిశోధకులు తెలిపారు. అనారోగ్యకర జీవనశైలి.. ముఖ్యంగా ఆహార నాణ్యత, తీసుకునే క్యాలరీలు, శారీరక శ్రమ వంటి విషయాల్లో ప్రజల్లో మార్పు తేవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నట్లు పేర్కొన్నారు. 

n 200కుపైగా దేశాల్లో విస్తృత స్థాయిలో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. మరణాలకు గల 286 కారణాలను, 369 రకాల వ్యాధుల సమాచారాన్ని విశ్లేషించారు. 

అధ్యయనం ప్రకారం 2019లో భారత్‌లో అత్యధిక మరణాలకు కారణాలు..

కారణం మరణాల సంఖ్య

వాయుకాలుష్యం 16.7 లక్షలు

అధిక రక్తపోటు 14.7 లక్షలు

పొగాకు వినియోగం 12.3 లక్షలు

ఆహార లేమి 11.8 లక్షలు

హై బ్లడ్‌ షుగర్‌ 11.2 లక్షలు