సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Aug 05, 2020 , 03:35:29

హక్కుల వీరుల అస్తమయం

హక్కుల వీరుల అస్తమయం

  • కొవిడ్‌తో సీపీఎం నేత రాజయ్య మృతి
  • గుండెపోటుతో వంగపండు కన్నుమూత
  • ప్రజాకవి వంగపండు కన్నుమూత తెలంగాణ ఉద్యమానికి మద్దతునిచ్చిన జానపద దిగ్గజం  
  • సీఎం, మంత్రులు, నేతల సంతాపం

ఒకరు గిరిజన హక్కుల కోసం నిలబడి.. అసెంబ్లీలో నినదించిన నేత! మరొకరు అణగారిన వర్గాల హక్కుల కోసం వీధుల్లో గజ్జెకట్టి.. గళమెత్తిన యోధ! రాజకీయంగా దారులు వేరైనా, అంతిమంగా ప్రజల ఈతిబాధలే ఇతివృత్తాలుగా ఉద్యమాలు నిర్వహించిన వీరులు. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నేత సున్నం రాజయ్య.. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రముఖ విప్లవ కవి, వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు.. ఒకే రోజు అమరులయ్యారు. సున్నం రాజయ్యను కొవిడ్‌ కబళించింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న వంగపండు.. మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: ఏం పిల్లడో ఎల్దమొస్తవా.. శ్రీకాకుళంలో సీమకొండకు ఏంపిల్లడో ఎల్దమొస్తవా..! అంటూ దండుకట్టిన ప్రజావాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు(77) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విజయనగరం జిల్లా పార్వతీపురం వైకేఎంనగర్‌లోని తన నివాసంలో మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. మంగళవారం ఆయన స్వగ్రామమైన పెద్దబొండపల్లిలో పూర్తిచేశారు. ఆయన మూడు దశాబ్దాలపాటు 300కు పైగా జానపదగీతాలు రచించారు. 

వాటిలో 12 పాటలను గిరిజన మాండలికాలతోపాటు తమిళం, బెంగాళీ, కన్నడ, హిందీ తదితర భారతీయభాషల్లోకి అనువదించారు. ఆయన రాసిన ‘యంత్రమెట్టా నడుస్తు ఉందంటే’ పాట ఆంగ్లలోకి సైతం అనువదించబడి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని గడించింది. 1943లో పార్వతీపురం సమీపంలోని పెదబొండపల్లిలో జన్మించిన వంగపండు ‘అర్థరాత్రి స్వాతంత్య్రం’ సినిమాతో సినీప్రస్థానాన్ని ప్రారంభించారు. ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవ’ పాటతో ఉర్రూతలూగించారు. ఉత్తరాంధ్ర జానపదాలకు గజ్జెకట్టి ఆడిపాడారు. 1972లో పీపుల్స్‌వార్‌ సాంస్కృతిక విభాగం అయిన జన్యనాట్యమండలిని స్థాపించారు. ఉత్తరాంధ్ర గద్దర్‌గా పేరు తెచ్చుకున్న వంగపండు 2017లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి కళారత్న పురస్కారం అందుకున్నారు. 30కి పైగా సినిమాలకు పాటలు రాశారు. విప్లవ కవి వంగపండు మృతి పట్ల సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్‌, మంత్రులు కేటీఆర్‌, తన్నీరు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, తలసాని, వీ శ్రీనివాస్‌గౌడ్‌, సత్యవతిరాథోడ్‌, సబి తా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్‌, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ మాజీ వీసీ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రముఖ సాహితీవేత్త అమ్మంగి వేణుగోపాల్‌, 


కరీంనగర్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ ఏనుగు నర్సింహారెడ్డి, సినీ గేయ రచయితలు కాసర్ల శ్యాం, మౌనశ్రీ మల్లిక్‌, నామాల రవీంద్రసూరి, ఏపీ మం త్రులు, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు, సీపీఐ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, కే నారాయణ సంతాపం తెలిపారు. వంగపండు ప్రసాదరావు ఆకస్మిక మరణం పట్ల తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా(తానా) అధ్యక్షులు జయశేఖర్‌ తాళూరి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకుడు డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర సంతా పం తెలిపారు. ప్రజాగాయకుడు, ఉత్తరాంధ్ర వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు మృతి తెలు గు సాంస్కృతిక, కళారంగాలకు తీరనిలోటని తెలంగాణ సాహిత్య అకాడ మీ మాజీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి పేర్కొన్నారు.  ఉత్తరాంధ్ర యాసను, మౌఖిక గేయ సంపదను సొంతం చేసుకున్న గొప్పకవి వంగపండు ప్రసాదరావు అని ప్రజాకవి గోరటి వెంకన్న అన్నారు. వంగపండు మృతి పట్ల నివాళి అర్పిస్తున్నట్టు పేర్కొ న్నారు. 

తెలంగాణ ఉద్యమానికి మద్దతు  

ప్రజావాగ్గేయకారుడు, జానపద దిగ్గజం వంగపండు ప్రసాదరావు ఉత్తరాంధ్రవాసి అయినా.. తెలంగాణ ఉద్యమానికి సంపూ ర్ణ మద్దతు పలికారు. ఉద్యమ సమయంలో రాష్ట్రంలో పలు ధూంధాం కార్యక్రమాల్లో గజ్జెకట్టి ఆడిపాడారు. సీమాంధ్రలోను రాష్ట్ర విభజన ఆవశ్యకతను అక్కడి ప్రజలకు తన ఆటపాటల ద్వారా వివరించారు.  

వంగపండు లేరనే వార్త బాధించింది: ఏపీ సీఎం  జగన్‌

వంగపండు ప్రసాదరావు మృతికి ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ‘వంగపండు లేరన్న వార్త ఎంతో బాధించింది. జానపదాన్ని తన బాణీగా మార్చుకుని.. పామును పొడిచిన చీమలున్నయంటూ ఉత్తరాంధ్ర ఉద్య మానికి అక్షర సేనానిగా మారారు’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.  

పాటలతో చైతన్యం నింపిన వంగపండు : సీఎం కేసీఆర్‌ 

ప్రఖ్యాత జానపద వాగ్గేయకారుడు, గాయకుడు వంగపండు ప్రసాదరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల బాధలు, సమస్యలు, ప్రజాఉద్యమాలే ఇతివృత్తంగా పాటలు రాసి, పాడి చైతన్యం తీసుకురావడానికి జీవితాంతం పాటుపడ్డారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


logo