మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 02, 2020 , 15:47:31

సీఎం కేసీఆర్ వల్లే ఆరేండ్లలో నూరేండ్ల అభివృద్ధి

సీఎం కేసీఆర్ వల్లే ఆరేండ్లలో నూరేండ్ల అభివృద్ధి

సిద్దిపేట : ప్రజల సంక్షేమం కోసం బీజేపీ పార్టీ ఒక్క మంచి పనైనా చేసిందా? ఏనాడైనా ప్రజల కోసం ఆలోచించారా? రైతులు నష్టపోయేలా వ్యవహరిస్తున్నది మీరు కాదా? అని బీజేపీ నేతలపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. శుక్రవారం జిల్లాలోని మిరుదొడ్డి మండలంలోని అందె, చెప్యాల, మల్లుపల్లి తదితర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణకు మీ వల్ల ఒరిగిందేమిటి..మళ్లీ  ఏ ముఖాలు పెట్టుకొని ఓట్లడగడానికి వస్తున్నారని బీజేపీ పార్టీ నేతలను ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేయకపోగా వారి పొట్టకొట్టే నిర్ణయాలు తీసుకోవడం బీజేపీకే చెల్లుతుందన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టడం ఆ ప్రభుత్వంలోని మంత్రులకే న్యాయంగా అనిపించలేదని, అందుకే రాజీనామా చేశారని గుర్తు చేశారు. కార్పొరేట్ సంస్థల చేతికి రైతుల బతుకులను అప్పగించే ప్రమాదకరమైన ఆలోచనకు కేంద్రం తెరతీసిందని మండిపడ్డారు.


మన దేశంలోనే 280 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు ఉత్పత్తి అవుతాయని, ఇందులోనే పుష్కలంగా మక్కలను విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉందని వివరించారు. కానీ విదేశాల నుంచే మక్కలను దిగుమతి చేయడానికి కేంద్రం పెద్దలు సంతకాలు చేసి వచ్చారని హరీష్ రావు ఆరోపించారు. దేశంలో బీజేపీ ఎలాంటి సంక్షేమం చేయలేదని, అదే సంక్షేమంలో ముందుకెళ్తున్న తెలంగాణను అనగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలను మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని మంత్రి హరీశ్‌ రావు అన్నారు.


కేసీఆర్ ప్రతి అడుగు రైతుల కోసమేనని వివరించారు. అరేండ్లలోనే నూరేండ్ల అభివృద్ధిని చేసి చూపించిన ఘనత ఈ తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. మెడిగడ్డ నుంచి మిరుదొడ్డికి 15 తాటిచెట్ల ఎత్తుకు నీళ్లు తెచ్చామని హరీశ్‌ రావు చెప్పారు. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ కు చెందిన మాజీ మంత్రి జానారెడ్డిలు కూడా తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులేనని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధి ని చేపట్టిన ఘనత కేవలం కేసీఆర్ కే దక్కుతుందని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులకు డిపాజిట్ గల్లంతు అయితనే మన గెలుపునకు సార్థకత దక్కుతుందన్నారు. 


logo