మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Sep 23, 2020 , 16:22:55

దుబ్బాకలో క్రైస్తవ భవనం నిర్మిస్తాం : మంత్రి హరీశ్ రావు

దుబ్బాకలో క్రైస్తవ భవనం నిర్మిస్తాం : మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట : పని చేసే ప్రభుత్వానికి అండగా ఉండండి. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలను టీఆర్ఏస్ ప్రభుత్వం అందిస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ ఫాస్టర్స్, క్రైస్తవ మత పెద్దలతో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అన్ని గ్రామాల నుంచి ఫాస్టర్స్ వచ్చి దివంగత రామలింగారెడ్డి కుటుంబానికి, టీఆర్ఎస్ కు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలన్నారు. దేశంలోనే ఏ ప్రభుత్వం జరపని విధంగా అధికారికంగా క్రిస్మస్ పండుగను తెలంగాణ ప్రభుత్వమే జరుపుతున్నదని గుర్తు చేశారు.

ఇన్నేండ్ల పాలనలో కాంగ్రెస్, బీజీపీ పార్టీలు క్రైస్తవులకు చేసింది ఏమీ లేదన్నారు. క్రిస్మస్ పండుగను మంత్రులు, జిల్లా కలెక్టర్లతో అధికారికంగా జరిపించిన ఘనత కేవలం సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. రంజాన్, దసరా, క్రిస్మస్ పండుగలకు పేద క్రైస్తవులకు కొత్త బట్టలు పంపిణీ చేసి అన్ని వర్గాలను సమదృష్టితో చూసింది కేవలం సీఎం కేసీఆర్ ప్రభుత్వమే అన్నారు. రూ.5 కోట్లతో ఎకరం స్థలం ఇచ్చి మహీంద్రా హిల్స్ లో క్రైస్తవ భవనం నిర్మించింది సీఎం కేసీఆర్ అని తెలిపారు. రామలింగారెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నేను బాధ్యత తీసుకుని దుబ్బాకలో క్రైస్తవ భవనం నిర్మాణంతో పాటు పరలోక యాత్ర వాహనం అందిస్తానని హామీ ఇచ్చారు.


ఇంటింటికీ నల్లా నీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఈ పరిస్థితి ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. 18 రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఎక్కడైనా ఉచితంగా కరెంటు ఇచ్చారా? ఇంటింటికీ తాగునీరు అందించారా? అని సూటిగా ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వంలోని కేంద్ర మంత్రి రాజీనామా చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు.


logo