ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 04, 2020 , 19:46:39

కన్న కూతుళ్లకు విషమిచ్చిన తండ్రి.. సంఘటనపై తీవ్రంగా స్పందించిన మంత్రి

కన్న కూతుళ్లకు విషమిచ్చిన తండ్రి.. సంఘటనపై తీవ్రంగా స్పందించిన మంత్రి

మహబూబ్ నగర్ : జిల్లాలోని గండీడ్ మండలానికి చెందిన కృష్ణవేణి, చెన్నకేశవులు దంపతులకు మొదటి కాన్పులో ఆడపిల్ల జన్మించింది. ఆ తరువాత కాన్పులో కూడా ఇటీవలే కృష్ణవేణి ఇద్దరు పండంటి కవల ఆడ శిశువులకు జన్మనిచ్చింది. కుమారుడు పుట్టాలని ఆశించిన చెన్నకేశవులుకు నిరాశే ఎదురైంది. కసాయిగా మారిన తండ్రే ఇద్దరు పిల్లలకు విషమిచ్చాడు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన పిల్లల్ని జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు చిన్న పిల్లల దవాఖానకి తరలించారు. 

పిల్లల ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పిల్లలకు విషమిచ్చిన ఉదంతాన్ని తెలుసుకున్న మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హుటాహుటిన దవాఖానకు చేరుకున్నారు. అక్కడ పిల్లలకు అందుతున్న వైద్య చికిత్సపై వైద్యులతో మాట్లాడారు. ఎంత ఖర్చయినా పర్వాలేదని పిల్లలను బ్రతికించమని మంత్రి వైద్యులకు సూచించారు. 21వ శతాబ్దంలో కూడా ఆడపిల్లలను పురిట్లోనే చిదిమివేయాలనే భావ దారిద్ర్యం వేళ్ళూనుకుని ఉండటం సమాజంలో తరతరాలుగా పేరుకుపోయిన ఛాందస భావజాలానికి అద్ధం పడుతున్నట్లు మంత్రి తెలిపారు.


కన్నకూతుళ్లను కడతేర్చాలనుకున్న కసాయి తండ్రి పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో ఎక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కుమారుల కంటే కూతుళ్లు తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్నారన్నారు. మహిళలు అంటే చిన్నచూపు చూసే భావజాలాన్ని సమాజం విడనాడాలన్నారు.  తమ ప్రభుత్వం ఆడ పిల్లల పరిరక్షణ కోసం వారి అభ్యున్నతి కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

 


logo