శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 06, 2020 , 02:32:45

గోదారి తీరంలో పులి

గోదారి తీరంలో పులి

  • ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ సంచారం
  • పెద్దపల్లి వైపు వెళ్లినట్లు అంచనా
  • ఓరుగల్లుకు పూర్వవైభవం వచ్చిందంటున్న అటవీశాఖ

వరంగల్‌ ప్రతినిధి-నమస్తే తెలంగాణ: వరంగల్‌ అడవుల్లో ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ పెద్దపులి సంచారం మొదలైంది. భూపాలపల్లి-మహదేవపూర్‌, మహాముత్తారం అడవుల్లో వారం రోజులుగా అటవీ గ్రామాల్లో పెద్దపులి సంచరిస్తుందన్న సమాచారంతో అప్రమత్తమైన అటవీ అధికారులు పెద్దపులి జాడ తెలుసుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. జయశంకర్‌ భూపాపల్లి జిల్లా పెగడపల్లి, దూదేకులపల్లి, ఆజంనగర్‌, భూపాలపల్లి, చెల్పూర్‌ అటవీ రేంజ్‌ల పరిధిలో పెద్దపులి సంచరిస్తున్నదని ఆయా గ్రామాల ప్రజలిచ్చిన సమాచారంతో భూపాలపల్లి అటవీ అధికారులు ఆధారాలు సేకరించారు. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత వరంగల్‌ ఉమ్మడి జిల్లా అడవుల్లో పెద్దపులి సంచా రం పూర్వవైభవానికి సంకేతకమని పేర్కొంటున్నారు. ఒకప్పటి దట్టమైన అడవులు.. మైదానాలుగా మారడంతో ఇక్కడ తిరుగాడిన పెద్దపులులు వలసపోయి మళ్లీ ఇన్నేళ్లకు తిరిగి వచ్చాయి. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలుగా ఉన్న ఏటూరునాగారం, పాకాలలోనూ పెద్ద పులులు సంచరించేవి. పాకాల అడవుల్లో నిజాం రాజులు వేటాడిన చరిత్ర కూడా ఉన్నది. తెలంగాణ ఆవిర్భావం తర్వాతే అడవులు వృద్ధిచెందాయని, ఫలితంగా వలస వెళ్లిన పెద్దపులి తిరిగి రావడం శుభపరిణామంగా అధికారులు భావిస్తున్నారు. తాజాగా మహాముత్తారం మండలం ఓడేడుకు చెందిన ముగ్గురు రైతులకు శనివారం ఉదయం వారి పొలాలకు వెళ్తుండగా మానేరు తీరంలోని పూరేడుగుట్ట వద్ద పులి కనిపించింది. అయితే మహాముత్తారం, మహదేవపూర్‌ అడవుల్లో ఏర్పాటుచేసిన కెమెరాలకు మాత్రం పులి చిక్కలేదు. పాద ముద్రలను పరిశీలించిన ప్రత్యేక బృందం అవి పెద్దపులివేనని తేల్చారు. దీంతో భూపాలపల్లి అటవీ గ్రామా ల్లో అటవీ ప్రాంతాలకు వెళ్లొద్దని చాటింపు వేశారు. ఒకవేళ పులి కనిపిస్తే టోల్‌ ఫ్రీ నంబర్‌ 180042555364కు సమాచారమివ్వాలని కోరారు.

రంగంలోకి 15 బృందాలు

పులి జాడను కనుగొనేందుకు జిల్లా అటవీశాఖ 15 ప్రత్యేక బృందాలను రంగంలోకి దిం పింది. పులి గోదావరి అవతలి తీరం (మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌)లోని తడోబా, ఇంద్రావతి పులుల సంరక్షణ కేంద్రాల నుంచి వచ్చిందా? అనేది పరిశీలిస్తున్నామని వరంగల్‌ సీసీఎఫ్‌ ఎంజే అక్బర్‌, జిల్లా అటవీ అధికారి కే పురుషోత్తం పేర్కొన్నారు. ప్రస్తుతం టైగర్‌ ట్రాక్‌ నిపుణులు పులి పాదముద్రలను బట్టి చిట్యాల మండలం వెంచారం నుంచి మానేరు గుండా (భూపాలపల్లి-పెద్దపల్లి సరిహద్దు) పెద్దపల్లి అడవులకు వెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు. 

నర్సింగాపూర్‌ అడవుల్లో రెండు పులులు

భీమారం: మంచిర్యాల జిల్లా భీమారం మండలం నర్సింగాపూర్‌ అడవుల్లో సుద్దవా గు ఒడ్డుకు శనివారం రెండు పులులు దాడి చేసి మూడు ఆవులను హతమార్చాయి. కాజీపల్లికి చెందిన పశువుల కాపరులు ఉదయం ఖాజీపల్లి నుంచి నర్సింగాపూర్‌-వెంకటపూర్‌ అడవుల్లోకి పశువులను తోలుకెళ్లారు. ఒక్కసారిగా రెండు పెద్దపులులు మూడు ఆవుల వెం ట పడటంతో కాపరులు గ్రామంలోకి పరుగు లు తీశారు. తిరిగి సాయంత్రం వెళ్లి చూసే సరికి మూడు ఆవులు మృతిచెంది ఉండటం తో అటవీ అధికారులకు సమాచారమిచ్చారు.


logo