శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Aug 13, 2020 , 00:11:27

రాయల్స్‌ ఫీల్డింగ్‌ కోచ్‌కు కరోనా

 రాయల్స్‌ ఫీల్డింగ్‌ కోచ్‌కు కరోనా

 


న్యూఢిల్లీ: ఐపీఎల్‌ ఫ్రాంచైజీల్లోనూ కరోనా కలవరం మొదలైంది. ఈ ఏడాది సీజన్‌ సమీపిస్తున్న వేళ రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు కరోనా వైరస్‌ సెగ తగిలింది. రాయల్స్‌ ఫీల్డింగ్‌ కోచ్‌ దిశాంత్‌ యాగ్నిక్‌ కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం బుధవారం ప్రకటించింది. సీజన్‌ కోసం వచ్చే వారంలో యూఏఈకి బయలుదేరే ఏర్పాట్లలో ఉండగా.. ఫ్రాంచైజీ సిబ్బందిలో నమోదైన తొలి కరోనా కేసు ఇదే. ‘ఫీల్డింగ్‌ కోచ్‌ దిశాంత్‌ యాగ్నిక్‌కు కొవిడ్‌-19 పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. యూఏఈకి వెళ్లేందుకు వచ్చే వారం జట్టు సభ్యులు ముంబైలో కలువనున్నారు. ఇందుకోసమే ఆయన కరోనా పరీక్ష చేయించుకున్నారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం యూఏఈకి వెళ్లే ముందు రెండు టెస్టులు చేయించాల్సి ఉండగా.. మేం ఆటగాళ్లు, సిబ్బంది అందరికీ అదనంగా ఇంకో పరీక్ష కూడా చేయిస్తాం’ అని రాజస్థాన్‌ ఫ్రాంచైజీ వెల్లడించింది. ప్రస్తుతం ఉదయ్‌పూర్‌లో ఉన్న యాగ్నిక్‌ 14రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. ఆ తర్వాత రెండుసార్లు టెస్టు చేయించుకొని నెగిటివ్‌ వస్తే యూఏఈకి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అక్కడికి వెళ్లాక ఆరురోజుల పాటు స్వీయ నిర్బంధంలో మరో మూడు కరోనా టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. పది రోజులుగా యాగ్నిక్‌ను ఫ్రాంచైజీకి చెందిన ఆటగాళ్లెవరూ కలువలేదని రాయల్స్‌ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ ఏడాది ఐపీఎల్‌ సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10వ తేదీ వరకు యూఏఈ వేదికగా జరుగనుంది. 


logo