బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 27, 2020 , 14:25:34

తెలంగాణలో మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు

తెలంగాణలో మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు

సూర్యాపేట : గత పాలకుల హయాంలో ఆదరణ కోల్పోయిన కుల వృతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణం పోశారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. జిల్లాలోని కాళేశ్వరం ఆయకట్టు చివరి చెరువు అయిన  పెన్ పహాడ్ మండలం మాచారం గ్రామంలో ని రావి చెరువు తో పాటు తన దత్తత గ్రామం అయిన చీదేళ్ల పెద్ద చెరువు  రెండు లక్షల  చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ..కుల వృత్తులను ప్రోత్సహించడంలో భాగంగానే ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.

మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ఉచితంగా 80 కోట్ల చేప పిల్లలు, 5 కోట్ల రొయ్య పిల్లలను చెరువుల్లో వేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. సముద్ర తీర ప్రాంతాల్లోని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కార్యక్రమం లేదన్న మంత్రి..అట్లాంటి రాష్ట్రాలతో మత్స్యసంపదలో పోటీపడి నీలి విప్లవం వైపు పయనిస్తున్నామన్నారు.


ముఖ్యమంత్రి కేసీఆర్ మత్యకారుల ముఖాల్లో సంతోషం నింపారన్నారు. తడి ఆరిన తెలంగాణ బీడు భూములను తడిపి సస్యశ్యామలం చేస్తూ గోదావరి జలాలు అందిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రాంతానికి పునరుజ్జీవం పోస్తున్నదని పేర్కొన్నారు.  కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, మండల ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ మామిడి అనిత, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు..


logo