మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 06, 2020 , 16:00:31

కరోనా సోకిందని కన్నతల్లినే గెంటేశారు

కరోనా సోకిందని కన్నతల్లినే గెంటేశారు

వరంగల్ అర్బన్ : కనిపెంచిన కొడుకులే ఆ తల్లి పట్ల కాఠిన్యం చూపారు. పండుటాకుకు అండగా ఉండాల్సిన కొడుకులు కర్కశంగా దూరం పెట్టారు. ఎనభై ఏండ్ల వృద్ధురాలు అనే కనికరం లేకుండా నిర్దయగా బయటికి గెంటేశారు. ఈ అమానవీయ ఘటన జిల్లాలోని వేలేరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మారబోయే లచ్చమ్మ 85 ఏండ్ల వృద్ధురాలు. ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలింది. అయితే నలుగురు కొడుకులు ఉన్న లచ్చమ్మ ఒక్కో కొడుకు ఇంటి వద్ద 15 రోజులు ఉంటున్నది. 

రెండో కొడుకు ఇంటి వద్ద ఉండగానే ఆమెకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వంతులో భాగంగా మూడో కొడుకు అశోక్ ఇంటికి వెళ్లగా ఆమెను ఇంట్లోకి అనుమతించని అశోక్  ఊరి బయట ఉన్న వ్యవసాయ బావి వద్ద ఫ్లెక్సీలతో చిన్న గుడారం వేసి అందులో ఉంచాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కొడుకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినప్పటికి అశోక్ ససేమిరా అనడంతో మరో కుమారుడు సుధాకర్ కు అప్పగించి ఆమెను ఆరోగ్యంగా చూసుకోవాలని చెప్పారు.

లేకుంటే నలుగురు కొడుకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో ఆమెను ఇంట్లోకి అనుమతించారు. నలుగురు కుమారులున్నలచమ్మ కు పట్టిన దుర్గతికి గ్రామస్తులంతా విచారం వ్యక్తం చేశారు. కరోనా రక్కసితో మానవ సంబంధాలు ఎలా విచ్ఛిన్నం అవుతున్నాయో ఇలాంటి సంఘటనలు అద్దం పడుతున్నాయి. 


logo