శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Aug 01, 2020 , 02:20:38

కరోనా నేరుగా వైరస్‌ను ఎక్కిస్తే?

కరోనా  నేరుగా వైరస్‌ను ఎక్కిస్తే?

  • l కరోనా వ్యాక్సిన్‌ రూపకల్పనకు మరో షార్ట్‌కట్‌
  • l ప్రయోగాలకు అమెరికాలో వలంటీర్ల ఎంపిక
  • l టీకాను త్వరగా రూపొందించేందుకు సరైన పద్ధతి 
  • l ‘వన్‌ డే సూనర్‌' బృందం శాస్త్రవేత్తల కొత్త ప్రతిపాదన
  • l అనైతికం, ప్రమాదకరమంటూ మరికొందరి వ్యతిరేకత

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మానవాళికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్న కరోనా వైరస్‌కు టీకాను కనుగొనేందుకు సరికొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినా.. మానవ ప్రయోగాల దశ ఎక్కువగా సమయం తీసుకుంటుండటంతో ఇప్పటికే సమయాన్ని కుదించి ‘షార్ట్‌కట్‌' పద్ధతి వాడుతున్నారు. అయినా సమర్థ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడానికి మరో 6 నెలల నుంచి ఏదాది సమయం పట్టే అవకాశం ఉండటంతో ‘హ్యూమన్‌ చాలెంజ్‌ ట్రయల్స్‌' చేపట్టాలని కొందరు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అమెరికా వంటి దేశాల్లో ఇప్పటికే ఈ ట్రయల్స్‌ కోసం వలంటీర్ల ఎంపిక మొదలైంది. 

రెండు దశల్లో సామర్థ్యం నిర్ధారణ 

సాధారణంగా వ్యాక్సిన్‌ను మానవులపై ప్రయోగించిన తర్వాత దాని పనితీరును రెండుదశల్లో అంచనావేస్తారు. వ్యాక్సిన్‌కు శరీరంలోని రోగనిరోధక శక్తి స్పందించి ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసిందో లేదో తెలుసుకోవడం మొదటి దశ. రెండో దశలో వ్యాక్సిన్‌ వేసుకున్న వలంటీర్లను బహిరంగప్రాంతాల్లో తిరగనిచ్చి లేదా వారి రోజువారీ జీవితంలో సహజంగా వైరస్‌ సోకేలా చేస్తారు. అప్పటికే శరీరంలో ఉన్న ప్రతిరక్షకాలు ఆ వైరస్‌ను ఎదురిస్తున్నాయో లేదో పరీక్షిస్తారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అవలంబిస్తున్న విధానం ఇది. 

వైరస్‌ను ఎక్కించేస్తారు 

వ్యాక్సిన్‌ తీసుకున్న వలంటీర్లకు సహజంగా మళ్లీ వైరస్‌ సోకడానికి ఆరునెలల నుంచి కొన్నేండ్ల సమయం పట్టొచ్చు. కరోనా విషయంలో అంత సమయం లేకపోవడంతో ‘హ్యూమన్‌ చాలెంజ్‌ ట్రయల్స్‌' విధానం తెరపైకి వచ్చింది. ఇందులో వలంటీర్లను ఎంపిక చేసుకొని, వారికి ముందుగా వ్యాక్సిన్‌ వేస్తారు. ప్రతిరక్షకాలు ఉత్పత్తి అయ్యాయని నిర్ధారించుకున్న తర్వాత నేరుగా సజీవ వైరస్‌ను ఎక్కిస్తారు. తర్వాత వ్యాక్సిన్‌ పనితీరును పరిశీలిస్తారు. 15 మంది నోబెల్‌ గ్రహీతలు, వందమందికిపైగా శాస్త్రవేత్తలున్న ‘వన్‌ డే సూనర్‌' అనే బృందం ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఈ విధానంలో టీకా పనితీరును అతిత్వరగా అంచనా వేయగలుగుతామని, వేగంగా అందుబాటులోకి వస్తుందని వారు చెప్తున్నారు. అమెరికాలో హ్యూమన్‌ చాలెంజ్‌ ట్రయల్స్‌కు ఇప్పటికే వలంటీర్ల ఎంపిక జరుగుతున్నది. ఈ నెలలోనే ప్రయోగాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. 


logo