మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Oct 14, 2020 , 16:15:40

మూసీకి ఢోకా లేదు : మంత్రి జగదీష్ రెడ్డి

మూసీకి ఢోకా లేదు : మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట : తెలంగాణలో ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు ఆయా ప్రాజెక్టులు నిండు కుండ‌లా మారాయి. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా మూసీ న‌దికి వ‌ర‌ద పోటెత్తింది. హిమాయ‌త్‌సాగ‌ర్ గేట్లు ఎత్తివేయ‌డంతో.. బుధ‌వారం తెల్ల‌వారుజామున 4 గంట‌ల నుంచే మూసీ న‌ది ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. ఈ క్ర‌మంలో అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. ‌విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి కూడా అప్ర‌మ‌త్త‌మై మూసీకి పోటెత్తిన వ‌ర‌ద‌పై స‌మీక్షించారు. నీటిపారుద‌ల శాఖ ఉన్న‌తాధికారుల‌తో పాటు సూర్యాపేట‌, న‌ల్ల‌గొండ జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో మంత్రి ఫోన్లో స‌మీక్షించి ప‌లు సూచ‌న‌లు చేశారు. 

మూసీ న‌ది ఆయ‌క‌ట్టుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి చ‌ర్య‌లు తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా ర‌త్న‌పురం వ‌ద్ద గండి పెట్టి నీటిని కింద‌కు వ‌దిలాలి అని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు. అంతే కాకుండా మూసీ న‌ది వ‌ద్ద గేట్లు ఎత్తివేయించి 1.75 ల‌క్ష‌ల క్యూసెక్కుల నీటిని కింద‌కు వ‌దిలారు. దీంతో ఆయ‌క‌ట్టు రైతాంగం ఊపిరి పీల్చుకుంది. మూసీ న‌దికి ఒకేసారి 2 ల‌క్ష‌ల క్యూసెక్కుల‌కు పైగా వ‌ర‌ద పోటెత్త‌డంతో.. ఈ ప‌రిస్థితి త‌లెత్తింద‌ని మంత్రి జ‌గదీశ్ రెడ్డి తెలిపారు.    


 


logo